logo

కోడ్‌ ఉల్లంఘించి.. వైకాపా నేతల వేడుకలు

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

Published : 29 Mar 2024 04:06 IST

అభ్యంతరం తెలిపిన అధికారులతో వాగ్వాదం

జెండా ఆవిష్కరించి వందనం చేస్తున్న గౌతంరెడ్డి, రుహుల్లా, ఇతర నాయకులు

విజయవాడ, న్యూస్‌టుడే : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. వైకాపా నేతల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తాజాగా విజయవాడ, సత్యనారాయణపురం రైల్వేకాలనీ పార్కు వద్ద వైఎస్‌ఆర్టీయూసీ ఆవిర్భావ వేడుకలను కోడ్‌ ఉల్లంఘించి మరీ గురువారం నిర్వహించారు. దీనిపై ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వారితోనే వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా ఇలా వేడుకలను నిర్వహించడానికి వీల్లేదంటూ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి గోవిందం ప్రమాణ్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఇలా చేయకూడదని హెచ్చరించారు. వైకాపా నేతలు ఆయనతో గొడవకు దిగడంతో.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా వైఎస్‌ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా విచ్చేశారు. జెండాను ఆవిష్కరించారు. దాదాపు 50మంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇంతమంది ఒకచోట చేరి వేడుకల చేయడం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు వారించినా.. నేతలు వినలేదు. కానీ.. అధికారులు వెనక్కి తగ్గకుండా వేడుకల కోసం పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ బ్యానరు, జెండాను తొలగించారు. ఈ నేపథ్యంలో గౌతంరెడ్డి, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలా బ్యానర్లు కట్టకూడదని అధికారులు చెప్పగా.. అన్ని వీధుల్లోనూ కనిపిస్తున్నాయంటూ.. గౌతంరెడ్డి వాదనకు దిగారు. వాస్తవంగా నగరంలో 144 సెక్షన్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి ఉండకూడదు. కానీ ఈ వేడుకల్లో దాదాపు 50మంది ఒకేచోటికి చేరారు. జెండాను ఎగరేశారు. అనుమతి లేకుండా యూనియన్‌ బ్యానర్‌ను ప్రదర్శించారు. దీనిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృంద అధికారి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గౌతంరెడ్డితో మాట్లాడుతున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి ప్రమాణ్‌కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని