logo

గెలుపే లక్ష్యం.. చేరికలకు ప్రాధాన్యం

పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు.

Updated : 01 May 2024 05:47 IST

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే 

పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. కీలక నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఓవైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చేరికలతో ఎంతో కొంత కలిసివస్తుందని భావించి అందుకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. పల్లె, పట్టణం, మండలస్థాయి ప్రజాప్రతినిధులు, కీలక ద్వితీయ శ్రేణి నాయకులు ప్రధానపార్టీల్లో చేరుతున్నారు. వారితో ఎంతోకొంత కలిసి వస్తుందని భావిస్తూ చేరికలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజల్లో వారికున్న ఆదరణ తమకు ఓట్ల రూపంలో లబ్ధి కలుగుతుందని అంచనా వేసుకుంటున్నారు. జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలో కొనసాగుతున్న చేరికలపై కథనం..

సంప్రదిస్తూ.. పార్టీలోకి ఆహ్వానిస్తూ!

లోక్‌సభ పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో జిల్లాలో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భానుడి భగభగ కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పల్లెలు, పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇక రాత్రివేళల్లో తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు వివరాలను మధ్యవర్తుల ద్వారా ఆరా తీస్తూ పార్టీలోకి వచ్చేలా చేస్తున్నారు. పార్టీలోకి వస్తామనే నేతల ఓటు బ్యాంకు ఎంత? సామాజిక వర్గంలో వారికున్న బలం ఆధారంగా అభ్యర్థులు వారికి భవిష్యత్తు భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పదవుల్లో కొనసాగుతున్న వారితో పాటు కీలక నేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే పార్టీలో సముచిత స్థానంతో అన్నివిధాల అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.

సొంత పార్టీ నాయకుల నిరసన..

ఈ చేరికలపై సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పార్టీలోకి చేర్చుకోవద్దని బహిరంగంగానే ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో చేరికలను సొంత పార్టీ నాయకులే అడ్డుకొని ఆందోళన చేశారు. చేరికలతో తమకు కలిసి వస్తుందని భావిస్తున్న నేతలు వారిని మరోలా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర ప్రాంతాల్లో చేరికలు ఉన్న సమయంలో వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నవారు గెలిచిన తర్వాత పార్టీలోకి తీసుకోవడంపై నాయకులు, కార్యకర్తల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇది ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి.

  •  జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని రెండు మండలాలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. వీరి చేరికలతో తమకు ఎంతోకొంత కలిసివస్తుందని నేతలు భావిస్తుండగా.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుచూపుతో వారొస్తున్నారని సొంత పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
  •  జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని పురపాలికకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు మండలానికి చెందిన మహిళా ప్రతినిధిని సొంత పార్టీని వీడి మరో పార్టీలో చేరారు. వీరి చేరిక రాజకీయాల్లో అనూహ్యంగా పలువురు పేర్కొంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు