sbi rewardz apk: బెంబేలెత్తిస్తున్న ‘ఎస్‌బీఐ’ సందేశం

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగింది. డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్‌కాల్స్‌ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్‌ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు.

Published : 18 May 2024 05:25 IST

సైబర్‌ నేరస్థుల కొత్త పంథా 

ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట వచ్చిన సందేశం, యాప్‌ లింకు

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగింది. డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్‌ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్‌కాల్స్‌ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్‌ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో సైబర్‌ మోసగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు  తెరతీస్తున్నారు. తాజాగా ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట నకిలీ లింకులను చేరవేస్తున్నారు.

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే:

తెలిసిన నంబరు నుంచి..

  • నిర్మల్‌ పట్టణానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ స్థానికంగా వీడియోగ్రాఫర్‌. పరిచయాలు ఎక్కువ. ఇతడి వాట్సప్‌ నంబరు నుంచి పలు గ్రూపులకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట సందేశం చేరింది. దీంతోపాటు ఓ లింకు కూడా జతైంది. ఎందుకిలా పంపిస్తున్నారని అందరూ విస్తుపోయారు. ఒకరిద్దరు అతడికి కాల్‌ చేసి విషయంపై ఆరా తీశారు. తన ఫోన్‌లో వాట్సప్‌ పనిచేయడం లేదని, తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్‌ చేశారని చెప్పడంతో వారు విస్తుపోయారు. లింకులేవీ తెరవొద్దని సూచించారు.
  • ఇటీవల జైనూరు మండలం శివునూర్‌కు చెందిన ఓ యువ రైతు ఈ లింకు బారిన పడి డబ్బులు నష్టపోయారు. తమ గ్రామం పేరిట ఉన్న వాట్సప్‌ గ్రూపులో ఎస్‌బీఐ రివార్డ్స్‌ లింకు రావడంతో నిజమని దాన్ని తెరిచారు. అతడి ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా అయినట్లు సందేశం  రావడంతో విస్తుపోయారు. వెంటనే పోలీసులకు, బ్యాంకు మేనేజరుకు ఫిర్యాదు చేశారు.

ఇవి తాజాగా ఉమ్మడి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఘటనలు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరిట వాట్సప్‌లో రివార్డ్స్‌ లింకు విస్తృతంగా ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే ఇది వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోయేందుకు అవకాశం ఏర్పడుతోంది. ‘మీ ఎస్‌బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి, తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’.. అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ యోనో పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు. 

వివరాలు మారిపోతున్నాయి..

ఎవరైనా ఈ లింకును క్లిక్‌ చేసి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసేందుకు ప్రయత్నిస్తారో వారి వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటో, పేరు ఎస్‌బీఐగా మారిపోతున్నాయి.   వివరాల్లో ఎస్‌బీఐ హెల్ప్‌లైన్‌ అంటూ వస్తుండటంతో చూసేవారందరూ అది నిజమైనదే కావొచ్చని భ్రమపడుతున్నారు. బాధితుడి ప్రమేయం లేకుండా అతడి ఫోన్‌లోని వివిధ వాట్సాప్‌ గ్రూపులకు సైతం ఈ లింకులు పోస్ట్‌ అవుతున్నాయి. పెద్దసంఖ్యలో వాట్సాప్‌ వినియోగదారులకు చేరుతుండటంతో ఒకరిద్దరు దీని బారినపడినా డబ్బులు నష్టపోక తప్పదు. ఇలా ఈ చైన్‌ లింకు ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంది.

గుడ్డిగా నమ్మొద్దు 

డా.జి.జానకి షర్మిల, జిల్లా పోలీసు అధికారి

సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరిట వస్తున్న సందేశాలు సైతం ఈ తరహాలోనివే. తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిందనో, మనవారే పంపారు కదా అని గుడ్డిగా నమ్మేయకుండా అప్రమత్తంగా ఉండాలి. లింకులేవీ తెరవొద్దు. సైబర్‌ నేరస్థుల ఉచ్చులో పడొద్దు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్‌ పేరిట సిబ్బంది అందుబాటులో ఉన్నారు. సద్వినియోగం చేసుకోవాలి. అనుమానిత సందేశాలు, లింకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు