logo

ఆర్టీసీ ఛార్జీల మోత

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక రెండోసారి ఛార్జీల మోత మోగించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీయే అతిపెద్ద రవాణా సంస్థ. పేద, మధతరగతి ప్రజల ప్రయాణ సాధనంగా సేవలు అందిస్తోంది. సామాన్యులు ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు

Updated : 02 Jul 2022 06:04 IST

కనిష్ఠంగా రూ.15, గరిష్ఠంగా రూ.120 వరకు పెంపు

జిల్లాలో రోజుకు రూ.5 కోట్ల భారం

అనంత ఆర్టీసీ, న్యూస్‌టుడే: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయ్యాక రెండోసారి ఛార్జీల మోత మోగించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీయే అతిపెద్ద రవాణా సంస్థ. పేద, మధతరగతి ప్రజల ప్రయాణ సాధనంగా సేవలు అందిస్తోంది. సామాన్యులు ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణాలు సాగిస్తున్నారు. అలాంటి ప్రజారవాణాశాఖ కొద్దికాలంలోనే రెండుసార్లు ఛార్జీలను పెంచడం భారంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్‌ ధర తగ్గిన నేపథ్యంలోనూ భారం మోపడంలో న్యాయం లేదని ప్రయాణికులు ఆవేదనకు గురవుతున్నారు. అనవసరమైన సెస్‌, అదనపు రుసుములు ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. కొత్తధరలు శుక్రవారం నుంచి రెండు జిల్లాల్లోనూ అమలులోకి వచ్చాయి. రీజియన్‌ వ్యాప్తంగా అన్ని షెడ్యూలు బస్సుల్లో కొత్త ఛార్జీలను వసూలు చేశారు. జిల్లా ప్రయాణికులపై రోజుకు సుమారు రూ.5 కోట్ల అదనపు భారం పడనుంది. రెండు జిల్లాల వ్యాప్తంగా 925 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.

సెస్‌.. అదనపు రుసుం

అసలు కంటే కొసరు ఎక్కువైనట్టు.. ఆర్టీసీలో ఛార్జీలతో కలుపుతున్న పన్నులు, అదనపు వసూళ్లు సామాన్యులకు భారంగా మారింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి చార్జీలతో పాటు సుమారు ఆరు రకాలైన సెస్‌ వసూలు చేస్తున్నారు. బస్టాండ్లలో సదుపాయాల పన్ను, ఇంధన పన్ను, ప్యాసింజర్‌, భద్రత పన్ను, టోల్‌గేట్‌తోపాటు టికెట్‌పై చిల్లర సమస్య లేకుండా రౌండ్‌ఫిగర్‌గా వసూలు చేయడం వంటివి ఇబ్బందికరంగా మారాయి. ఆర్టీసీలో వెళ్లే ప్రజలకు బస్సు ప్రయాణ స్థితిని తెలుపుతూ చరవాణికి సమాచారం పొందేందుకు పన్ను వేస్తున్నారు. పల్లెవెలుగు లాంటి సర్వీసులకు సమాచారం అవసరం లేకున్నా పన్నుభారం తప్పడం లేదు. పిల్లలకు వసూలు చేసే ఆఫ్‌ టికెట్‌పైనా పన్ను విధిస్తున్నారు. టికెట్‌ ధరను రౌండ్‌ ఫిగర్‌ చేయడంతోనూ భారం పడుతోంది. ఉదాహరణకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో టికెట్‌ రూ.11 ఉంటే దాన్ని రూ.15గా నిర్ణయించారు. లగ్జరీ సర్వీసుల్లో రూ.11 ఛార్జీని రౌండ్‌ ఫిగర్‌చేసి రూ.20 వసూలు చేయడంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. పల్లెవెలుగుల్లో మొదటి స్టేజ్‌కు రూ.పది ఉంటే రెండోస్టేజ్‌కు రూ.20గా ఛార్జీ నిర్ణయించడంతో గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని