logo

31న మన్యం బంద్‌

బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్‌ చేపట్టనున్నట్లు ఆదివాసీ ఉద్యమ జేఏసీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు రామారావుదొర, శేషాద్రి, గంగులయ్య తెలిపారు.

Published : 27 Mar 2023 04:38 IST

పాడేరులో సమావేశమైన ఆదివాసీ ఉద్యమ జేఏసీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు

పాడేరు పట్టణం, అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్‌ చేపట్టనున్నట్లు ఆదివాసీ ఉద్యమ జేఏసీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు రామారావుదొర, శేషాద్రి, గంగులయ్య తెలిపారు. ఆదివారం పాడేరు గిరిజన్‌ భవనంలో, అరకులోయలో అఖిలపక్ష  సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పోరాటం ఉద్ధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆదివాసీ ఉద్యమ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర మాట్లాడుతూ శాసనసభలో తీర్మానాలతో షెడ్యూల్డ్‌ తెగల్లో మార్పులు, చేర్పులు సాధ్యం కాదన్నారు. ఏదైనా తెగ, జాతిని ఎస్టీలో చేర్చాలనుకుంటే రాజ్యాంగం ప్రకారం కొన్ని విధివిధానాలు ఉన్నాయన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, కలెక్టర్‌, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శికి ఆయా జాతుల జీవన, ఆర్థిక స్థితిగతులు, సాంఘిక పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని ఉందన్నారు. ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా  కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతిపత్రాల సమర్పణ, 28, 29 తేదీల్లో మన్యం బంద్‌ విజయవంతానికి విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. 31న జరిగే బంద్‌లో భాగంగా ప్రధాన రోడ్లపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. గిరిజన సంఘం జాతీయ నాయకులు పి. అప్పలనర్స,  గంగరాజు, బాబూరావు, జనసేన అరకు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి గంగులయ్య, శాంతికుమారి, శేషాద్రి, భాషా వాలంటీరు సంఘం నాయకులు కుమారి, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని