logo

విరమణపై పెదవి విరుపు

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్‌) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్‌కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

Published : 08 May 2024 03:37 IST

ప్రయోజనాల విషయంలో ‘అంగన్‌వాడీ’ల భిన్నాభిప్రాయాలు

అంగన్‌వాడీ కేంద్రంలో ఆడుకుంటున్న చిన్నారులు (పాత చిత్రం)

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ ప్రయోజనాలు (బెనిఫిట్స్‌) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65ఏళ్లు నిండిన టీచర్‌కు రూ.లక్ష, సహాయకులకు రూ.50వేలు సహాయం ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఈ వయసు నిండిన వారి వివరాలను పంపించాలని రాష్ట్రశాఖ ఆదేశించడంతో.. సంబంధిత జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. అయితే తాము కోరిన మేరకు కాకుండా చాలా తక్కువగా ఇస్తున్నారని కొందరు నిరాశకు గురవుతున్నారు.

జిల్లాలో అయిదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో టీచర్‌, ఆయాలు సేవలందిస్తారు. ఇంత కాలం వీరికి వేతనం మినహా పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఆర్థికసాయం పొందేవారు కాదు. తమకు భద్రత కల్పించి పదవీ విరమణ అనంతరం టీచర్‌కు రూ.5 లక్షలు, ఆయాకు రూ.2 లక్షల సాయం, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలంటూ.. పోరాటాలు చేస్తున్నారు. భారాస ప్రభుత్వం పదవీ విరమణ సాయం టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ సైతం తాము అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలు, ఆశాలకు నెలకు రూ.18 వేలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఆ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే తాజా నిర్ణయం కొందరిలో ఉత్సాహాన్ని మరికొందరిలో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష అయినా చెల్లించేలా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

జిల్లాలో 156 మంది..

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 65ఏళ్లు నిండిన టీచర్లు, ఆయాల వివరాలను జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఏప్రిల్‌ 30 వరకు ఈ వయసు నిండిన టీచర్లు 31, ఆయాలు 125 మంది ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల నియమావళి నేపథ్యంలో.. వీరిని తొలగించేలా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. సమాచారం పంపించాలన్న ఆదేశాలతో వివరాలు సేకరిస్తున్నారు.

వయసు నిర్ధారణపై అయోమయం..

వయసు నిర్ధారణ విషయంలో అయోమయం నెలకొంది. బోనఫైడ్‌, టీసీ, పదో తరగతి మార్కుల మెమో ఇలా.. ఏదో ఒక ధ్రువపత్రం అవసరమని అధికారులు చెబుతున్నారు. టీచర్లలో చాలామంది చదువుకున్న వారు ఉండడంతో.. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు ఉన్నా.. సహాయకుల్లో చాలా మందికి ఇవి లేకపోవడం ఇబ్బందిగా మారింది. కొందరికి ఆధార్‌లలో ఎక్కువ, తక్కువ వయసులు నమోదయ్యాయి. కానీ వీటిని ప్రామాణికంగా తీసుకోవడం లేదు. పుట్టిన తేదీ ధ్రువపత్రం లేని వారు వయసు నిర్ధారణ కోసం ఎముక సాంధ్రత పరీక్ష (బోన్‌ డెన్‌స్టోమెట్రిక్‌) చేయించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాస్థాయి వైద్యాధికారితో ధ్రువపత్రం తీసుకోవాలని సూచించారు. దీని కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోనే ఈ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. కొందరు వయసు ధ్రువ పత్రాలు తీసుకుంటున్నా.. అందులో కచ్చితమైన వయసు వేయకుండా 45-50, 60-65.. మధ్య ఉండవచ్చని జారీ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని