icon icon icon
icon icon icon

Pawan Kalyan: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ.. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు: పవన్‌

వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

Published : 04 May 2024 20:57 IST

అవనిగడ్డ: వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన  బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు. ఒక్క ఛాన్స్‌ అడిగిన జగన్‌ జనాలను నిలువునా మోసం చేశారని విమర్శించారు.

‘‘అప్పట్లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు నిలిచారు. ఇప్పుడు నిరంకుశ వైకాపాను ఓడించడానికి అన్ని పక్షాలు ఒక్కటయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా-జనసేన-భాజపా కూటమి ఏర్పడింది. ఈ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించండి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తాం. సముద్రతీర ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. మత్స్యకారులకు అండగా ఉంటాం. జగన్‌.. దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. వైకాపా హయాంలో దళితులపై  పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. వారికి అండగా నిలుస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను సీఎం జగన్‌ దోచుకున్నారు. మద్య నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఆ తర్వాత ఆ ఊసే లేదు. రాష్ట్రంలో మద్యం మాఫియా నడుస్తోంది. మద్యం వ్యాపారులు జీఎస్టీ కట్టడం లేదు. ఇసుకలో రూ.కోట్ల అవినీతి జరిగింది. మనకు తెగింపు రానంత వరకు మార్పు కనిపించదు. మీరంతా కలిసి కూటమిని గెలిపించాలి. 

యువత కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటికీ 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ అందిస్తాం. ఆరోగ్యశ్రీకి ప్రాధాన్యత ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. పోలవరానికి నా తరఫున రూ.కోటి విరాళం ఇస్తా.  రైతులకు సాగునీరు అందిస్తాం. పాఠశాలల్లో తెలుగు మీడియం ఉండాలి. నీతి కథలు విద్యార్థులకు అవసరం. మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని పవన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img