logo

ఎదురుమొండికి ఎదురు చూపులే..

ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.  తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Published : 18 Apr 2024 05:14 IST

కలగా మిగిలిన వంతెన నిర్మాణం
రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరవు
అటకెక్కిన ఎమ్మెల్యే రమేష్‌బాబు హామీ

ప్రజల రాకపోకలకు ఈ ఫంటే దిక్కు

తనను గెలిపిస్తే వచ్చే ఎన్నికల నాటికల్లా వంతెన నిర్మించి 2024లో దానిపై నడుచుకుంటూ వచ్చి ఓట్లు అడుగుతాను.

2019 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన సింహాద్రి రమేష్‌ బాబు దీవుల ప్రజలకు హామీయిచ్చారు. ఇప్పటికీ నెరవేర్చలేదు.ఇంకా టెండర్ల దశలోనే ఉంది.


న్యూస్‌టుడే, అవనిగడ్డ, నాగాయలంక: ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.  తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివి ప్రాంతంలో పర్యటన సందర్బంగా ఈ వారధి నిర్మాణానికి ఏఐడీబీ(ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌) ద్వారా నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారుల అభివృద్ధితోపాటు ఎదురుమొండి వారధి నిర్మాణం చేపట్టేలా అప్పటి ప్రభుత్వం ఏఐడీబీతోని ఒప్పించగా పనుల ప్రారంభానికి ముందుకొచ్చింది. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు అక్కడితో ఆగిపోయింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషి ఫలితంగా నాబార్డును ఒప్పించి సుమారు రూ.125 కోట్ల అంచనాలతో ప్రభుత్వం నివేదించింది. 2022 నవంబర్‌ 16న వారధి నిర్మాణానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు తొలుత రూ.109 కోట్లతో అంచనాలు రూపొందించారు. సవివర పథక నివేదిక(డీపీఆర్‌), నమూనాల్ని ప్రభుత్వం ఆమోదించడంలో జాప్యం కావడంతో పట్టి పరీక్షల అనంతరం రూ.160 కోట్లకు పెరిగింది. అనంతరం నాబార్డు రూ.109 కోట్లు మంజూరు చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ ఆసక్తి కనబర్చలేదు. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో మళ్లీ ఆగింది. వైకాపా ప్రభుత్వం మాటలు నమ్మి మరోసారి మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నది బ్యాక్‌వాటర్‌ పారే దీవుల్లో నివసించే ప్రజలు బాహ్య ప్రపంచంలోకి రావాలంటే ప్రమాదకర పడవ ప్రయాణాలే దిక్కు.  ఎదురుమొండి, నాచుగుంట, ఈలచెట్లదిబ్బ పంచాయతీల పరిధిలో దాదాపు 60 మందికి పైగా ప్రజలు పలుసార్లు జరిగిన పడవ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 2002లో పడవ ప్రయాణాలకు ప్రత్యామ్నాయంగా ఏటిమొగ-ఎదురుమొండి మధ్య నాటి ప్రభుత్వం ఫంటు ఏర్పాటు చేసింది. దీని రాకతో దీవుల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యపడింది. గానీ వారి రవాణా పగటి సమయానికే పరిమితమైంది.


ఎన్నికల హామీగానే మిగిలింది

ఏటిమొగ-ఎదురుమొండి వంతెన నిర్మిస్తామన్న నాయకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయి. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు మార్గం లేదు. ఆ సమయంలో ప్రమాదకర పడవ ప్రయాణాలే శరణ్యం. బ్రిడ్జి లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి జరగడం లేదు.

సైకం దినేష్‌ స్థానికుడు


ఇబ్బందికరంగా పంట ఉత్పత్తుల రవాణా

బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలింది. పొలాలకు ఎరువులు, పంట ఉత్పత్తులు రవాణా చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పొలాలకు సాగునీరు రావాలంటే బాపట్ల జిల్లా రాజ్‌ కాలువే ఆధారం. వంతెన నిర్మిస్తే ఇక్కడ కెనాల్‌ ఏర్పడి సకాలంలో పంటలు పండించుకోవచ్చు.

సైకం నరసింహారావు, రైతు


వలస కూలీలుగా మత్స్యకారులు

ఎదురుమొండి దీవుల అభివృద్ధి వంతెనతోనే సాధ్యం. మత్స్య సంపద ఎగుమతులకు సరైన సదుపాయం లేక మత్స్యకారులు వేటకు స్వస్తి పలికి వలస కూలీలుగా మారారు. ఉపాధి కోసం ఇతర గ్రామాలకు వెళ్తున్నారు. రాత్రి అయితే ఫంటు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది.

శేరు ప్రభుప్రసాద్‌ ఏసుపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని