logo

‘గిరి’యువతకు ఉపాధి కరవు

ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్‌ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.

Published : 06 May 2024 05:25 IST

నిధుల లేమితో నిలిచిన శిక్షణ  
న్యూస్‌టుడే, ఉట్నూరు

ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్‌ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వెరసి ఉపాధి కల్పన అటకెక్కింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వేలాది మంది నిరుద్యోగ గిరిజన యువత నైపుణ్యాల శిక్షణ, స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సమస్యపై బరిలోఉన్న ఎంపీ అభ్యర్థులు దృష్టిసారించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఉట్నూరు, ఇచ్చోడ, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి మండలాల్లో 2016లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అయిదు యువజన శిక్షణ కేంద్రాల(వైటీసీ)ను నెలకొల్పింది. ప్రతి జిల్లాకు ఒక జాబ్‌ మేనేజర్‌తో పాటు వార్డెన్‌, మొబలైజర్లు, ఇన్‌స్ట్రక్టర్లను నియమించింది. వైటీసీల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.3 కోట్ల నుంచి 4 కోట్లను కేటాయించేది. దీంతో వైటీసీల పరిధిలోని మండలాలలోని నిరుద్యోగ ఆదివాసీ గిరిజన యువతీ, యువకులను ఎంపిక చేసి వారికి ఉచిత భోజనం, నివాస వసతిని కల్పిస్తూ.. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌, కన్‌స్ట్రక్షన్‌, బ్యూటీషియన్‌, జూట్‌ బ్యాగ్స్‌ తయారీ, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వంటి కోర్సులలో నైపుణ్యాల శిక్షణ కల్పించేవారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి కల్పించడంలో భాగంగా పెద్ద మొత్తంలో జాబ్‌ మేళాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించేవారు. ఏటా ఈ ప్రక్రియను ఎంతో సమర్థంగా నిర్వహిస్తూ యువతకు అండగా నిలుస్తూ వచ్చింది.

సర్కారీ కొలువుల కోసం..

నైపుణ్యాల శిక్షణ, కంపెనీలలో ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గిరిజన యువతకు పూర్వ ప్రాథమిక శిక్షణ కేంద్రం(పీఈటీసీ)లతో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, గ్రూప్‌-2, గ్రూప్‌-4, ఆర్‌ఆర్‌బీ, ఉపాధ్యాయ, అటవీశాఖ ఉద్యోగాలు కోసం ప్రత్యేక శిక్షణ కల్పించడం, ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందజేస్తూ ప్రోత్సహించేవారు.

ప్రస్తుత పరిస్థితి..

నిరుద్యోగ గిరిజన యువతకు అండగా నిలిచిన వైటీసీలు నిధులలేమి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. గతానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఐటీడీఏకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తోంది. వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాలు 2020-21 నుంచి 2023-24 వరకు నిధులు విడుదలను సర్కారు విస్మరించింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయిస్తామని ప్రకటించి ఆశలు రేకెత్తించింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నిధుల కేటాయించకపోవడంతో ఐటీడీఏ అధికారులు పంపించిన శిక్షణ కార్యక్రమాల ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. ఉపాధి కల్పన జాబ్‌ మేళాలు లేక నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా నిధులను కేటాయించి శిక్షణ  కార్యక్రమాలను పునరుద్ధరిస్తే గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది.


ఉపాధి సమస్య తీరుస్తా..
- ఆత్రం సుగుణ, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి

గత భారాస ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని సర్కారు నిరుద్యోగుల సమస్యలను గాలికొదిలేశాయి. వృత్తి నైపుణ్యాల శిక్షణ కేంద్రాలకు నిధులు కేటాయించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడంతో పాటు నిరుద్యోగ ఆదివాసీ గిరిజన యువతకు ఉపాధి సమస్యను తీరుస్తాను. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొత్త కోర్సులలో నైపుణ్యాల శిక్షణలు కల్పించేలా చర్యలు తీసుకుంటాను.


భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాం..
- గోడం నగేష్‌, భాజపా ఎంపీ అభ్యర్థి

వైటీసీలకు నిధులు కేటాయించక గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రస్తుత సర్కారు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం తగదు. గిరిజన యువతకు వృత్తి నైపుణ్యాల శిక్షణతో పాటు స్వయం ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడం, కేంద్ర సర్కారు ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా కృషి చేస్తాను.


పూర్వవైభవం తెచ్చేందుకు కృషి..
- ఆత్రం సక్కు, భారాస ఎంపీ అభ్యర్థి

ఆదివాసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆనాడు మా ప్రభుత్వం వైటీసీలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అరకొర బడ్జెట్‌ కేటాయించడంతో ఈ సమస్య ఏర్పడింది. రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తాను. ఉమ్మడి జిల్లాలో వైటీసీలకు పూర్వవైభవం తీసుకొచ్చి నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించేలా చూస్తాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని