logo

మాట తప్పాడు.. మడత పెట్టాడు

ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్‌... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు.

Updated : 26 Apr 2024 04:54 IST

సాగునీటి ప్రాజెక్టులపై హామీలను గాలికొదిలేసిన జగన్‌
ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడని వైనం

ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్‌... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. అనంతపురం మనవడిని అంటూ సెంటిమెంట్‌ డైలాగులు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఉమ్మడి అనంత జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి కూడా ఇవ్వలేదు. నాన్నగారు రైతు బాంధవుడు.. నేను రైతు పక్షపాతినంటూ కోతలు కోసి.. అన్నదాతల గోడు ఏనాడు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం.. సీఎంగా శంకుస్థాపన చేయడం మినహా గంప మట్టి తీయలేదు. కొత్తగా ఒక ఎకరాకు నీరు ఇవ్వకపోగా.. ఆయకట్టును బీళ్లుగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం-న్యూస్‌టుడే, బొమ్మనహాళ్‌, గుమ్మఘట్ట

శిలాఫలకం వెక్కిరిస్తోంది

‘జీడిపల్లి, పేరూరు ప్రాజెక్టులను అనుసంధానం చేసి రాప్తాడు నియోజకవర్గంలోని 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రూ.803 కోట్లతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం. అత్యంత వేగంగా ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు మేలు చేస్తాం.’

2020, డిసెంబరు 9న జలశయాల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్‌ చెప్పిన మాటలివి

శంకుస్థాపనతో సరి

సీఎం హోదాలో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్‌.. పనుల్ని చేపట్టడం మర్చిపోయారు. మూడున్నరేళ్లుగా అంగుళం పని జరగలేదు. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు ఉన్న 53.45 కి.మీ. ప్రధాన కాలువపై నాలుగు ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీటు కట్టడాలు చేపట్టాల్సి ఉంది. కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద ఎత్తిపోతలు నిర్మించాలి. నిధులు ఇవ్వకపోవడంతో పనులు ముందుకు వెళ్లలేదు. భూములిచ్చిన రైతన్నలకు పరిహారం పెంచి ఇస్తామని చెప్పి మోసం చేశారు.


ఆరు నెలలన్నారు.. మూడేళ్లు కావొస్తోంది

బీటీ ప్రాజెక్టు

‘జీడిపల్లి-భైౖరవానితిప్ప ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. రైతులకు పరిహారం అందించి పనులు వేగవంతం చేస్తాం. కృష్ణా జలాలలో 114 చెరువులు నింపి ఆయకట్టుకు నీరందిస్తాం’

2021, జులై 8 తేదీన సీఎం జగన్‌

లభించని మోక్షం

భైరవానితిప్ప ప్రాజెక్టుకు జగన్‌ మోక్షం ప్రసాదించలేదు. రెండుసార్లు సీఎం హోదాలో హామీలు గుప్పించినా పనులు పునఃప్రారంభం కాలేదు. తెదేపా హయాంలో తవ్విన కాలువలు పూడిపోతున్నాయి. యంత్రసామగ్రి తుప్పు పట్టింది. చాలామంది రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. 114 చెరువులు నింపుతామని చెప్పి పిల్ల కాలువలో నీరు పారించలేదు. ఫలితంగా భైరవానితిప్ప ఆయకట్టు రైతులు పొలాలను బీళ్లుగా వదిలేసి వలసలు వెళ్తున్నారు.


ఉంతకల్లుపై ఉత్తమాటలే..

ఉంతకల్లు-నేమకల్లు గ్రామాల మధ్య ఎన్‌ఏబీఆర్‌ జలాశయ ప్రతిపాదిత స్థలం

‘బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు శ్రీఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులను మొదలుపెట్టి.. యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తాం’

2021, జులై 8న రాయదుర్గం పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం జగన్‌  

ఊసేలేదు: హెచ్చెల్సీ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి తెదేపా ప్రభుత్వం తలపెట్టిన ఉంతకల్లు ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది. మూడేళ్లు దాటినా ఊసేలేదు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన డీపీఆర్‌ పనులు నిలిచిపోయాయి. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి వచ్చే వరద నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో వాడుకోవాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం 5 టీఎంసీల సామర్థ్యంతో ఉంతకల్లు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. డీపీఆర్‌ కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. 4,700 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. రూ.1180 కోట్ల అవసరమవుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రణాళిక రూపొందించారు. వైకాపా ప్రభుత్వం రాగానే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని