logo

సమస్యలు అనేకం.. పరిష్కరించే వారితో మమేకం

కేంద్ర కార్మికశాఖ సేకరించిన వివరాల ప్రకారం దేశంలోని శ్రామికశక్తిలో దాదాపు 93 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. 2011 నాటి లెక్కల ప్రకారం 47.41 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా.

Published : 01 May 2024 03:03 IST

నేడు కార్మిక దినోత్సవం 

కేంద్ర కార్మికశాఖ సేకరించిన వివరాల ప్రకారం దేశంలోని శ్రామికశక్తిలో దాదాపు 93 శాతం అసంఘటితరంగంలో ఉన్నారు. 2011 నాటి లెక్కల ప్రకారం 47.41 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నట్లు అంచనా.

ఉమ్మడి జిల్లాలో సంఘటిత అసంఘటితరంగ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏటా మేడే సందర్భంగా నాయకులు ఉపన్యాసాలు ఇవ్వడం, పాలకులు శుభాకాంక్షలు చెప్పడం, నచ్చిన  నేతలకు శ్రమశక్తి పురస్కారాలు ఇవ్వడం మినహా, వారి సామాజిక ఆర్థిక సమస్యల గురించి ఆలోచించేవారు కరవయ్యారనే ఆరోపణలున్నాయి. గత 45 ఏళ్లలో ఎప్పుడూలేనంతగా దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. సంఘటితరంగంలో ఉన్న కార్మికుల సంఖ్య నానాటికీ పడిపోతుండగా, అసంఘటితరంగ ఉద్యోగులు గణనీయంగా పెరుగుతున్నారు. గిగ్‌ కార్మికుల సంఖ్య నానాటికీ విస్తరిస్తోంది. రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్మాణ రంగంలో అనుబంధ పనులు చేసేవారు.. ఇలా అసంఘటిత రంగం గణనీయంగా విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేవారి కోసం శ్రామికులు కాగడా వేసి వెదుకుతున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సమస్యలపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. నేడు మేడే సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌


శ్రామిక శక్తికి అడ్డాగా మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, ఎస్టీపీపీ, దేవాపూర్‌ సిమెంటు కర్మాగారం, సెరామిక్‌ పరిశ్రమలతో పాటు, ఇటుక బట్టీ కార్మికులు, భవన నిర్మాణరంగం, హోటల్‌ పరిశ్రమల్లో పనిచేసేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరు కాకుండా రైతు కూలీలు, దుకాణాలు, గోదాముల్లో విధులు నిర్వర్తించేవారు,  చేతి, కుల వృత్తులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరందరి గణాంకాలు ప్రభుత్వాల వద్ద నమోదు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కేంద్రం అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా డాటాబేస్‌ నమోదును ఆన్‌లైన్‌లో చేపట్టినప్పటికీ, లక్షలాదిమందికి అసలు ప్రభుత్వ పథకాలే తెలియడం లేదు. సంఘటితరంగ ఉద్యోగులకు సామాజిక భద్రత, ఇతర సదుపాయాలు లభ్యమవుతున్నా, అసంఘటిత రంగంలో అసలు కార్మిక సంఘాల ఊసే ఉండటం లేదు. గిగ్‌ కార్మికుల సంఖ్య ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పెరిగిపోతోంది. వీరికి ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. క్యాబ్‌ డ్రైవర్లు, ఆటో కార్మికులు, స్విగ్గీ, జోమాటో, పొట్లాం, తదితర సంస్థల్లో పనిచేసేవారి సంఖ్య రోజురోజుకూ విస్తరిస్తోంది. కార్పొరేట్‌ స్థాయిలో దుకాణాలు పట్టణాల్లో పెరుగుతున్నాయి. వీటన్నింటితోపాటు సింగరేణి, ఎస్టీపీపీ, ఓరియంట్‌ సిమెంట్‌ కర్మాగారాల్లో పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించేవారు కరవయ్యారు. వీరికి ఈఎస్‌ఐ, సామాజిక భద్రత, గ్రాట్యుటీ, పింఛను తదితర సదుపాయాలు పొందేవారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసేవారు తమను తాము ఈ శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినా, దాని గురించి తెలిసినవారి సంఖ్య తక్కువే. వలస కార్మికుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉంటుందని అంచనా.

ఈ అంశాల ప్రస్తావన ఏదీ?

మేడే పోరాటానికి ముందున్న పరిస్థితులు తిరిగి నెలకొంటున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాల చట్టంలో ప్రభుత్వం పాత వేతనాలతోపాటు, కొత్తగా పారిశ్రామిక చట్టాలకు అనుగుణంగా రోజుకు రూ.178 సైతం ఇవ్వవచ్చనే వెసులుబాటు కల్పించడం, 8 గంటల పనివిధానంతోపాటు, అవకాశం ఉన్నచోట 12 గంటలు పనిచేయవచ్చనే వెసులుబాటు కల్పించడంతో మరోసారి పనిగంటల కోసం పోరాడే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కార్మిక నేతలు వి.సీతారామయ్య, ఎస్‌.నాగరాజ్‌గోపాల్‌, తదితరులు అభిప్రాయపడ్డారు. సంఘటితరంగ కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో వారి గురించి ప్రస్తావించే నాయకుల సంఖ్య తగ్గిపోతోంది. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్‌కు పోటీచేసే అభ్యర్థులు ఇటు సంఘటిత రంగం గురించి, అటు అసంఘటితవర్గం సమస్యలను ప్రస్తావించకపోవడం గమనార్హం.

హామీలు ఘనం.. చర్చలు కనం

బొగ్గు గని కార్మికుల భవితవ్యాన్ని నిర్ణయించే కొత్త గనుల సమస్యతోపాటు ఆదాయపు పన్ను నుంచి కార్మికులను మినహాయిస్తామంటూ దశాబ్దాలుగా పార్టీలు, నాయకులు హామీలు ఇస్తూనే ఉన్నా.. ఇప్పటివరకు కనీసం పార్లమెంటులో చర్చకు రాలేదు. ఒప్పంద ఉద్యోగులకు కోల్‌ ఇండియాతో సమానంగా హై పవర్‌ కమిటీ వేతనాలు అందడం లేదు. 1998 నుంచి ఇప్పటి వరకు విశ్రాంత ఉద్యోగులకు పింఛను సవరణకు నోచుకోలేదు. ఫలితంగా కొన్ని వేల మంది రూ. వెయ్యి లోపు పింఛన్‌ పొందుతున్నారు. విశ్రాంతులకు చెల్లించే వైద్య పథకంలోనూ వివక్ష కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప పరిష్కారమయ్యే సమస్యలపై పార్లమెంట్‌కు ఎన్నికయ్యే వారు తమ గళం వినిపించాల్సి ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచే కాకుండా, ఇతర బొగ్గు గనుల ప్రాంతాల నుంచి ఎన్నికయ్యేవారితో కలిసి ఒక ప్రణాళిక ప్రకారం పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తే తప్ప పరిష్కారానికి నోచుకునే అవకాశం కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని