logo

కరోనా వెంటాడినా సంక్షేమం ఆగలేదు

‘రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రెండేళ్లు కరోనా వెంటాడింది. అయినా సంక్షేమ పథకాలు ఆగలేదు. కార్యకర్తలు అప్రమత్తమై పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని’ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Jun 2022 05:32 IST

మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, వేదికపై మంత్రి ఉష, విప్‌ రామచంద్రారెడ్డి తదితరులు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రెండేళ్లు కరోనా వెంటాడింది. అయినా సంక్షేమ పథకాలు ఆగలేదు. కార్యకర్తలు అప్రమత్తమై పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని’ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతలోని శిల్పారామంలో మంగళవారం వైకాపా జిల్లా ప్లీనరీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పెద్దిరెడ్డి హాజరై మాట్లాడారు. వైకాపా ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేశామన్నారు.  రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయాలతో గ్రామస్థాయికి పరిపాలన తీసుకెళ్లామన్నారు. మంత్రి ఉష మాట్లాడుతూ సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు కార్పొరేషన్లతోపాటు పాలనలో భాగస్వామ్యం కల్పించారన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వైకాపా పెద్దపీట వేసిందన్నారు. ఎంపీలు రంగయ్య, మాధవ్‌, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌రెడ్డి, పద్మావతి, వై.వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, శివరామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ పాల్గొన్నారు.

సమావేశం పూర్తి కాకుండానే ఖాళీ అయిన కుర్చీలు

ఎమ్మెల్యేలకు గౌరవం తగ్గుతోంది

ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు తగిన గౌరవం దక్కడం లేదని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి అన్నారు. సమావేశం ప్రారంభానికి మునుపే వేదికపై ముందు వరుసలో పలువురు పార్టీ నాయకులు కూర్చొన్నారు. దీంతో ఆయన మండిపడ్డారు. వేదికపై ఎమ్మెల్యేలు కూర్చోడానికి ముందు వరుసలో అవకాశం ఇవ్వండి.. ఎలాగూ ప్రభుత్వ కార్యక్రమాల్లో డీఎస్పీలు, ఆర్డీవోలు ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదు. వారు ఎలా పోస్టింగులు తెచ్చుకుంటున్నారో తెలియదు. వీటన్నింటిపైనా ప్లీనరీలో చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.

వేదికకు దూరంగా గుంతకల్లు ఎమ్మెల్యే

గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి సభావేదికకు దూరంగా ఉండిపోయారు. తన కారు దగ్గర కూర్చుని కార్యకర్తలతో మాట్లాడుతూ కనిపించారు. ఆఖరులో గమనించిన కాపు రామచంద్రారెడ్డి వేదిక వద్దకు రావాలని సూచించినా అక్కడే ఉండిపోయారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలతో కలిసి వేదిక కింద కూర్చొన్నారు. ఈ అంశంపై మీడియా ప్రతినిధులు అడగ్గా.. సమాధానం దాటవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని