logo

గోసంరక్షణ పట్టని జగన్‌

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు.

Published : 26 Apr 2024 02:29 IST

భక్తులు విరాళమిచ్చినా గోశాల నిర్వహించని దుస్థితిలో ప్రభుత్వం

పట్టణంలో వ్యర్థాలు తింటున్న గోవులు 

కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. ఇలా ఐదారేళ్లలో భక్తులు ఆలయానికి రూ.30 లక్షల మేర విరాళం ఇచ్చారు. పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు ఈ నిధులను బ్యాంకుల్లో భద్రంగా దాచిపెట్టి గోసంరక్షణను గాలికొదిలేశారు. దాతలు ఇచ్చే విరాళాలను మాత్రం చప్పుడు కాకుండా తీసుకుంటారని భక్తులు మండిపడుతున్నారు. వాటిని వినియోగించి మూగజీవాలైన గోవుల సంరక్షించాల్సిన బాధ్యత అధికారులు, పాలకవర్గంపై ఉంటుంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు పాలకవర్గాలు మారాయి. అయినా ఆ దిశగా దృష్టి సారించలేదు. దీంతో ఆదాయం వచ్చే అభివృద్ధి పనుల వైపే మొగ్గు చూపారు. ఉపయోగం లేని కారణంగా ఆలయ గోవులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా గోవులు రహదారులే ఆవాసాలు, చెత్తలో పడేసిన కాగితాలే ఆహారంగా తింటూ జీవిస్తున్నాయి. మూగ రోదన పాలకవర్గం, ఆలయ అధికారులకు పట్టకపోవటం దారుణమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

వృథాగా రూ.లక్షలు..

కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కటారుపల్లిలో రెండెకరాల భూమి ఉంది. అందులో తెదేపా హయాంలో ఆలయానికి భక్తులు ఇచ్చిన ఆవుల సంరక్షణకు శాలను నిర్మించారు. షెడ్డు, కాపలదారుకు ప్రత్యేక గది, నీటి వసతి లాంటి సదుపాయాలకు రూ.19 లక్షలు ఖర్చు చేశారు. గోవుల సంరక్షణకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా కొంత మొత్తం ఉండాలన్న పిలుపుతో భక్తులు రూ.30 లక్షల వరకు విరాళం అందించారు. కానీ, ప్రస్తుత పాలకులు గోసంరక్షణ గాలి కొదిలేశారు. ఫలితంగా ఈ ప్రదేశంలో కట్టిన షెడ్డు, గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. అంతేగాకుండా మందుబాబులు, చీకటి కార్యకలాపాలకు ఆవాసంగా మారాయి.

శిథిలావస్థలో షెడ్డు

పశువుల మూగరోదన

నరసింహస్వామికి భక్తులు గోదానం గోప్యంగా చేస్తుంటారు. మొక్కులు తీరిన భక్తులు గోవులను ఆలయం వద్ద స్వామి పేరుచెప్పి వదిలేస్తుంటారు. అలా ఆలయానికి ఇచ్చినవి ఒకప్పుడు వందల్లో ఉండేవి. ఆరేళ్ల కిందట వాటి సంఖ్య 28కే పరిమితం చేశారు. రహదారులు ఆవాసాలవడంతో ప్రమాదాలు, కాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లను తినటం వల్ల అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. కొందరు దుండగులు రాత్రిళ్లు చాటుగా కబేళాలకు తరలిస్తున్నారు. దీంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. సంరక్షించలేని ఆలయ అధికారులు విరాళాలను తీసుకుని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని