logo

చంద్రమోదీయం.. జనామోదం

ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు.

Published : 07 May 2024 06:58 IST

కూటమి కలయికతో వెల్లువెత్తిన ఉత్సాహం
మీ భవితకు నాదీ భరోసా
ఈనాడు అనకాపల్లి: న్యూస్‌టుడే, అనకాపల్లి/ పట్టణం,గ్రామీణం, కశింకోట, కొత్తూరు, ఎలమంచిలి

సభలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు భారీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో సభా ప్రాంగణం ప్రధాని మోదీ రాకకు గంటముందే నిండిపోయింది. ఇంకా వేలాదిమంది రోడ్లపైనే ఉండిపోవడంతో వారందరినీ సభాప్రాంగణం వెలుపల ఉన్న ఖాళీ స్థలం లోకి అనుమతించాలని సీఎం  రమేశ్‌ పోలీసులను కోరారు. వారంతా మోదీ ప్రసంగాన్ని బయట ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ తెరలపై తిలకించారు. పార్టీ జెండాలు పట్టుకుని దండులా కదలివచ్చిన మహిళలను చూసి ప్రధాని రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగించారు. సభ ప్రారంభమైనా అభిమానులు వస్తూనే ఉన్నారు. పరిసర గ్రామాల నుంచి రైతులు కాలినడకన ప్రాంగణానికి చేరుకున్నారు. చంటి బిడ్డలను భుజాన వేసుకుని తల్లులు, యువత పెద్దసంఖ్యలో తరలిరావడంతో జాతీయ రహదారి సైతం కిటకిటలాడింది.

ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు


బిడ్డల భవిష్యత్‌ అంధకారంలోకి..: గీత

కొత్తపల్లి గీతకు మోదీ దీవెనలు

జగన్‌ పాలనలో రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారని అరుకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. బిడ్డల భవిష్యత్‌ బాగుండాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. వైకాపా అభ్యర్థులను చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. అవినీతి పాలన అంతం చేయాలన్నారు. జగన్‌ పాలనలో దాడులు పెరిగాయన్నారు. రైతుల భూములకు, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సైకో ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గీత అన్నారు. జగన్‌ను జైలుకు పంపాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను ఆలోచించి మహిళలంతా ఆశీర్వదించి చంద్రబాబును ముఖ్యమంత్రి, మోదీని ప్రధానిని చేయాలని కోరారు.

యువత చంద్రబాబు, పవన్‌ల, చిత్రాలను ద్విచక్ర వాహనాలపై ఊరేగించుకుంటూ తీసుకెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. వాహనాలు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ ఆగకుండా వాహనాలన్నీ కార్యకర్తలు ఒక వరుసలో పెట్టించారు. జాతీయ రహదారి పొడవునా ఆటోలు పసుపు రైలులా కనువిందు చేశాయి.


మూడు పార్టీల కలయికతో ఉత్తరాంధ్ర ప్రగతి

ప్రధానితో తెదేపా అధినేత ముచ్చట్లు

‘యువత సైకిల్‌ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్‌ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మూడు పార్టీలు కలిశాక అన్ని స్థానాలను స్వీప్‌ చేస్తున్నాం. అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు, మూడు పార్టీల కలయికతో ఉత్తరాంధ్రలో ఊపు కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కూటమి అభ్యర్థులను ఎందుకు గెలిపించాలో వివరించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పరిచయం చేసి వారి బలాబలాలను తెలియజేస్తూ, వారు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతారో చెప్పారు. టికెట్లు దక్కని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైకాపా అధినేత జగన్‌ సిద్ధం సభల్లో తమ అభ్యర్థుల గురించి సౌమ్యుడు, మంచోడు అని చెప్పారే గాని వారు ఏంచేస్తారో చెప్పలేకపోయారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు మాత్రం కూటమి అభ్యర్థులు ఏం చేస్తారో చెప్పి ప్రజల్లో నమ్మకం పెంచారు.

రమేశ్‌ను గెలిపించండి

ఆకట్టుకున్న స్వాగత ద్వారం

భాజపా రంగుల తలపాగాలు ధరించిన కార్యకర్తలు

యువత కూటమి వెంటే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని