logo

అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం

అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది.

Published : 29 Mar 2024 04:24 IST

ఆత్మహత్యాయత్నానికి ముందు వీడియోలో బాధను తెలియజేస్తున్న కుటుంబ సభ్యులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని పావగడకు చెందిన సురేశ్‌, భార్య కరుణ, కుమారుడు యతీశ్‌ బజ్జీల కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఉరవకొండకు చెందిన ప్రవళికతో యతీశ్‌కు ఐదు నెలల కిందట వివాహం కాగా ఆమె ప్రస్తుతం గర్భిణికావడంతో పుట్టింట్లో ఉన్నారు. మూడేళ్ల కిందట వారు రాజు అనే వ్యక్తి దగ్గర రూ.18 లక్షలకు కారును కొనుగోలు చేసి రూ.5 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. రాజు వద్దనే మరో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. రోజుకు రూ.7 వేలు వడ్డీ చొప్పున రూ.35 వేలు చెల్లించారు. రావాల్సిన బాకీ మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తూ రాజు వారిని రోజూ బూతులు తిడుతున్నాడు. కారు తన పేరుపై ఉందని కొన్ని రోజలు కిందట తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఈనెల 25న ముగ్గురు కారులో బయలుదేరి బళ్లారి, హోసపేట, ఉరవకొండలోని బంధువుల ఇంటికి వెళ్లి గురువారం పావగడకు బయల్దేరారు. మార్గమధ్యంలో అప్పు ఇచ్చిన వ్యక్తి చేసిన వేధింపులు వివరిస్తూ.. ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయాన్ని ముగ్గురు కారులోనే వీడియో తీసి బంధువులకు ఫోన్‌లో పంపారు. ఇప్పటికే అప్పులు తీర్చేందుకు కోడలకు చెందిన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టామని వీడియోలో చెప్పారు. ఆమెకు అన్యాయం చేసి మేము వెళ్లిపోతున్నామని, తమను క్షమించమని వేడుకున్నారు. తమ ఆత్మహత్యాయత్నంకు కారణమైన కారు యజమాని రాజును పోలీసులు శిక్షించాలని ప్రాధేయపడ్డారు. కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి గ్రామం వద్ద రోడ్డుపై కారును ఉంచి తమతో తెచ్చుకున్న పురుగుల మందును ముగ్గురు తాగి ప్రాణాలతో కొట్ముమిట్టాడుతూ తమను కాపాడాలంటూ కేకలు వేశారు. అటుగా వస్తున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ వన్నూరస్వామి గమనించి తన వాహనంలో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని