ఫోర్జరీ సంతకాలతో రూ.8 కోట్ల భూమి కాజేసే యత్నం
చనిపోయిన వ్యక్తి అప్పు తీసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోట్లు తయారుచేసి విలువైన భూమి కాజేసేందుకు యత్నించిన ముఠాను ఉరవకొండ పోలీసులు అరెస్టు చేశారు.
ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు
నిందితుల అరెస్టు చూపుతున్న గ్రామీణ సీఐ శేఖర్
ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్‌టుడే: చనిపోయిన వ్యక్తి అప్పు తీసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోట్లు తయారుచేసి విలువైన భూమి కాజేసేందుకు యత్నించిన ముఠాను ఉరవకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ గ్రామీణ సీఐ శేఖర్ గురువారం విలేకరులకు తెలిపిన వివరాలిలా.. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన గుండాల నారాయణప్ప 2016లో మృతి చెందాడు. ఆయనకు 40 ఎకరాల భూమి ఉంది. దాని విలువ దాదాపు రూ.8 కోట్లు. నలుగురు కుమార్తెలు సంతానం కాగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ భూమిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్ సీతారాముడు, నారాయణ అనే వ్యక్తులు గుండాల నారాయణప్ప పేరిట 2015లో రూ.5 లక్షలు అప్పు ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోటు సృష్టించారు. అప్పు చెల్లించాలని ఉరవకొండ కోర్టులో దావా వేశారు. ఆ నోటీసులు నారాయణప్ప భార్య వెంకటలక్ష్మమ్మ, కుమార్తెలకు అందకుండా చేసి, వారు కోర్టుకు రాలేదన్న కారణంతో కోర్టు ద్వారా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న నారాయణప్ప కుమార్తె సరితశైలజ ఆ సంతకాలు తన తండ్రివి కాదని, తమకు నోటీసులే అందలేదని గుత్తి కోర్టులో దావా వేసింది. పరిశీలించిన కోర్టు ఆ ప్రక్రియ నిలుపుదల చేసింది.
నగదు, బీమా మొత్తం కాజేసి.. బళ్లారికి చెందిన సురేష్‌బాబు నారాయణప్ప అల్లుడికి సోదరుడు. వెంకటలక్ష్మమ్మకు 2016లో రూ.3 లక్షలు అప్పు ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకంతో ప్రామిసరీ నోటు సృష్టించుకుని కోర్టును ఆశ్రయించాడు. దీనిని కూడా సరితశైలజ అడ్డుకుంది. 2021లో వెంకటలక్ష్మమ్మ మృతి చెందింది. మరో కుమార్తె బళ్లారికి చెందిన ప్రసన్నరజిని, అల్లుడు టీవీఆర్ ప్రసాద్ వెంకటలక్ష్మమ్మ బ్యాంకు ఖాతాలోని నగదు, బీమా మొత్తాన్ని ఆమె మృతి చెందినా బతికి ఉన్నట్లు సృష్టించి కాజేసినట్లు సీఐ వివరించారు. ఈ విషయాలు బహిర్గతం కావడంతో సరితశైలజను హత మార్చడానికి ఆ ముఠా ప్రయత్నించినట్లు చెప్పారు. ఆమె ఈనెల 23న అనంతపురంలో ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేసింది. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో ఉరవకొండ గ్రామీణ సీఐ శేఖర్ దర్యాప్తు చేపట్టారు. ముఠాలోని సీతారాముడు, నారాయణ, టీవీఆర్ ప్రసాద్, ప్రసన్నరాణి, సురేష్‌బాబు, రంగనాథ్, లోకేష్, స్టాంప్‌వెండర్ హమీదాభాను అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. సీతారాముడు, నారాయణ, టీవీఆర్ ప్రసాద్ విడపనకల్లులోని ఆర్.కొట్టాల క్రాస్‌లో ఉండగా గురువారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని, అరెస్టు చేయడానికి ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు వివరించారు. నిందితుల అరెస్టులో పీసీలు మహేష్‌బాబు, మౌనేష్, ఓబులేసు, మైనుద్దీన్ పాల్గొన్నారు.
అగ్రిమెంట్లు సృష్టించి.. నిందితుల బంధువులైన బళ్లారికి చెందిన రంగనాథ్ రూ.9.57 లక్షలకు 7.02 ఎకరాలు, లోకేష్ రూ.17.22 లక్షలకు 6.71ఎకరాలు వెంకటలక్ష్మమ్మతో కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నగదును చెల్లించినట్లు ఆమె ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్లు సృష్టించారు. తమకు భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలోనూ ఆమెకు, కుమార్తెలకు నోటీసులు అందకుండా ఏకపక్షంగా కోర్టు డిక్రీని పొంది, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు. అగ్రిమెంటులో సంతకాలు ఫోర్జరీవంటూ సరితశైలజ కోర్టు ద్వారా అడ్డు పడింది. అగ్రిమెంటుపత్రాల వివరాలు కోరుతూ ఆమె అనంతపురం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సహచట్టం ద్వారా సంప్రదించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పత్రాలు ముద్రితమైన రోజే రాసుకుని.. రూ.100 విలువ కలిగిన నాలుగు అగ్రిమెంటు పత్రాలు 2018 ఏప్రిల్2 లో నాసిక్‌లో ముద్రితమయయ్యాయి. అనంతపురం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి 2018 సెప్టెంబరులో రాగా అదే ఏడాది నవంబరు 24న అనంతపురానికి చెందిన స్టాంప్‌వెండర్ హమీదాభానుకు అధికారులు విక్రయించారు. ఆ పత్రాలు నాసిక్‌లో ముద్రితమైన రోజే రాసుకున్నట్లు నిందితులు ఫోర్జరీ సంతకాలతో వాటిని సృష్టించుకున్నారు. అక్రమానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిరూపితమైంది. స్టాంప్‌వెండర్‌ను కూడా నకిలీ ముఠా కేసులో చేర్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని