logo

ఉద్యోగులకు ప్రలోభాల ఎర

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్‌ కేంద్రాల (ఫెసిలిటేషన్‌) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు.

Published : 06 May 2024 07:22 IST

డబ్బు ఫోన్‌పే చేస్తామని బేరసారాలు
వైకాపా శ్రేణుల బరితెగింపు

పోలింగ్‌ కేంద్రం సమీపంలో వైకాపా నాయకులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్‌ కేంద్రాల (ఫెసిలిటేషన్‌) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. ఓటు వేసేది లేదని మొహం మీదే ఛీదరించుకుంటున్నా.. డబ్బు ఇస్తామంటూ ఆశ చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్‌ జరిగే ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్దే మకాం వేసి ఓట్ల కొనుగోలుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా సరే ఉద్యోగ, ఉపాధ్యాయులు నిక్కచ్చిగా తెగేసి చెబుతున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టింది.  

  • ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 23,900 మందిని నియమించామని అధికార యంత్రాంగం ప్రకటించింది. కేడర్ల వారీగా ఎంతమంది అన్న వివరాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. అయినా సరే.. 23,532 మంది ఎన్నికల సిబ్బంది ఫాం-12 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా మంది పేర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. ఈ నెల 3 నుంచి 6 దాకా ఓటు వినియోగం కోసం పోలింగ్‌ సాగుతోంది. సులువుగా..వేగంగా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించలేదు. అయినా సరే..ఓటు వేసి తీరుతామంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. అధికార వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలన్న కసి, పట్టుదల వారిలో కనిపిస్తోంది.
  • వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ శ్రేణుల ద్వారా ఓట్లను పొందడానికి రకరకాల ప్రలోభాలు చేస్తున్నారు. ఒక్క అనంత నగరంలోనే 6 వేల ఓట్లు ఉన్నాయి. శింగనమల, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో 3 వేల పైచిలుకు ఉన్నాయి. ప్రస్తుతం అనంత నగరం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు వంటి ప్రాంతాల్లో తాయిలాలు ఎర చూపిస్తున్నారు. ఎలాగైనా సరే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లను పొందడానికి ఫోన్‌ పే, గూగూల్‌ పే, పేటీఎం.. వంటి రూపాల్లో డబ్బులు పంపిణీ చేయడానికి యత్నిస్తున్నారు. ప్రతి ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్దే మకాం వేసి.నీళ్ల బాటిళ్లు, బిస్కెట్లు, కూల్‌ డ్రింకులు, సమోసా.. వంటి వాటిని పంపిణీ చేసి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్‌ఓ, పోలీసు అధికారుల కళ్లెదుటే ఇవన్నీ కొనసాగిస్తున్నా వైకాపా శ్రేణుల బరితెగింపునకు అడ్డుచెప్పకపోవడం విశేషం.

సార్‌... ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి. రూ.5 వేలు తీసుకోండి.. అంటూ శింగనమల నియోజకవర్గ ఫెసిలిటేషన్‌ కేంద్రం సమీపంలో ఓ ఉద్యోగ సంఘం నాయకుడు హల్‌చల్‌ చేస్తుండటం చర్చనీయాంశమైంది.  

కొత్తూరు జూనియర్‌ కళాశాల ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద వైకాపా నాయకురాలు, మహిళా టీచరు మధ్య సంభాషణ ఇది

  • వైకాపా నాయకురాలు: మేడమ్‌.. నమేస్తే. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి.
  • మహిళా టీచరు: ఎవరు మీరు?.
  • వైకాపా నాయకురాలు:  వైకాపా నాయకురాలిని. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి. మీ ఫోన్‌ నంబరు ఇస్తే.. డబ్బులు ఫోన్‌పే చేస్తాం.
  • మహిళా టీచరు: అసలు.. మీరు ఇక్కడ ఉండటమే తప్పు. ఇక్కడ ప్రచారం ఎలా చేస్తారు.
  • వైకాపా నాయకురాలు: ప్లీజ్‌ మేడమ్‌.. ఫ్యాన్‌కు ఓటు వేయండి.
  • మహిళా టీచరు:  ఒక్కసారి చెబితే అర్థం కాదా. మీ నిర్వాకం చాలు. వెళ్లిపోండి (కోపంగా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని