logo

చెక్‌ డ్యామ్‌లపై జగన్‌ ఉక్కుపాదం

గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్‌డ్యామ్‌లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు.

Published : 25 Apr 2024 02:19 IST

సాగునీరందక రైతుల అవస్థలు

శరభన్నపాలెం సమీపంలో బాగుపడని చెక్‌డ్యామ్‌

కొయ్యూరు, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్‌డ్యామ్‌లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పడం తప్ప సాగు నీరందించడంలో వైకాపా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు.

కొయ్యూరు మండలంలో 128 చెక్‌డ్యాంలు, కించెవానిపాలెం, లుబ్బుర్తి, చుట్టుబంద సమీప తొణుకులగెడ్డ జలాశయాలున్నాయి. వీటి పరిధిలో 15 వేల ఎకరాల్లో భూములు సాగవుతున్నాయి. మంప, మర్రివాడ, బూదరాళ్ల, శరభన్నపాలెం, మఠంభీమవరం, కొమ్మిక తదితర పంచాయతీల్లో సుమారు 50 చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేయాలని ప్రభుత్వానికి మొరపెడుతున్నా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఏడు వేల ఎకరాల్లో పొలాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. మర్రివాడ- దొడ్డవరం మధ్యలోని చెక్‌డ్యాంకు సంబంధించి సిమెంట్‌ దోనె గతేడాది కూలిపోవడంతో ఖరీఫ్‌లో సైతం పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి మరమ్మతులు చేపట్టి ఉంటే రెండు పంటలకు ఉపయోగపడేది. కించెవానిపాలెం జలాశయం మరమ్మతులకు రూ.1.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. చేసిన కొంత పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. లుబ్బుర్తి జలాశయం మరమ్మతులు దాదాపు పూర్తయినా బిల్లులు ఇవ్వలేదు. చుట్టుబంద సమీపంలోని తొణుకుల గెడ్డ జలాశయం గేటు, కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆ ప్రాంతంలోని వందలాది మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని బాగు చేయించాలని ఐటీడీఏ పీవో, ప్రజాప్రతినిధులకు మొరపెట్టినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖరీఫ్‌ ప్రారంభంలోగా మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ప్రభుత్వానికి ప్రతిపాదించాం

కొయ్యూరు మండలంలో 40 చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు గురయ్యాయని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. నిధులు విడుదల కాగానే పనులు చేయిస్తాం. కించెవానిపాలెం, లుబ్బుర్తి జలాశయాల మరమ్మతులకు నిధులు మంజూరైతే పనులు కొంతమేర చేయించారు. ఇటీవల ఐదు చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి.

రామకృష్ణ, జేఈ, ఎస్‌ఎంఐ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని