logo

‘జగన్‌.. అధికార దుర్వినియోగం చేశారు’

గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్‌ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు.

Published : 06 May 2024 04:04 IST

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే : గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్‌ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. రూ.11 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. రాష్ట్ర సచివాయం, ఆర్‌అండ్‌బీ సంస్థలు, చివరికి మద్యం వ్యాపారాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ.. పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కాదని.. లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసే శక్తులు, మతోన్మాద శక్తుల మధ్యేనని పేర్కొన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రధాని మోదీ.. మాటతప్పారని విమర్శించారు. రూ.205 లక్షల కోట్ల అప్పు చేశారని పేర్కొన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గందరగోళంగా వ్యవహరిస్తున్నారని.. రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిన భాజపాతో జతకట్టడం సరికాదన్నారు. కేంద్రంలో భాజపా మూడో సారి వస్తే రాజ్యాంగం మార్పు తప్పదన్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటుకు రూ.5వేలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలతో కమ్యూనిస్టుల బలం తగ్గిందని పేర్కొన్నారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు కంచల జయరాజ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్‌ యూనియన్ల నాయకులు చందు జనార్దన్‌, ఆలపాటి సురేష్‌బాబు, చావా రవి, దాసరి నాగరాజు, సి.హెచ్‌.రమణారెడ్డి, ఎస్‌.కె.బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని