logo

Indrakiladri: దుర్గగుడి అభివృద్ధికి ప్రణాళికలు ఎన్నిసార్లు రూపొందిస్తారో?

‘విజయవాడ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా ప్రణాళికలే రూపొందించారు.

Updated : 26 Nov 2022 11:18 IST

రూ.70 కోట్లు వచ్చినా.. కాలయాపన

ఈనాడు, అమరావతి: ‘విజయవాడ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా ప్రణాళికలే రూపొందించారు. కానీ.. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయడంలో తీవ్ర జాప్యం అయ్యింది. అయినప్పటికీ ఆలయ నిధులతో కొన్ని పనులు చేపట్టారు. ప్రధానంగా అన్నదానం, ప్రసాదం పోటు భవనాల కోసం నమూనాలు సిద్ధం చేయడం, స్థలం చదును చేయడం వంటివి చేపట్టారు. దసరా వచ్చేయడంతో రాళ్లు జారిపడకుండా ఉండేందుకు.. రాక్‌ మిటిగేషన్‌ పనులు మాత్రం పూర్తిచేశారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. ఈలోగా కొత్తగా వచ్చిన దేవాదాయశాఖ మంత్రి కొన్ని పనుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో ఉత్సాహంగా చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లను మంజూరు చేసింది. మరోసారి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాకే.. పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.’

గత దశాబ్దకాలంలో దుర్గగుడిలో బృహత్తర ప్రణాళిక నమూనాల కోసమే.. రూ.లక్షలు ఖర్చు చేశారు. ఈవో మారగానే.. బృహత్తర ప్రణాళిక అంటూ ఓ కొత్త సంస్థను తీసుకొచ్చి నమూనాలు సిద్ధం చేయిస్తుంటారు. ఇలా ఇప్పటివరకూ దుర్గగుడి అభివృద్ధి కోసం కనీసం ఓ ఐదారు బృహత్తర ప్రణాళికలు గత పదేళ్లలోనే సిద్ధం చేశారు. కానీ.. ఒక్కటి కూడా చేపట్టింది లేదు. కేవలం నమూనాలు తయారుచేసే సంస్థకు డబ్బులు చెల్లించేందుకే.. ఈ హడావుడి అన్నట్టుగా వ్యవహారం కొనసాగింది.ప్రస్తుతం దుర్గగుడిలో అన్నదాన భవనం, ప్రసాదంపోటు.. పనుల నిర్మాణం మళ్లీ మొదటి కొచ్చింది.

నిధులు లేక అప్పుడు.. ఉన్నా ఇప్పుడు..

రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇస్తామని ప్రకటించిన తర్వాత.. వాటితో పలు నిర్మాణాలు చేపట్టాలని రెండేళ్ల కిందట నిర్ణయించారు. కానీ.. ప్రభుత్వం ఇస్తామన్న డబ్బులు విడుదల చేయకపోవడంతో.. చాలాకాలం ఈ పనులు తీవ్ర జాప్యమయ్యాయి. తర్వాత ఆలయ నిధులతో చేపట్టాలని టెండర్లు పిలిచారు. కనకదుర్గ పైవంతెన కిందన నిర్మించాలనుకున్న కేశఖండనశాలను మాత్రం పూర్తిగా వాయిదా వేశారు. అన్నదానం, ప్రసాదంపోటు భవనాలను మహామండపానికి పక్కన నిర్మించాలని నమూనాలు రూపొందించారు. స్థలం కూడా చదును చేశారు. పునాదుల పని మొదలైన సమయంలో.. ఈ నిర్మాణాలను ఆపేశారు. ఆ తర్వాత దసరా వేడుకలు రావడంతో కొంతకాలం ఈ నిర్మాణాలను పక్కన పెట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.70 కోట్లను దసరాకు ముందే విడుదల చేసింది. ఆలయంలో పనులు చేపట్టి ఆ బిల్లులు పెట్టుకుని.. డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం దసరా వెళ్లి.. నెలన్నర గడుస్తున్నా అన్నదానం, ప్రసాదంపోటు నిర్మాణాల ఊసే ఎత్తడం లేదు.

ప్రతిసారీ ఇదే తీరు..

ప్రభుత్వం ఇస్తానన్న నిధులతో కొండ రాళ్లు జారి పడకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం, శివాలయ ఆధునికీకరణ, అన్నదానం భవన నిర్మాణం, టోల్‌ప్లాజా, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణమండపాలు, కేశఖండనశాల ఇలా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వీటిలో కొన్నింటినే దుర్గగుడి సొంత డబ్బులతో ఆరంభించారు. ఈలోపు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వెలంపల్లి స్థానంలో కొత్తగా కొట్టు సత్యనారాయణ వచ్చారు. ఆలయ నిర్మాణాలపై కొట్టు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటిలో చాలా లోపాలున్నాయని, ప్రణాళికలు మార్చాలంటూ ఆదేశించారు. ప్రసాదంపోటు, అన్నదాన భవనం నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రస్తుతం మరో సంస్థను తెచ్చి ఈ పనులన్నింటికీ కలిపి బృహత్తర ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. గతంలోనూ రూ.100 కోట్లతో బృహత్తర ప్రణాళిక అంటూ రూ.10లక్షల వరకూ ఖర్చు పెట్టి నమూనాలు సిద్ధం చేశారు. ఆ తర్వాత ఈవో మారారు. ఆ ప్రణాళికలు పక్కకెళ్లిపోయాయి. ప్రస్తుతం మరోసారి అదే పొరపాటు చేస్తున్నారు. ఈ ఫలితం లేని నమూనాలపై దృష్టిసారించడం ఆపి.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులను త్వరగా వాడుకుని.. ఆలయానికి అవసరమైన అన్నదానం, ప్రసాదం పోటు భవనాలను నిర్మించుకోవడంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని