logo

నేరేడుబందలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

నేరేడుబందలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు అందజేయాలని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.

Published : 03 Feb 2023 04:23 IST

మహిళలతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో

జి.మాడుగుల, న్యూస్‌టుడే: నేరేడుబందలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు అందజేయాలని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఈనాడులో గత నెల 28న ‘నేరేడుబంద.. సమస్యలే నిండా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి పీవో స్పందించి జి.మాడుగుల- రావికమతం మండలాల సరిహద్దులోని అత్యంత మారుమూల గిరిజన గ్రామం నేరేడుబందలో గురువారం పర్యటించారు. ఎనిమిది కిలోమీటర్లు కొండలు, గుట్టలు, గెడ్డలు దాటుకుంటూ కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఐటీడీఏ పీవో మొట్టమొదటి సారిగా పర్యటించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తంచేశారు. నేరేడుబంద గ్రామానికి గ్రావిటీ పథకాన్ని మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో గ్రామస్థులు చందాలతో నిర్మించుకున్న పెంకుల షెడ్డును పరిశీలించారు. బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని గిరిజన సంక్షేమాధికారిని ఆదేశించారు. పాఠశాలకు రేకుల షెడ్డు నిర్మాణానికి రూ. లక్ష మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పెదగరువు, అజేయపురం, జీలుగులోవ గ్రామాలను సందర్శించారు. పెదగరువులో అటవీ హక్కు పత్రాల పంపిణీ, భూ సమస్యలను గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకురావడంతో వెంటనే పరిష్కరించాలని రావికమతం తహసీల్దారును ఆదేశించారు. జీలుగులోవలో ఏడు గిరిజన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి రూ.50 వేల చొప్పున మంజూరు చేశారు. గ్రామానికి విద్యుత్తు సదుపాయం, ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్థులు కోరగా తగు చర్యలు చేపట్టాలని రావికమతం ఎంపీడీవోను ఆదేశించారు. జోగంపేట గ్రామానికి జియో టవర్‌ మంజూరైందని తెలిపారు. బొడ్డుమామిడిలో ఆధార్‌ శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రావికమతం ఎంపీడీవో వెంకన్నబాబు, తహసీల్దారు మహేష్‌ పాల్గొన్నారు.

గ్రామానికి కాలినడకన చేరుకుంటున్న పీవో గోపాలకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని