logo

గాడితప్పిన పట్టణ ప్రణాళిక

ఇంటి నిర్మాణానికి ఏఏ పత్రాలు కావాలి..? స్థలం అనుమతి పొందిన లేఅవుట్‌లో ఉందా? గ్రీన్‌ జోన్‌లో ఉందా? అనుమతులు వస్తాయా? రావా?.. ఇలా అన్ని వివరాలను దరఖాస్తు పెట్టుకొన్న సమయంలోనే పరిశీలించి చెప్పాలి. కానీ హిందూపురం మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దర

Published : 29 Jun 2022 05:32 IST

హిందూపురం పట్టణం, అర్బన్‌, న్యూస్‌టుడే

పట్టణ ప్రణాళిక విభాగ కార్యాలయం

ఇంటి నిర్మాణానికి ఏఏ పత్రాలు కావాలి..? స్థలం అనుమతి పొందిన లేఅవుట్‌లో ఉందా? గ్రీన్‌ జోన్‌లో ఉందా? అనుమతులు వస్తాయా? రావా?.. ఇలా అన్ని వివరాలను దరఖాస్తు పెట్టుకొన్న సమయంలోనే పరిశీలించి చెప్పాలి. కానీ హిందూపురం మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ పదేపదే తిప్పుకొంటున్నారు. చివరకు అన్నిపత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించిన తరవాత తాము అనుమతి ఇవ్వలేమని, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం భూ వినియోగ క్యాటగిరీ మరో దానికి కేటాయించారని ఇంటి నిర్మాణానికి అనుమతి రాదని చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి.. వాటి వివరాలను ఆన్‌లైన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పట్టణంలో 131 అక్రమ లేఔట్లను గుర్తించారు. వాటిలో 11 లేఔట్లు చెరువు స్థలం, గ్రీన్‌, పారిశ్రామిక జోన్‌లలో ఉండటంతో వాటిని క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం లేకపోవడంతో పక్కనపెట్టారు. మిగిలిన 120 అక్రమ లేఔట్లను ఆన్‌లైన్‌ చేయాల్సి ఉండగా సకాలంలో పూర్తి చేయలేకపోయారు. నిర్దేశిత గడువు ముగిసినా  పని జరగకపోవడంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉన్నతాధికారులు వచ్చారు. ఇక్కడి అధికారులు పనిచేయలేరని గుర్తించి చివరకు ధర్మవరం నుంచి సిబ్బందిని రప్పించి ఆన్‌లైన్‌ చేయించారు. ఇలాంటి కీలక సమయంలో అధికారులు సెలవు పెట్టడం గమనార్హం.  

సమన్వయ లోపం: పట్టణంలో 33 మంది ప్లానింగ్‌ కార్యదర్శులు, వారిని నడిపించడానికి ఇద్దరు టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు ఉన్నా.. వారి మధ్య సమన్వయం లేక పనులు ముందుకు సాగడం లేదు. వారు సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రజాప్రతినిధుల సహకారంతో పట్టణంలో అనాధికార నిర్మాణాలు జరుగుతున్నాయి. వార్డు సచివాలయాల్లో ఉండాల్సిన ప్లానింగ్‌ కార్యదర్శులను తమ ఛాంబర్‌లలోనే ఉంచుకోవడం, వారి నుంచి రావాల్సిన దరఖాస్తులను నేరుగా తమ వద్దకే తెప్పించుకోవడం చేస్తున్నారు.

* ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలని స్థానిక డీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలుగా దరఖాస్తుదారు, ఆన్‌లైన్‌లో ప్లాన్‌ తయారుచేసిన ప్రైవేటు ఇంజినీర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ అనుమతులు రాలేదు.  

* మున్సిపల్‌ ఉపాధ్యాయుడు ఒకరు వేసవి సెలవుల్లో ఇంటి నిర్మాణం చేసేందుకు ప్లాన్‌ అనుమతి కోసం మున్సిపాలిటీకి రెండు నెలల కిందట రూ.1.30 లక్షల రుసుం చెల్లించారు. ఆ స్థలం అనధికార లేఅవుట్‌లో ఉందని, అపరాధ రుసుం కట్టాలని చెప్పడంతో అదీ చెల్లించారు. ఇప్పటివరకు అనుమతి మంజూరు కాలేదు. స్థలానికి అనుమతి ఇవ్వాలంటే విజయవాడలోని రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నుంచి అనుమతి రావాలని అధికారులు రెండు వారం కిందట చెప్పారు. ఇదే విషయం ముందే చెబితే.. తాను ఇల్లు కట్టాలనే ఆలోచననే పక్కన పెట్టి ఉండేవాడినని ఆ ఉపాధ్యాయుడు వాపోతున్నారు.  


సక్రమంగా పని చేసేలా చూస్తాం

-వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ కమిషనర్‌

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అధికారుల మధ్య సమన్వయం లేక ఇబ్బందులు ఎదురయిన మాట వాస్తవమే. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకొంటాం. ఇక నుంచి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతంగా అయ్యేలా చూస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని