logo

వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా

ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు.

Published : 07 May 2024 05:35 IST

ఇంటింటి  ప్రచారానికి పంపుతున్న  అధికార పార్టీ

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. ఇప్పటివరకూ తెదేపా, జనసేన అధినేతలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా వాలంటీర్లు తమ సొంతవారేనని వైకాపా నాయకత్వం నేరుగా ప్రకటించినట్లయ్యింది. గుడ్లవల్లేరు మండలంలోని 22 పంచాతీల్లో మొత్తం 300 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వారిలో అంగలూరులో 6, డోకిపర్రు1లో 15, 2లో 13, గుడ్లవల్లేరు1లో 20, 2లో 18, శేరిదగ్గుమిల్లిలో 10, శేరికల్వపూడిలో 10, వడ్లమన్నాడులో 8, వేమవరంలో 5, విన్నకోటలో 14, పురిటిపాడులో 3 వంతున మొత్తం 122 మంది రాజీనామా చేసినట్లు వైకాపా ఎంపీపీ కొడాలి సురేశ్‌ మండల పరిషత్తు కార్యాలయం అధికారిక వాట్సాప్‌గ్రూప్‌లో వెల్లడించారు. స్థానిక మండల వైకాపా కార్యాలయం నుంచి పలువురు నాయకులు వాలంటీర్లకు ఫోన్లు చేసి రాజీనామాలు చేసి రావాలని ఒత్తిడి తెచ్చారు. వచ్చిన వారికి ఎంపీ, ఎమ్మెల్యేల గుర్తులకు ఓటేసే విధానం తెలిపే కరపత్రాలను అందించి వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. దీంతో వారంతా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆదివారమే అంగలూరులో ఈ వాలంటీర్లు రాజీనామా చేయకుండానే నేరుగా గ్రామస్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయడం గమనార్హం. అలాగే మహిళా వాలంటీర్ల భర్తలు పలువురు వాలంటీర్లతో కలిసి ప్రభుత్వ లబ్ధి అందించే క్రమంలో పాల్గొన్నారు. సోమవారం పలువురు మహిళా వాలంటీర్ల భర్తలను వైకాపా పోలింగ్‌బూత్‌ ఏజెంట్లుగా నియమించారు. రేపు వారు పోలింగ్‌ రోజున ఓటేయడానికి వచ్చే ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉందని తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి ద్వారా వారి పరిధిలోని ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం  చేసుకుంటోందని తెదేపా, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని