logo

అన్నయ్యా.. అక్కా చెల్లెమ్మలకు ఆసరా ఎన్నడు?

మహిళా సంఘాలు 2019 ఏప్రిల్‌ 11వ తేదీకి ముందు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Updated : 24 Jan 2023 10:42 IST

రుణమాఫీ కోసం మహిళల ఎదురుచూపు

ధర్మవరం దుర్గానగర్‌లో సమావేశం నిర్వహస్తున్న మెప్మా మహిళలు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: మహిళా సంఘాలు 2019 ఏప్రిల్‌ 11వ తేదీకి ముందు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మహిళల రుణాల మాఫీకి మెప్మా అధికారులు బయోమెట్రిక్‌లో సంతకాల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కడం కోసం అక్క, చెల్లెమ్మలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా అనంత నగరపాలకతో పాటు గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, పామిడి, రాయదుర్గం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పుట్టపర్తి మున్సిపాలిటీల్లోని మెప్మా సంఘాల్లో వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద 11,748 సంఘాలకు 1,13,648 మంది సభ్యులకు నాలుగు విడతల్లో రూ.353.35 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మొదటి విడతగా అర్హులైన మహిళా ఖాతాల్లో 2020 సెప్టెంబరులో రూ.87.33 కోట్లు, 2021 అక్టోబరులో రూ.89.40 కోట్లు జమ చేశారు. మూడో విడత 2022 సెప్టెంబరు-అక్టోబరులో రూ.89.40 కోట్లు జమ చేయాల్సి ఉంది. 2023 జనవరి నెల వచ్చినా నగదు జమ కావడం లేదు. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కుడు కోసం వేచి చూస్తున్నారు.

ఎప్పుడు జమ చేస్తారు?

ప్రతినెలా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు. బ్యాంకు రుణాల లావాదేవీలు, పలు సమస్యలపై మెప్మా సీసీలు, ఆర్పీలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఎప్పుడు ఖాతాల్లో వైఎస్‌ఆర్‌ ఆసరా జమ చేస్తారు? అని మహిళలు మెప్మా సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు వస్తుందా.. రాదా అనే సందేహంలో ఉన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు కూడా సక్రమంగా రావడం లేదు. ఇక తమకు ఇచ్చే సొమ్ము ఇస్తారా? అనే ఆలోచనలో మహిళా సంఘ సభ్యులు అయోమయంలో ఉన్నారు.

నివేదికలు సిద్ధం చేశాం

అర్హత కలిగిన సభ్యుల వివరాలను బయోమెట్రిక్‌ చేసి సిద్ధం చేసి ఉంచాము. 2022 సెప్టెంబరు, అక్టోబర్‌ నెలల్లో 3వ విడత సొమ్ము రూ.89.40 కోట్లు జమ కావాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేయగానే మహిళా ఖాతాల్లో జమ అవుతుంది.

 విజయలక్ష్మీ, మెప్మా పీడీ, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని