logo

ఐదేళ్లయినా అధికారులిక్కడే..

మున్సిపల్‌ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది.

Published : 28 Mar 2024 04:57 IST

మున్సిపల్‌ విభాగంలో అమలుకాని నియమావళి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: మున్సిపల్‌ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది. నగరపాలకలో కార్యదర్శి, ఇన్‌ఛార్జి ప్రజా ఆరోగ్య అధికారిగా పనిచేస్తున్న సంగం శ్రీనివాసులు ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మూడు నెలల కిందట ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పలువురు అధికారులను బదిలీ చేశారు. ఆఖరుకు పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఓ అధికారిని సైతం సొంతశాఖకు పంపారు. ఎన్నికల నియమావళి ప్రకారం మూడేళ్లు ఒకేచోట విధుల్లో ఉంటే కచ్చితంగా బదిలీ చేయాలి. ఐదేళ్లు దాటినా ఆయన ఇక్కడే ఉండటంతో ఎన్నికల నిబంధనలు కొందరికేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన విభాగంలో ఆయనను సహాయకుడిగా నియమించడం విశేషం. అనంత నగరపాలక కమిషనరుగా పనిచేసిన పీవీవీఎస్‌ మూర్తిని ఆ తర్వాత మున్సిపల్‌ ఆర్డీగా నియమించారు. ఆయన మూడేళ్లకు పైగా అనంతపురంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అహుడాలో పనిచేస్తున్న వైస్‌ ఛైర్మన్‌ మురళీకృష్ణ గౌడ్‌ మూడేళ్లు దాటినా బదిలీ చేయడం లేదు. ఇలా పలువురు అధికారులు ఎన్నికలు సమీపిస్తున్నా అనంతను వదలకుండా ఇక్కడే ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని