icon icon icon
icon icon icon

Pawan Kalyan: ఓడినా బలపడ్డాం.. ఐదు కోట్ల మందికి ధైర్యం నూరిపోశాం: పవన్‌ కల్యాణ్‌

ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు.

Updated : 04 May 2024 18:41 IST

రేపల్లె: ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మందికి జనసేన ధైర్యం నూరిపోసిందని చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని, దీని కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు. 

‘‘ ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురుతిరగాలనిపిస్తుంది. నేను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, దేశ ఐక్యతకు భంగం కలగనివ్వను. గులకరాయి పడితేనే జగన్‌ ఇంత పెద్ద డ్రామా ఆడారు. మా అక్కను వేధించొద్దు అన్నందుకు అమర్‌నాథ్‌గౌడ్‌ అనే బాలుడిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. బాధ్యత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. బలవంతులపై చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి.. బలహీనులపై చాలా బలంగా పనిచేస్తాయి. అమర్‌నాథ్‌ విషయంలో ఇదే జరిగింది. రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తకపోతే ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదు. 

రేపల్లెను జూద స్థావరంగా మార్చారు. మట్టి మాఫియాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి లేదు. భయపడితే సమాజంలో అభివృద్ధి  జరగదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా. ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం. నిజాంపట్నం పోర్టును అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పిస్తాం. మహిళలకు చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడతాం’’ అని పవన్‌ భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img