logo

జగన్‌ నిర్వాకం.. యువశక్తి నిర్వీర్యం

జగన్‌ ఐదేళ్ల పాలన తలచుకుంటే యువత గుండెలు బరువెక్కిపోతున్నాయి. కోపంతో రగిలిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయి.. జీవితంలో స్థిరపడలేక.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక.. వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి బలైపోయిన యువత దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

Updated : 07 May 2024 06:10 IST

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను గాలికొదిలేశారు
వైకాపా ఐదేళ్ల పాలనలో రెట్టింపైన నిరుద్యోగులు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కానూరు

యువశక్తి విలువేంటో
జగన్‌కు తెలుసా...?
అవకాశాలు సృష్టించాలేగానీ.. నవ జీవన బృందావన నిర్మాతలు వాళ్లే కదా..
ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనగల సామర్థ్యం వాళ్ల సొంతం కదా...
మార్గం చూపిస్తే చాలు.. ఏ స్థాయినైనా అందుకోగల తెగువ ఉన్నవాళ్లు కదా...
కానీ.. అయిదేళ్లలో జగన్‌ ఏం చేశారు?
యువశక్తిని గుర్తించలేదు.. వారికి అవకాశాలను కల్పించలేదు..
ఉన్న పరిశ్రమలను తరిమేశారు. కొత్తవాటిని రానివ్వలేదు..
కొత్త మార్గాలను సృష్టించడం చేతకాని సీఎం.. ఉన్నవాటిని ధ్వంసం చేయడంలో రికార్డులు సృష్టించారు. యువత బంగారు కలలను చిదిమేశారు. లక్షలాది తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు.


చంద్రబాబు హయాంలో...
ఉమ్మడి కృష్ణాలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు: 6

  • ప్రతీ కేంద్రంలో కంప్యూటర్లు: 100
  • విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనూ ఉచిత శిక్షణ
  • ఈ కేంద్రాల్లో ఏడాది మొత్తం సిబ్బంది అందుబాటులో ఉంటూ.. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేవారు.
  • 2014-19 కాలంలో శిక్షణ పొందిన విద్యార్థులు 22 వేలకు పైగానే. వీరిలో 90% పైగా కొలువులు సాధించారు.

గన్‌ ఐదేళ్ల పాలన తలచుకుంటే యువత గుండెలు బరువెక్కిపోతున్నాయి. కోపంతో రగిలిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయి.. జీవితంలో స్థిరపడలేక.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక.. వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి బలైపోయిన యువత దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఐదేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిరుద్యోగులు రెట్టింపు పెరిగారు. కోటి ఆశలతో చదువులు పూర్తి చేసి విద్యాలయాల నుంచి బయటకు రావడమే తప్ప.. కొలువులు దక్కింది లేదు. తన ఐదేళ్ల కాలంలో జగన్‌ ఒక్క పరిశ్రమను కూడా తేలేక చేతులెత్తేశారు. పైగా ఉన్నవాటినీ వేధింపులతో తన్ని తరిమేశారు. కనీసం దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో వివిధ పరిశ్రమలు, ఐటీ, ఉత్పత్తి.. ఇతర సేవల రంగాల్లో కొలువులు తెచ్చుకునేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించారా? అంటే అదీ లేదు. గత తెదేపా ప్రభుత్వం నెలకొల్పిన వాటినీ సరిగ్గా నిర్వహించలేక తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారు. అసలేమాత్రం దూరదృష్టి లేని జగన్‌ నిర్వాకం కారణంగా నైపుణ్య శిక్షణ దారి తప్పింది. రాష్ట్రంలో ఉద్యోగమంటే.. గ్రామ సచివాలయాలవైపో లేదంటే వాలంటీర్ల బ్యాడ్జీలవైపో చూడాల్సిన పరిస్థితి.

ఆనాటి పరిస్థితులే వేరు..

నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో పరిస్థితి వేరు. మన రాష్ట్రంలో ఎంతో ప్రతిభ ఉన్న యువతను నైపుణ్యాలపరంగా కాస్త సానబడితే ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు దక్కించుకుంటారని నాటి సీఎం చంద్రబాబు భావించారు. పరిశ్రమల్లో ఉన్న అవకాశాలు.. సిబ్బంది కొరత అంశాలను విశ్లేషించి.. ఇక్కడి యువతకు ఏం ఇవ్వాలో ఆలోచించారు. వీరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయో గుర్తించి వారికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఫలితంగానే 2014-19 మధ్యకాలంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆరు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల్లో 22 వేలమందికి శిక్షణ ఇచ్చి మంచి కొలువులు సాధించేలా చేయగలిగారు. ఈ శిక్షణ ఓ ఉద్యమంలా సాగిందంటే అతిశయోక్తి కాదు.


జగన్‌ పాలనలో..

  • గత ప్రభుత్వ హయాంలోని ఆరు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తప్ప కొత్తగా ఒక్కటీ ఏర్పాటు చేయలేదు.
  • ప్రతీ కేంద్రంలో కంప్యూటర్లు: 60
  • కేంద్రాల్లో శిక్షణ ఇచ్చే సిబ్బంది కొరత
  • కొన్ని కోర్సులకే ఉచిత శిక్షణ. అత్యధిక కోర్సులకు ఫీజులు పిండేశారు. ఫలితంగా పేద విద్యార్థులను ఈ శిక్షణకు దూరం చేశారు.
  • ఐదేళ్లలో శిక్షణ పొందినవారు పదివేలమంది కూడా లేరు. అదీ ఆన్‌లైన్‌లో ఏదో మమ అనిపించారంతే. అందుకే.. సగం మందికి కూడా కొలువులు రాలేదు.

తెదేపా హయాంలో మంచి కొలువు  

- ఎల్‌.మహేష్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

గత తెదేపా ప్రభుత్వ హయాంలో నేను చదువుకుంటూనే నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్నా. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరంలో ప్రాంగణ నియామకాల్లో కొలువు దక్కింది. మొదట్లో ఏటా రూ. 5 లక్షల వేతనానికి ఎంపికయ్యా. నాలోని నైపుణ్యం వల్ల ఇపుడు రూ. 12 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నా. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో ఇచ్చిన శిక్షణ వల్లే ఇది సాధ్యమైంది.


నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసినప్పటికీ భవన నిర్మాణంలో తీవ్ర జాప్యం వహించారు. ఎట్టకేలకు పూర్తి చేసినా ఇంతవరకూ ప్రారంభించలేదు. ఆ భవనంపైన సచివాలయం 1 భవనాన్ని నిర్మించినప్పటికీ సచివాలయాన్ని మాత్రం నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. దీంతో డిగ్రీ విద్యార్థులు వృత్యంతర శిక్షణకోసం బయట శిక్షణా సంస్థలకు వెళ్లాల్సి వస్తోంది.

న్యూస్‌టుడే, అవనిగడ్డ


గత ప్రభుత్వంలో ఉద్యమంలా నైపుణ్య శిక్షణ

  • విద్యార్థులు చదువుకునే సమయంలోనే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలలకు వెళ్లి నైపుణ్య శిక్షణ అందించడం ఆరంభించారు.
  • వివిధ పరిశ్రమల అవసరాలకు ఎలాంటి నైపుణ్యం కావాలో ముందుగానే తెలుసుకుని.. దానికి తగ్గట్టుగానే సానబట్టారు. దీంతో చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులు సదరు సంస్థలు, పరిశ్రమల్లో చేరేవారు.
  • యువనేస్తం ద్వారా నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతో పాటు.. వారికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ అందించడం సత్ఫలితాలనిచ్చింది.
  • ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి దగ్గర్లోని మండల కేంద్రంలోనే శిక్షణ ఇచ్చేవాళ్లు. ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ సహా అన్ని కోర్సుల వాళ్లకూ అందించారు.
  • ప్రతి కేంద్రంలో 120 మంది చొప్పున ఎంప్లాయిమెంట్‌ స్కిల్స్‌ ఎన్హాన్స్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ (ఈఎస్‌ఈఎం) మాడ్యూల్‌ను రూపొందించి రెండు వారాల సమయంలో 40 గంటల పాటు శిక్షణ ఇచ్చారు.
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆకట్టుకునే రెజ్యూమ్‌ తయారీ మొదలుకుని.. ఉద్యోగాలకు అవసరమైన అన్ని నైపుణ్యాలను నేర్పించారు. కళాశాలల్లో సైతం రెండు వారాల శిక్షణను విస్తృతంగా అందించారు.
  • కోర్సులు పూర్తి కాగానే... ఉద్యోగ మేళాల ద్వారా కొలువులు దక్కేలా చేశారు.
  • జగన్‌ సర్కారు హయాంలో ఉద్యోగ మేళాలు లేవు... కొలువులూ లేవు.

డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ప్రపంచస్థాయి నైపుణ్యం ఉండాలంటే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు చాలా కీలకం. అందుకే చంద్రబాబు హయాంలో ఉమ్మడి జిల్లాలో ఆరు కేంద్రాలను నెలకొల్పారు. వీటిలో అధునాత నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు పెద్దపీట వేశారు. కానీ.. జగన్‌ గద్దెనెక్కాక ఈ కేంద్రాలు మూగబోయాయి. ఎంతో ఆసక్తితో వచ్చిన విద్యార్థులను పట్టించుకున్నవారే లేరు. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా ఆగిపోవటంతో ఈ కేంద్రాలు వెలవెలబోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని