సమస్యలెన్నో.. చర్చిస్తారా మరి..!
నిధుల కొరతతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. నిబంధనల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయి.
నేడు ఉమ్మడి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం
ఈనాడు డిజిటల్, పాడేరు
నిధుల కొరతతో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. నిబంధనల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయి. అధికారులు, పాలకపక్ష నేతల మధ్య సమన్వయం కొరవడుతోంది. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వీటి గురించి జిల్లాస్థాయి వేదికలపై చర్చిస్తేనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఎప్పుడూ చొరవ చూపడం లేదు. సొంత సమస్యలు, ప్రొటోకాల్ వివాదాలకే ఆయా సమావేశాలను పరిమితం చేస్తున్నారు. నేడు విశాఖలో ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం ఛైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.982.88 కోట్లు ఆదాయం గానూ 980.93 కోట్లు వ్యయంగానూ చూపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 173 కోట్ల ఆదాయం తగ్గనున్నట్లు జెడ్పీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సమావేశంలోనైనా నేతలు ప్రజా సమస్యలపై చర్చిస్తారా లేదో చూడాలి.
నాడు..నేడు అస్తవ్యస్తం..
కశింకోట ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా చేసిన నాడు-నేడు పనులు
పాఠశాలలు..ఆసుపత్రుల్లో చేపడుతున్న నాడు నేడు పనులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. పాఠశాలల్లో రెండో విడత చేపడుతున్న నాడునేడు పనులకు నిధుల సమస్య వెంటాడుతోంది. దీంతో చాలావరకు అరకొరగానే పనులు చేసి అసంపూర్తిగా వదిలేస్తున్నారు. విలీనం జరిగి అవసరం లేని పాఠశాలల్లో కూడా ఈ పనులు చేపడుతున్నారు. కశింకోట ప్రాథమిక పాఠశాల నుంచి 120 మందికి పైగా పిల్లలు ఉన్నత పాఠశాలకు పంపించేశారు. ఉన్న ఒకటి రెండు తరగతులకు నాడు నేడు కింద రూ.18 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులైనా పూర్తిచేశారంటే అదీలేదు.. గ్రానైట్ పలకలు వేసి వదిలేశారు. నిధుల్లేకపోవడంతో మిగతా పనులపై ముందుకు వెళ్లడం లేదు. కొన్ని పాఠశాలల్లో ముందు అదనపు గదులు మంజూరుచేసి తర్వాత రద్దుచేశారు. ఇసుక, సిమెంటు సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదు. ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు అసంపూర్తిగానే ఉంటున్నాయి. దేవరాపల్లి ఆసుపత్రి గురించి గత రెండు సమావేశాల్లో చర్చించినా పనులు పూర్తి చేయలేకపోయారు. మిగతా చోట్లా పనులు అదేతీరుగా ఉన్నాయి.
గుంతలు పూడ్చలేదు..
రహదారుల మరమ్మతులు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కమిటీ నిధులతో పీఆర్ రోడ్లపై గుంతలు పూడ్చడానికి టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. 120 కి.మీ మేర గోతులతో దర్శనమిస్తున్నాయి. ర.భ.శా పరిధిలో కొన్ని పనుల జరిగినా ముఖ్యమైన రహదారులను బాగుచేయలేకపోయారు. కశింకోట-బంగారుమెట్ట రోడ్డుకు ఒకవైపు మంత్రి అమర్‌నాథ్, మరోవైపు ప్రభుత్వ విప్ ధర్మశ్రీ శంకుస్థాపన చేసినా పనులు కార్యరూపంలోకి రాలేదు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. రూ.138 కోట్లతో పది రహదారులను ఒక గుత్తేదారుకు అప్పగిస్తే ఇప్పటి వరకు ఒక్కటీ పూర్తిచేయలేదు.
ధాన్యం కొనుగోళ్లుపైనా అనుమానం..
గతేడాది ఉమ్మడి జిల్లాలో 1.3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకుని కేవలం 43 వేల టన్నులే కొన్నారు. మిగతా ధాన్యమంతా దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. గోనెసంచుల కొరత, మిల్లర్ల మాయాజాలం, ఆర్బీకే సిబ్బంది చేతివాటం వంటి ఆరోపణలు చాలావరకు వినిపించాయి. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు సహకార సంఘాలు అప్పుడే వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది లక్ష్యం మేర కొనుగోలు చేస్తారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
* ఉపాధిహామీ వేతనదారులకు రెండు నెలలు కూలి డబ్బులు అందలేదు. దీంతో వారంతా ఈ పనులకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల అనుసంధాన పనులకు నిధుల మంజూరుపైనా ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
* జల్‌జీవన్ మిషన్ పథకంలో చేపడుతున్న ఇంటింటా కుళాయి కనెక్షన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల్లో నాసిరకమైన పైపులు వినియోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
* జడ్పీ నిధులు రూ.12 కోట్లతో మంజూరు చేసిన పనులు చాలాచోట్ల అసంపూర్తిగా ఉండిపోయాయి. పనులు చేస్తే బిల్లులు చెల్లిస్తారా లేదనన్న అనుమానంతో ఈ పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకురావడం లేదు.
* ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు మూడేళ్లుగా నిలిచిపోయాయి. రైతులకు మొక్కలు సరఫరా నిలిపేశారు. సుమారు రూ.8 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ సొమ్ములు చెల్లిస్తే ఉద్యాన రైతులకు భారం తగ్గడానికి అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్