logo

మూడో రోజూ అవే అవస్థలు..

మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్‌ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.

Published : 05 May 2024 01:33 IST

రేఖపల్లి బ్యాంకులో పింఛన్‌దారులు ..

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి మండలంతోపాటు, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతానికి చెందిన పింఛనుదారులు నగదు కోసం మారేడుమిల్లిలోని యూనియన్‌ బ్యాంకుకు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది.బ్యాంకు సిబ్బంది కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కావడంతో ఇతర లావాదేవీలు అన్నీ నిలిచిపోయాయి.

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మండలంలో మూడో రోజు పింఛనుదారుల రద్దీ కొంత తగ్గింది.  బ్యాంకులు, ప్రైవేట్‌ మనీ సర్వీస్‌ పాయింట్ల వద్ద బారులు తీరారు. బ్యాంకుల వద్ద  వచ్చిన వారికి నీడ, తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ సర్వీసుల వద్ద మాత్రం ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో పింఛన్‌దారులు ఇబ్బందులకు గురయ్యారు. రెండు బ్యాంకుల వద్ద రేఖపల్లి, జీడిగుప్ప వైద్య సిబ్బందితో శిబిరాలను కొనసాగించి,  30మందికి ఓఆర్‌ఎస్‌ ప్యాకిట్లు, ఇతర మందులు అందించారు.

ఇంటివద్దే పింఛను ఇవ్వండి

పింఛను పొందేందుకు టి.బూరుగుబంద గ్రామం నుంచి రంపచోడవరం వచ్చాను. నడవలేని పరిస్థితిలో ఉన్నా ఎవరూ పింఛను ఇచ్చేందుకు నా వద్దకు రాలేదు. కుటుంబ సభ్యుల సాయంతో బ్యాంకు వచ్చాను. వచ్చే నెలలో ఇంటివద్దనే ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.

కారం పరమయ్యదొర, లబ్ధిదారుడు, బూరుగుబంద

  • ఈమె పేరు ముర్రం ముత్తమ్మ గత నెలలో సచివాలయం సిబ్బంది ద్వారా పింఛను అందుకున్నారు. ఈ నెలలో  బ్యాంకులో నగదు జమయ్యిందని తీసుకోవడానికి వచ్చారు. ఈమెకు ఉన్న ఎస్బీఐ ఖాతాలో నగదు జమకాలేదు. ఏం చేయాలో తెలియక తిరిగి వెళ్లిపోయారు. అటు సచివాలయంలోకి వెళ్లినా సరైన సమాధానం లేదు. చేసేది లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి.
  • ఈమె పేరు ముర్రం భద్రమ్మ. పింఛన్‌ నగదు జమయిందని రూ.మూడు వేలు డ్రా చేశారు. ఆ తర్వాత బ్యాలన్స్‌ చూస్తే ముందుగా ఉన్న నిల్వ నుంచే తీసుకున్నట్లు కనపడింది. అప్పుడు తెలిసింది. పింఛను నగదు ఖాతాలో జమ కాలేదని గుర్తించారు.

ఎనిమిది కిలోమీటర్ల నడక

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెం యూనియన్‌ బ్యాంకు రావడానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకోట గ్రామానికి వాహన సదుపాయం లేదు. దీంతో ఇక్కడి పింఛనుదారులు ఉదయాన్నే బ్యాంకుకు కాలినడకన చేరుకుంటున్నారు. పింఛను తీసుకుని తిరిగి మండుటెండలో ఇళ్లకు బయలుదేరుతున్నారు. శనివారం కుంజా రామయ్య అనే వృద్ధుడు  కర్ర సాయంతో నేలకోట నుంచి రాను పోను 8 కి.మీ నడిచి నానా అవస్థలు పడ్డాడు. శుక్రవారం నేలకోటలోని ఓ వృద్ధుడి ఖాతా చింతూరు ఎస్పీబీహెచ్‌లో ఉంటే ఆ విషయం తెలియక మండుటెండలో నాలుగు కి.మీ నడిచి మోతుగూడెం యూనియన్‌ బ్యాంకుకు వచ్చాడు. అధికారులు చింతూరు బ్యాంకు అని చెప్పడంతో దేవుడా అంటూ మండుటెండలో తిరిగి నేలకోట తిరుగు ప్రయాణమయ్యాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి స్థానిక పీహెచ్‌సీ ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు