logo

కోడ్‌ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి

కోడ్‌ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు.

Updated : 28 Mar 2024 06:15 IST

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
రాత్రుళ్లు వెంచర్లకు తరలింపు
ఈనాడు - అమరావతి

పట్టపగలే మట్టి దందా తీరు ఇది!

ఎన్నికల కోడ్‌ వచ్చే వరకు సహనంతో ఉండండి.. అప్పుడు అక్రమ తవ్వకాలు నిలిచిపోతాయి. చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులు ధైర్యం చేయలేరు..!

విజయవాడ నగర సమీపంలో కొండలు, భూములను తవ్వుతున్న అక్రమార్కులపై ఫిర్యాదు చేస్తే.. గ్రామస్థులకు ఉన్నతాధికారులు చెప్పిన మాటలివి.


కోడ్‌ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. జి.కొండూరు మండలం వెలగలేరు సమీపంలో తవ్వకాలు ఆపలేని దారుణమిది. వెలగలేరు నుంచి జి.కొండూరు మీదుగా నగరానికి మట్టి అక్రమ రవాణా భారీగా సాగుతున్నా రెవెన్యూ వారిది ప్రేక్షకపాత్రే. ఇటీవల రెండు జేసీబీలు అటవీ, గనుల అధికారులు పట్టుకోగా.. అటవీ శాఖ పీఐఆర్‌ నమోదు చేసింది. రూ.13 లక్షల జరిమానా వేశారు. మరోవైపు రెవెన్యూ అనధికార అనుమతులు ఇస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు వెంచర్లకు భారీగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నారు.

తవ్వేస్తున్నారిలా..


రూ.కోట్ల సంపద..!

వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. గనుల శాఖకు ఎగవేసిన సీనరేజీ సొమ్ము రూ.వందల కోట్లు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఆ శాఖ పలువురికి అక్రమ తవ్వకాలపై నోటీసులు ఇచ్చింది. ఈమేరకు రూ.300 కోట్లు విలువైన మట్టి తరలించారు. దీనికి పది రెట్లు జరిమానా విధించాలి. అంటే దాదాపు రూ.3 వేల కోట్లు. కానీ అక్రమార్కులు... తమకు సంబంధం లేదని సెలవిచ్చారు. ఆ గ్రామాల్లో 10 మీటర్ల లోతుకంటే ఎక్కువ తవ్విన దృశ్యాలే. ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ, అసైన్డ్‌ భూములనూ వదలక తవ్వేశారు. అటవీ శాఖ మూడుసార్లు విచారణ జరిపి సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేశారు. కొత్తూరు తాడేపల్లివాసి మెండెం జములయ్య అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మట్టి తవ్వకానికి ఎకరానికి రూ.10-20 లక్షలకు లీజుకు తీసుకుని అనుమతి లేకుండా తవ్వుతున్నారు. ఉన్నత స్థాయి ఒత్తిడితో యంత్రాంగానిది నియంత్రించలేని నిస్సహాయత.


క్షణాల్లో మాయం!

మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపుపై దాడులు చేయాలని గ్రామస్థులు గనుల శాఖకు సమాచారమిస్తే.. వారు వెళ్లే సరికే అక్కడ లారీలు, యంత్రాలను చెట్లపొదల్లో దాచేస్తున్నారు. అలా దాచిన వాటిని తాము స్వాధీనం చేసుకోలేమని అధికారులు తేల్చేస్తున్నారు. కళ్లముందు తవ్విన ఆనవాళ్లున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో దాడులకు తెగిస్తారనే భయంతో వెళ్లలేని పరిస్థితి. పోలీసుల సహకారమూ లేదు. గ్రామస్థులు పట్టుబట్టి అధికారులను తీసుకెళితే.. జేసీబీలు, లారీలు మామిడి తోటల్లో దాచేశారు. గన్నవరం, మైలవరం పరిధిలో కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, నున్న, కొత్తూరు, వేమవరం, షాబాద్‌, జక్కంపూడిలో కోడ్‌ వచ్చినా తవ్వకాలు ఆగలేదు. ఎన్జీటీ ఆదేశాలు, హైకోర్టు వ్యాజ్యాలనూ ఖాతరు చేయడం లేదు. ఈ తవ్వకాల వెనుక గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధి, అదే జిల్లాలో ఓ మంత్రి కీలకంగా, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార పార్టీ నాయకులు భాగస్వాములుగా ఉన్నారు.


వీరు ఎక్కడ..?

మండల, డివిజన్‌ స్థాయిలో టాస్క్‌ఫోర్సు బృందాలు వేయాలి. డివిజను స్థాయిలో సబ్‌ కలెక్టర్‌, ఇద్దరు ఏసీపీలు, పోలవరం ఈఈ, జిల్లా రవాణా శాఖ అధికారి, డీడీ గనుల శాఖ, విజయవాడ ఎఫ్‌ఆర్‌వోలు ఉంటారు. తహసీల్దారు, పోలీసు ఇన్‌స్పెక్టర్‌లు (ఎస్‌హెచ్‌వో), జిల్లా విజిలెన్సు రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌, ఏఈఈ, డిప్యూటీ రేంజ్‌ అధికారులు ఉంటారు. అన్ని శాఖల అధికారులను కలెక్టర్‌ సమన్వయం చేస్తారు. ఇవేవీ ఏర్పాటే కాలేదు. దస్త్రాలకు మాత్రమే పరిమితం. పోలవరం కుడికాలువ, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, పాతపాడు, వెలగలేరు, వేమవరం ప్రాంతాల్లో అభయారణ్యం పరిధిలో అక్రమ మైనింగ్‌ జరుగుతూనే ఉంది. ఒక్కో మండలంలో మూడు బృందాలు పోలీసు రక్షణతో ఉండాలి. ఒక్కటీ ఏర్పాటు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని