logo

తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం

నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు.

Published : 06 May 2024 04:01 IST

నందిగామ, న్యూస్‌టుడే : నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. మరోవైపు వైకాపా అభ్యర్థి జగన్మోహనరావు సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ని మాత్రం కేంద్రం ఆవరణలోకి వదిలిపెట్టారు. ఆయన తన అనుచరులతో వచ్చి హల్‌చల్‌ చేసినా.. పోలీసులు పట్టించుకోలేదు. వివరాల్లోకి వెళ్తే... ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ కాకాని వెంకటరత్నం కళాశాల ఆవరణలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఓటింగ్‌ ఉండదని ఎన్నికల అధికారులు, ఉద్యోగులు, పార్టీల ప్రతినిధులకు చెప్పారు. కొంత మంది ఉద్యోగులు ఇళ్లకు వెళ్లారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఓపీవోలు, బీఎల్వోలు ఎక్కువ మంది వచ్చినట్లు ఆర్వో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఓటింగ్‌ పెట్టాలని ఆయన ఆదేశించారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకు ఓటింగ్‌ ప్రారంభించారు. అప్పుడే పార్టీల నాయకులకు సమాచారం ఇవ్వగా.. హడావుడిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. మొదటి అంతస్తులో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దివ్యాంగులు, కొందరు ఉద్యోగులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడినట్లు ఓ దివ్యాంగ ఉపాధ్యాయుడు వాపోయారు.

పరిశీలనకు సౌమ్య రాక

ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు తెదేపా అభ్యర్థిని తంగిరాల సౌమ్య రాగా.. వైకాపా ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. వెంటనే ఆర్వో వచ్చి ఆమెను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటికి పంపించారు. అభ్యర్థిగా పోలింగ్‌ కేంద్రంలోకి తాను రావొచ్చని ఆమె చెప్పినా ఆర్వో పట్టించుకోలేదు. రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తరువాత న్యాయవాదులతో తెదేపా నాయకులు మాట్లాడి అభ్యర్థికి అనుమతి ఉంటుందని ఆర్వోకు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఆర్వో వచ్చి ఆమెను కేంద్రంలోకి అనుమతించారు. ఆర్వో ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాయకులు చెప్పారు. పోలింగ్‌ జరుగుతుండగా వైకాపా ప్రచార వాహనాల మైకులు హోరెత్తాయి.

వైకాపా ఎమ్మెల్సీకి అనుమతి...

వైకాపా అభ్యర్థి జగన్మోహనరావు సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ తన అనుచరులతో రాగా.. పోలింగ్‌ కేంద్రం ఆవరణలోకి అనుమతించారు. తెదేపాతో సహా మిగిలిన వారిని మాత్రం కేంద్రం ఆవరణలోకి పోలీసులు అనుమతించ లేదు. ఎమ్మెల్సీతో పాటు వచ్చిన నాయకులు సీఎం జగన్‌ సిద్ధం బ్యాడ్జీలు ధరించి వచ్చి మరీ హల్‌చల్‌ చేశారు. పోలీసులు ఎమ్మెల్సీకి అనుకూలంగా వ్యవహరించారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులను వైకాపా ఏజెంట్లు ప్రలోభాలకు గురి చేశారు. దీనిపై ఆర్వో మాట్లాడుతూ.. ‘పోలింగ్‌ కేంద్రం ఆవరణలోకి ఎవరికీ అనుమతి లేదు. ఎమ్మెల్సీ వచ్చిన విషయం తెలియగానే పోలీసులకు చెప్పి బయటకు పంపించాను’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని