logo

పిడికిలి బిగించి.. పోరాటం సాగించి!

ఎన్నో ఉద్యమాలు, ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతావని బానిస సంకెళ్లు తెంచుకుంది. దేశవాసులు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. బ్రిటీషు సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో

Published : 10 Aug 2022 05:20 IST

ఆంగ్లేయులకు ఎదురొడ్డిన అనంతవాసులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఎన్నో ఉద్యమాలు, ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతావని బానిస సంకెళ్లు తెంచుకుంది. దేశవాసులు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. బ్రిటీషు సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా జరిగిన జాతీయోద్యమంలో అనంతపురం జిల్లా పాత్ర కూడా ఉంది. గాంధీజీ స్వయంగా జిల్లాలో పర్యటించి ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో వేలాదిగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పలువురు సమరయోధులు గాంధీతోపాటు జైలుకు వెళ్లారు. అనంతవాసులు ఆర్థిక సాయం చేయడమే కాకుండా పిడికిలి బిగించి పోరాటాలు కొనసాగించారు. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ఆనాటి ఉద్యమ ఘట్టాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..  

మద్యపాన నిషేధ ఉద్యమం

* గుత్తికి చెందిన పట్టుకేశవపిళ్లై 1885 డిసెంబరు 25న బొంబాయిలో జరిగిన తొలి జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యారు. 1917లో అనిబిసెంట్‌ ప్రారంభించిన హోంరూల్‌ ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. జాతీయ కాంగ్రెస్‌కు అనిబిసెంట్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా కేశవపిళ్లై ఉపకార్యదర్శిగా పనిచేశారు.


* గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణోద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం నింపింది. గుత్తిలో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని కొనసాగించారు. గుత్తివాసులు 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ పాల్గొన్నారు. బాబురాజేంద్రప్రసాద్‌ ఇక్కడ పలు గ్రామాల్లో పర్యటించడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఎన్‌పీ శర్మ, నరసింగరావు, లక్ష్మీనారాయణగౌడ్‌, వెంకటప్ప, చంద్రమౌళేశ్వరరావు, కొండారెడ్డి, పెద్దరాయప్ప, చిన్నరాయప్ప, ఆకుల నారాయణప్ప తదితరులు చురుకైన పాత్ర పోషించారు.

- గుత్తి


* మహాత్మగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో రాయదుర్గానికి చెందిన చెన్నప్ప, తిప్పయ్య పాల్గొన్నారు. గాంధీజీ వెంట నడిచి కర్ణాటకలోని కార్వారు జైలులో మూడు నెలలు శిక్ష అనుభవించారు. పట్టణానికి చెందిన నాగన్నగౌడ్‌ సత్యాగ్రహంలో పాల్గొని నెల్లూరు, తిరుచునాపల్లిలో జైలు శిక్ష అనుభవించారు.


అమ్మవారి ఆశీస్సులతో..

స్వాతంత్య్ర పోరాట సమయంలో ధర్మవరంలో ఖద్దరు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. గాంధీజీ స్వయంగా ఇక్కడి వచ్చి స్థానికుల్లో స్ఫూర్తి నింపారు. జాతీయ నేతల పిలుపు మేరకు రహస్య పోరాటాన్ని సాగించారు. ప్రస్తుతం ఉన్న పుట్లమ్మ దేవాలయంలో పల్లెం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యమ వ్యూహాల్ని అమలు చేశారు. నిషేధ సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ధర్మవరంలో కొంతమంది వద్ద రహస్య పత్రాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు పలుమార్లు దాడులు కూడా చేశారు. వారికి దొరకకుండా జాగ్రత్త పడ్డారు. 1937లో పుట్లమ్మ గుడిపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసిన సందర్భంలో జనాలపై పోలీసులు లాఠీఛార్జి చేసి, పల్లెం శ్రీనివాసులును అరెస్టు చేసి బళ్లారి జైల్లో ఉంచారు.

- ధర్మవరం


పట్టాలు తొలగించి..


స్వాతంత్య్ర సమరయోధులు

గుంతకల్లులో బ్రిటీషు కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. సైనికుల విడిది కేంద్రంగా ఉండేది. గుంతకల్లు కొట్టాలకు చెందిన బయ్యా వెంకటనాయుడు, పుల్లయ్య నాయకత్వంలో 1942లో గుంతకల్లు-బళ్లారి రైలు మార్గంలోని పట్టాలను తొలగించారు. గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురికావడంతో సైనికులు ఊరిపై దాడి చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఇష్టానుసారంగా కొట్టారు.

* 1943లో కసాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు, నెట్టికల్లప్ప, బొలికొండప్ప, రమణప్ప, మేకల అంజి, రసూల్‌సాబ్‌, నారాయణచార్యులు, రామానుజచార్యులు గూడ్స్‌ రైలును పడగొట్టాలని నిర్ణయించుకున్నారు. నంచెర్ల సమీపంలోని పట్టాలను తొలగించారు. విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు వారిని అరెస్టు చేసి బళ్లారి జైలులో వేశారు.

  - గుంతకల్లు


ఆర్ట్స్‌ కళాశాల వేదికగా..

స్వాతంత్య్ర ఉద్యమానికి విద్యాలయాలు దోహదపడ్డాయి. ఉద్యమకారుల్ని తయారుచేసే కర్మాగారాలుగా పనిచేశాయి. అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల స్వాతంత్య్ర పోరాటానికి వేదికగా నిలిచింది. కళాశాల 1916లో ఏర్పాటైంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, బళ్లారి జిల్లాలకు ఇదొక్కటే కళాశాల. రాయలసీమ, కర్ణాటక ఉద్యమకారులకు ఉమ్మడి వేదికగా ఉండేది. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా కళాశాలలో పెద్దఎత్తున తిరుగుబాటు జరిగింది. విద్యార్థులు రైళ్లను నిలిపేసి ఉద్యమించారు. కళాశాలలోని ప్రయోగశాలను తగులబెట్టారు. ప్రతిచర్యగా సిపాయిలు విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేసి, కళాశాల నుంచి తొలగించారు.

- అనంత విద్య


బ్రిటీష్‌ బంగ్లాకు నిప్పు..

నల్లమాడ మండలం బసిరెడ్డిపల్లి వద్ద ఉన్న అటవీప్రాంతంలో అప్పట్లో ఆంగ్లేయులు బంగ్లాను నిర్మించుకున్నారు. ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆంగ్లేయులు ఇక్కడే బసచేసేవారు. కదిరి ప్రాంతానికి చెందిన బసిరెడ్డిపల్లి వెంకటరెడ్డి, ముత్యాలచెరువుకు చెందిన శ్యామమూర్తి ఆధ్వర్యంలో పల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవారు. ఈ నేపథ్యంలోనే బ్రిటీషు బంగ్లాకు నిప్పుపెట్టారు. దీంతో వెంకటరెడ్డి, శ్యామమూర్తి తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపారు.

- కదిరి పట్టణం


క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నా

గోవిందరెడ్డి దంపతులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి, సబ్‌కలెక్టర్‌ నవీన్‌ తదితరులు

‘1942లో ముంబయిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నా. అప్పుడు నా వయసు 15 ఏళ్లు. వందేమాతరం.. గాంధీజీకి జై అంటూ నినాదాలు చేయగా పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో ఉంచి చితకబాదారు. మైనర్‌ కావడంతో జడ్జి సూచన మేరకు విడుదల చేశారు. చదువుకునే వయసులో రాజకీయాలు వద్దని బుద్ధిగా చదువుకోమని సూచించారని’ స్వాతంత్య్ర సమరయోధుడు మెళవాయి గోవిందరెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆయనను మంగళవారం ఎమ్మెల్యే తిప్పేస్వామి, సబ్‌కలెక్టర్‌ నవీన్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యమంలో తన అనుభవాలను పంచుకున్నారు.

- మడకశిర గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని