logo

నేతలా.. మేతలా..!

ఆయన ఓ మంత్రి.. తన పలుకుబడితో కొండపావులూరులో 5 హెక్టార్లు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి పొందారు. గనుల శాఖ నిబంధనల మేరకు ముందుగా దరఖాస్తు చేసిన వారికి అనుమతివ్వాలి.

Updated : 18 Aug 2023 06:22 IST

బినామీలతో అనుమతులు...
అడ్డగోలుగా కొండల తవ్వకాలు
గన్నవరంపై ప్రజాప్రతినిధుల కన్ను

పోలవరం కట్టలను ఇలా తవ్వుతున్నారు...

ఆయన ఓ మంత్రి.. తన పలుకుబడితో కొండపావులూరులో 5 హెక్టార్లు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి పొందారు. గనుల శాఖ నిబంధనల మేరకు ముందుగా దరఖాస్తు చేసిన వారికి అనుమతివ్వాలి. కానీ వాటిని పక్కన పెట్టి మంత్రి బినామీకి మంజూరు చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని దాదాపు 20 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు రంగం సిద్ధం చేశారు. మంత్రి కావడంతో ఆయన మాటకు అడ్డులేకుండా పోయింది. బినామీతో అనుమతులు పొందినా.. పర్యవేక్షణ మొత్తం సమీప బంధువు చూస్తున్నారు.

ఈనాడు,  అమరావతి: ఒక్క కొండపావులూరే కాదు.. వెదురుపావులూరు, నక్కలతిప్ప, పోలవరం కాలువలు అన్నీ పరుల పాలయ్యాయి. గన్నవరం నియోజకవర్గం అంటేనే.. మట్టి మాఫియా అడ్డాగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు బినామీలతో వాలిపోయారు. ఓ మంత్రి.. పశ్చిమ కృష్ణా కీలక ప్రజాప్రతినిధి, గుంటూరు జిల్లాలో ఓ మంత్రి, ఓ ఎంపీ సోదరుడు, వీఎంసీలో ప్రజాప్రతినిధి భర్త, అధికార పార్టీ నాయకులు ఇలా ఇష్టానుసారం తవ్వుతున్నారు. కొంత అనుమతి.. మరికొంత అనధికారికంగా తవ్వుతున్నారు. గన్నవరం మండలంలో ఏ కొండ చూసినా.. ఏ బంజరు నేల చూసినా.. తవ్వకాలే తవ్వకాలు. మట్టి మాఫియాపై కనీస చర్యలూ లేవు. అధికార వర్గాల సమాచారం ప్రకారం కీలక నేతలు మరో 40 హెక్టార్లలో (వంద ఎకరాలు) మట్టి తవ్వకాలకు బినామీలతో అనుమతి పొందారు. కొన్ని ప్రారంభం కాగా.. మరిన్ని కొల్లగొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నున్న సమీపంలో తవ్వుతున్న తీరు (ఓ ప్రజాప్రతినిధి భర్త నిర్వాకమిది)

  • ఒక జిల్లాలో నివాసం ఉండి మరో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి తన బినామీతో కొండపావులూరులో 5 హెక్టార్లలో గ్రావెల్‌ తవ్వకాల కోసం పైరవీలు చేసి  అనుమతి తీసుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో దరఖాస్తు చేసిన వారి అనుమతి నిరాకరించారు. ఇక్కడ ప్రభుత్వ బంజరు భూముల్లో అనుమతి పొందారు. విజయవాడకు చెందిన ఆయన అనుచరుడితో తవ్వకాలకు రంగం సిద్ధం చేశారు. ఆయన సోదరుడికి భాగస్వామ్యం కల్పించారు. అయిదు హెక్టార్లు అంటే 12.50 ఎకరాలు. ఈ పేరుతో కొండపావులూరులో ఇప్పటికే కొండలను నున్నగా మార్చేశారు.
  • గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరుతో ఆయన అనుచరులు అనుమతులు లేకుండానే పోలవరం కట్టలను తవ్వేస్తున్నారు. దందాపై ఎన్జీటీకి ఫిర్యాదులు వెళ్లినా లెక్కలేదు. సురేంద్రబాబు.. హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ జరుగుతున్నా.. మరోవైపు తవ్వుతూనే ఉన్నారు.
  • కృష్ణా జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బాపులపాడు మండలం వీరవల్లి వద్ద తవ్వుతున్నారు. ఎలాంటి అనుమతి లేదు. పోలవరం కట్టలను, కాలువ బఫర్‌జోన్‌ ప్రాంతాన్ని కరిగిస్తున్నారు. ఆప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితుడు, విజయవాడకు చెందిన వ్యాపారికి ఈ తవ్వకాలు అప్పగించారు. దీనిపై ప్రజాప్రతినిధి సోదరుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేయగా ఆయనకు తన నియోజకవర్గంలో ఇసుక తవ్వకాల ‘పెత్తనం’ కట్టబెట్టారు.
  • గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైకాపా నేత, ఓ ఎంపీ సోదరుడు తెంపల్లిలో తవ్వుకుంటున్నారు. ఓ బినామీతో అనుమతులు పొంది తవ్వుతున్నా..వాస్తవానికి.. దస్త్రాలకు భారీ వ్యత్యాసం ఉంది. రాయల్టీ చెల్లించకుండా తరలిస్తున్నారు.
  • ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తన బినామీతో గొలనపల్లిలో తవ్వకాలకు అయిదు హెక్టార్లలో అనుమతులు పొందారు. గతంలో తవ్వకాలు జరిపిన ఆయన తాజాగా ఈ అనుమతులు పొంది అనుచరులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు.

ఒకరా ఇద్దరా..?

గన్నవరం పరిధిలో ప్రభుత్వ బంజరులు, కొండ పోరంబోకులు, పోలవరం కట్టలు ఉండటం మట్టి మాఫియాకు కలిసి వచ్చింది. 2019-20 మధ్య ఇష్టానుసారంగా గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతిచ్చారు. వాటి గడువు తీరింది. నాడు మంత్రులు, ఎమ్మెల్యేల బినామీల పేర్లతో.. 5 వేలు, 50 వేల క్యూబిక్‌ మీటర్ల అనుమతులు తీసుకుని కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని లేపేశారు. ప్రస్తుతం పోలవరం కట్టలకు అనుమతులు లేవు. కానీ ప్రభుత్వ బంజరులో కొన్ని అనుమతులు  తీసుకున్నారు.


  • ఒక మాజీ మంత్రి తన బినామీలతో వెదురుపావులూరులో 5 హెక్టార్లలో అనుమతులు తీసుకున్నారు. ప్రైవేటు అవసరాల పేరిట అనుమతి పొందారు. ఆయన అనుచరులు ఇష్టానుసారం తవ్వుతున్నారు. దీనిపై గనుల శాఖకు ఫిర్యాదు అందినా చర్యలు లేవు. వెదురుపావులూరులో కేటాయించిన విస్తీర్ణంలో కాకుండా కొండలను పిండి చేస్తున్నారు.

  • పశ్చిమ కృష్ణాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పోలవరం కట్టల తవ్వకాలకు బినామీతో నామమాత్ర అనుమతి పొందారు. మొత్తం అయిదు ప్రాంతాల్లో 50 వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు అనుమతి పొంది విజయవాడ గ్రామీణం నుంచి సూరంపల్లి వరకు నేటికీ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఆయన తనయుడు పర్యవేక్షిస్తున్నారు.

  • గుబ్బలగుట్టను నగర ప్రజాప్రతినిధి భర్త, కాంట్రాక్టర్‌.. కలెక్టర్‌ అనుమతిచ్చారని భారీగా తవ్వగా.. నున్న వైకాపా నేత, మరో కాంట్రాక్టర్‌ జత కలిసి గుబ్బల గుట్ట, పోలవరం కట్టలు తవ్వుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపీ నక్కలతిప్పలో తవ్వుకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని