logo

నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!

అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్‌ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు.

Updated : 25 Apr 2024 06:38 IST

నాలుగేళ్లలో అరకొరగానే పంటల బీమా
వైపరీత్యాలు వెంటాడుతున్నా జగన్‌ పరిహాసమే
మిగ్‌జాం బాధితులకు పరిహారం ఇవ్వరేం?
ఈనాడు, అమరావతి

అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్‌ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. నిరుడు మిగ్‌జాంతో పంట నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇంతవరకు పరిహారం జమకాలేదు. నెలన్నర కిందట జగన్‌ బటన్‌ నొక్కినా అతీగతీ లేదు.. ఆ డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలీదు. పైగా అధికారులు పంట నష్టం లెక్కింపులోనూ గజిబిజి చేసేశారు. కాకి లెక్కలతో నివేదిక పంపి మమ అనిపించారు.

రైతు సంక్షేమం అని గొప్పలు చెప్పే ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా తయారైంది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పేరుతోనూ వారిని దగా చేసింది. రైతు నష్టపోయిన దానికి.. అందించిన బీమా పరిహారానికి అసలు పొంతనే లేదు. పత్తికి ఎకరాకు రూ.900 మాత్రమే బీమా వర్తింపజేసింది. కంచికచర్ల మండలంలో ఎకరా వరికి రూ.712 మాత్రమే బీమా పరిహారం అందింది.

కృష్ణా జిల్లాలో వరి పంటలు దెబ్బతినగా.. కేవలం ఒక్క గ్రామానికి మాత్రమే బీమా వర్తింపజేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. మరోవైపు వైకాపా నేతలు ఈ మాత్రానికే.. మా జగన్‌ రాజు కాదు.. రైతు అని పాలాభిషేకాలు చేశారు. ఈ పాలకైన ఖర్చుకు సమానంగానైనా బీమా రాలేదని చందర్లపాడు రైతులు వాపోతున్నారు. కనీసం ప్రైవేటుగా పంటలకు బీమా చేయించుకున్నా.. తమకు పరిహారం వచ్చేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

కాకి లెక్కలేనా..?

  • గత ఖరీఫ్‌లో చేతికొచ్చిన వరిని మిగ్‌జాం తుడిచి పెట్టేసింది. కష్టనష్టాలపాలైన రైతులను ఆదుకోవడానికి సర్కారు వెంటనే గణన చేపట్టలేదు. పరిహారం చెల్లించేందుకు సరైన మార్గదర్శకాలను సకాలంలో విడుదల చేయలేదు. దీంతో గణన నెల రోజులు ఆలస్యమైంది.
  • తుపాను గాలులకు నేలవాలిన వరి పైరును ఒక కేటగిరీ కింద, కోసి పనల మీద ఉండగా.. పొలంలో నీరు చేరి మొలకలు వచ్చిన పంటను రెండో కేటగిరీ కింద, తడిసిన ధాన్యాన్ని మూడో కేటగిరీ కింద చేర్చారు.
  • కేవలం నేలవాలిన వరి పనల వివరాలనే లెక్కించారు.రి కోతల తర్వాత పనల మీద ఉన్న పంట, తడిసిన ధాన్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఈ రైతులు దారుణంగా మోసపోయారు.
  • కృష్ణా జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే. కేవలం 40 వేల మందికి మినహా మిగిలిన వారికి ఈ-క్రాప్‌ యజమాని పేరు మీదనే నమోదవుతోంది.

డబ్బులు పడలేదు..!

తుపానుతో దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇచ్చేందుకు సీఎం జగన్‌ గత మార్చి 6న బటన్‌ నొక్కారు. అంతేకాదు.. నాడు భారీగా ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. గత ఐదేళ్లలో భారీ వర్షాలు, తుపాన్లకు దెబ్బతిన్న పంటల పరిహారం కోసం 12 సార్లు బటన్‌ నొక్కినట్లు ఘనంగా చాటింపు వేసుకున్నారు. కానీ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగుసార్లు మాత్రమే పెట్టుబడి రాయితీ బీమా పరిహారం అందిందని రైతులు చెబుతున్నారు. మిగ్‌జాం వచ్చి అయిదు నెలలు గడుస్తున్నా.. ఎన్నికల కోడ్‌ వస్తోందని ముందే బటన్‌ నొక్కిన సీఎం సొమ్ములను మాత్రం ఖాతాలో వేయలేదు.

బినామీలే మేసేశారు..

కొన్నిసార్లు పరిహారం మొత్తం పక్కదారి పట్టింది. ఏ.కొండూరులో మామిడి తోటల్లో సైతం పత్తి పంట దెబ్బతిందని నమోదు చేసి రూ.లక్షలు మింగేశారు. వీరులపాడు మండలంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పరిహారాన్ని నేతల బినామీలే మేసేశారు.

కృష్ణా జిల్లాలో 92,318 మంది రైతులకు చెందిన 58,835.56 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 1,209 మంది రైతులకు చెందిన 462.42 హెక్టార్లలో దెబ్బతిన్నాయని తేల్చారు. వరి ఇతర పంటలకు ఎకరాకు రూ.6,800 చొప్పున రూ.99.90 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.1.12 కోట్ల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒక్కో రైతుకు ఐదెకరాలకే పరిహారాన్ని పరిమితం చేశారు. కానీ.. ఇంతవరకు ఆ సొమ్ము బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.


వరిపైరు తొక్కించేశా

- ఆత్మూరి రామకోటేశ్వరరావు, నెమ్మలూరు  

గత ఏడాది వచ్చిన తుపానుకు నాకున్న 13 ఎకరాల్లోని వరి పైరు పడిపోయి పాడవ్వగా ట్రాక్టర్‌తో తొక్కించేశాం. అధికారులొచ్చి చూసినా ప్రభుత్వం నుంచి ఒక్కపైసా సాయం కూడా రాలేదు. కష్టంలో ఉన్న రైతులను పట్టించుకోవాల్సిన పాలకులు, ప్రభుత్వం చేతులెత్తేయడం బాధాకరం. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం దురదృష్టకరం.


మొత్తం కుళ్లిపోయింది

- సీతారామయ్య, కౌలురైతు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: మొత్తం 14 ఎకరాల్లో గతేడాది వరి సాగు చేశా. ఇందులో నాలుగెకరాలు పనల మీదే దెబ్బతింది. బీపీటీ రకం సాగు చేసిన ఎకరంన్నర పొలమైతే పూర్తిగా నీటిలోనే ఉండిపోయిది. దాదాపుగా పనలన్నీ కుళ్లిపోయాయి. వాటిని ఎండబెట్టి నూర్చినా ఉపయోగం లేదని అలాగే వదిలేశా. ఎకరంన్నర పంట పూర్తిగా పోయినా పంట నష్టం నమోదు చేయలేదు.


ధాన్యం సొమ్ము రాలేదు

- బ్రహ్మేశ్వరరావు, చోడవరం

పెనమలూరు, న్యూస్‌టుడే: గతేడాది సార్వా ధాన్యం నగదు ఇంకా రాలేదు. తిరిగి ధాళ్వా కూడా వచ్చేసింది. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. గత ప్రభుత్వంలో సార్వా ధాన్యానికి రైతు ఖాతాకు సొమ్ములు తొందరగా జమ అయ్యేవి. కానీ వైకాపా ప్రభుత్వంలో అందుకు భిన్నంగా ఉంది.


యజమానులకే ధీమా..

  • నిరుడు ఎన్టీఆర్‌ జిల్లాలో పత్తి రైతులకు దక్కాల్సిన బీమా మొత్తం యజమానులకే వెళ్లింది. బినామీల ఖాతాలకూ జమ అయింది. కారణం.. అక్కడ వ్యాపారులు పత్తి ఈ-క్రాప్‌ను తమ అనుచరుల పేరు మీద చేయించారు.
  • బీమా పరిహారం విషయంలో ఒక గ్రామంలో పంట నష్టపోయి.. పక్క గ్రామంలో 33 శాతం కంటే తక్కువ నష్టం ఉంటే బీమా ఇవ్వడంలేదు. వర్షపాతం, దిగుబడి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు