logo

మీ భూములు కొల్లగొట్టేస్తారు..!

ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి.

Published : 06 May 2024 04:09 IST

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై తీవ్ర వ్యతిరేకత
గాంధీనగర్‌, న్యూస్‌టుడే

ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీనిపై ఇప్పటికే ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాస్‌ పుస్తకాల జారీ తప్పులతడకగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్లుగా భూసర్వేలో సమస్యలనే పరిష్కరించలేదు. పైగా కొత్త చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేస్తే.. ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి ఉండదు. ఈ చట్టంతో మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని రైతులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

హక్కులు వదులు కోవాల్సిందే

- సోమశేఖర్‌, విశ్రాంత ఉద్యోగి, విజయవాడ

ఈ చట్టం చాలా ప్రమాదకరం. ప్రజలు తమ ఆస్తులపై పూర్తిగా హక్కులు వదులుకోవాల్సిందే. న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం లేదు. పైగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పెద్దల చెప్పుచేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. భూములను కబ్జా చేసేందుకే ఈ చట్టాన్ని తెచ్చారు.  


విదేశాల్లో ఉన్న వారికి ఇబ్బందే..

- కె.సుమంత్‌కుమార్‌, ఎన్‌.ఆర్‌.ఐ

ఈ చట్టం కారణంగా విదేశాల్లో ఉన్న వారికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు. గతంలో ఎప్పుడూ లేని వివాదాలు వైకాపా ప్రభుత్వంలో చూశాం. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో భూసర్వే పేరుతో తెలుసుకుంది. ఇక ఈ చట్టాన్ని అడ్డుపెట్టి.. కబ్జా చేయడానికి ఎక్కువ వీలు కలుగుతుంది. ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలి.


ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు

- కె.మురళీధర్‌, ఎన్‌.ఆర్‌.ఐ

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగిరిపల్లిలో ఉన్న మా ఆస్తులను కబ్జా చేసేందుకు చూశారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే.. సులువుగా కబ్జా చేసేస్తారు. ఈ విధానం ఏ రాష్ట్రాల్లోనూ అమలు చేయలేదు. ఇక్కడే అమలు చేస్తున్నారంటే.. అనుమానించాల్సిన విషయం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి.


వైకాపా ప్రభుత్వానికి ఎందుకింత తొందర?

- యార్లగడ్డ సురేంద్ర, రైతు, విజయవాడ రూరల్‌

ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయడానికి వైకాపా ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థంకావడం లేదు. చట్టాలు చేసేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, అడంగల్‌ వంటి రికార్డులు ఎందుకూ పనికి రాకుండాపోతాయి.


కోర్టుకు వెళ్లినా ఉపయోగం ఉండదు

- రాజేశ్వరరావు, న్యాయవాది, వన్‌టౌన్‌

వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల ఎకరాలు నకిలీ దస్తావేజులు సృష్టించి కొట్టేశారు. ఇక ఈ చట్టం వారికి మరింత వరంగా మారుతుంది. ఇందులో నిర్ణయాధికారం అధికారులదే. ప్రభుత్వం ఏం చెబితే వారు అదే చేస్తారు. రాజకీయ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులు చెప్పిందే వేదం.


చాలా ప్రమాదకరం

- వెంకట చలపతిరావు, న్యాయవాది, విజయవాడ

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చాలా ప్రమాదకరం. ఒకరి భూమి మీద వేరే వారు పిటీషన్‌ వేస్తే.. దాన్ని వివాదంగా నమోదు చేసే అవకాశం ఉంటుంది. రెండు నెలల్లో దాని అసలు యజమాని తన భూమి హక్కును నిరూపించుకోకపోతే.. రిజిస్ట్రేషన్‌ అధికారి నిర్ణయం తీసుకుంటారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.


న్యాయవాదుల ఉద్యమాలు

- రాము, న్యాయవాది, భవానీపురం

ఈ కొత్త చట్టం అమలుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ కోర్టు విధులు బహిష్కరించి ఉద్యమాలు చేశారు. కొత్త చట్టంతో ఇక ఒరిజినల్‌ దస్తావేజులు ఉండవు. ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత నకళ్లు మాత్రమే ఇస్తారు. వాటినే ఇంటికి తీసుకెళ్లాలి.


నకళ్లు ఇస్తే ఎలా తీసుకుంటారు?

- టి.సత్యనారాయణ, విజయవాడ

పిల్లల పెళ్లికి పసుపు కుంకుమ కింద ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసి.. నకళ్లు ఇస్తే ఎవరు తీసుకుంటారు. ఇది దుర్మార్గమైన చట్టం. ఈ చట్టం అమలుపై ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆస్తులు లాగేసుకోవడానికే వైకాపా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని