logo

కలుషితాహారం తిని 39 మందికి అస్వస్థత

అరమ పంచాయతీ మారుమూల గ్రామం నడిమివలసలో కల్తీ ఆహారాన్ని తిని పలువురు అస్వస్థతకు గురైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Mar 2023 03:40 IST

అరకులోయ ఆసుపత్రికి 12మంది తరలింపు

ప్రాంతీయాసుపత్రిలో బాధిత బాలలకు చికిత్స

డుంబ్రిగుడ, అరకులోయ, న్యూస్‌టుడే: అరమ పంచాయతీ మారుమూల గ్రామం నడిమివలసలో కల్తీ ఆహారాన్ని తిని పలువురు అస్వస్థతకు గురైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఓ గిరిజనుడి ఇంట శనివారం సాయంత్రం జరిగిన శుభకార్యానికి విందు ఏర్పాటు చేశారు. మిగిలిన ఆహారాన్ని ఆదివారం ఉదయం తిన్న వారంతా ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, తల బరువు ఎక్కడం, కాళ్లు చేతులు పీకడం వంటి లక్షణాలతో మంచాన పడ్డారు. ఇలా 39 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధిత కుటుంబీకుల సమాచారం మేరకు వైద్య సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని పరీక్షలు నిర్వహించారు. వంతల సూచన (9), కెవిల్‌ (4), శామ్యూల్‌ (6), ఇస్మాయిల్‌ (2), ఎలిషా (4), ఇషాక్‌ (9), యాకోబు (6), జయరాం (5) చిన్నారులతో పాటు మరో నలుగురు పెద్దలు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో అరకులోయ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి గ్రామంలోనే వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన బాధితులను సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర, రామారావు తదితరులు పరామర్శించారు.

నడిమివలసలో విచారణ చేస్తున్న అధికారులు

ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ ముజీబ్‌, ఎంపీడీవో నగేష్‌, వైద్యాధికారిణి ప్రేమ, సంబంధిత అధికారులు ఆ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలో తాగునీటి వనరులను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ మహేష్‌, సిబ్బంది పరీక్షించారు. ఇక్కడ గ్రావిటీ పథకం ద్వారా నీరందుతోంది. ఏటా వేసవికి నెల రోజుల ముందే చుక్క నీరందని పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక పొలాల్లోని ఊట నీటితో దాహం తీర్చుకోవాల్సి వస్తోందని, అనారోగ్యంతో పడుతున్నామని అధికారులకు మొరపెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని