logo

వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై

నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు.

Published : 06 May 2024 07:29 IST

ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా భూకబ్జా, దందాలు
ఈనాడు డిజిటల్‌, అనంతపురం

నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. చేసే ప్రతి అవినీతిలో కొంత నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కప్పం కడుతున్నారు. మండలాల్లో అన్ని తామై వ్యవహరిస్తున్నారు.మేం ఏం చేసినా ‘మా అన్న’ చూసుకుంటాడులే అనే ధైర్యంతో పేట్రేగిపోతున్నారు. ఖాళీగా కనపడిన భూమి కబ్జా చేస్తున్నారు. నిత్యం భూదందాలు, సెటిల్‌మెంట్లలో తలదూరుస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. అధికారులంతా మా చేతుల్లోనే ఉండాలి.. మేం చెప్పిందే చేయాలంటూ పెత్తనం చెలాయిస్తున్నారు. అసైన్డ్‌ భూముల్ని అడ్డగోలుగా అమ్మేసుకుంటూ అందులో సగభాగం ప్రజాప్రతినిధులకు కప్పం కడుతున్నారు. పాసుపుస్తకాల జారీ నుంచి పంటనష్ట పరిహారం వరకు ప్రతిదాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. చివరికి పేదల కోసం గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించి అమ్మేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.కోట్లు వెనకేసుకున్నారు.

సర్కారు భూములు స్వాహా

సాగుపట్టాల పంపిణీ కార్యక్రమం మొత్తం మండలాల్లోని వైకాపా కనుసన్నల్లోనే జరిగింది. ఒక్కో అనుచరుడు 10 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కాజేశారు. కొండలు, గుట్టలకు పాసుపుస్తకాలు సృష్టించి కబ్జా చేశారు. లేఅవుట్లు వేసి అమాయకులకు విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరం, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులు తమ వశం చేసుకున్నారు. ప్రైవేటు భూముల్లోనూ తలదూర్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి పేదల భూముల్ని చెరపడుతున్నారు. ఇదంతా ప్రజాప్రతినిధి లేదా ఆయన కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ చేస్తున్నారు. అధికారులు సైతం వారి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

8 ఎకరాలు..రూ.16 కోట్లు

కొత్తచెరువు మండలంలో ప్రజాప్రతినిధి అనుచరులు ప్రైవేటు ఆస్తులను నకిలీ పత్రాలతో కొట్టేశారు. తిరుమలదేవరపల్లిలో పుట్టపర్తికి చెందిన ఓ వ్యక్తి భూమిని నకిలీ ఆధార్‌ సృష్టించి కాజేశారు. రూ.16 కోట్లు విలువ చేసే 8 ఎకరాల భూమిని యజమానికి తెలియకుండానే కడప జిల్లాకు చెందిన వ్యక్తులకు అమ్మేశారు. బాధితుడు కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేవలం కేసు నమోదు చేసి వదిలేశారు. ప్రజాప్రతినిధి ఒత్తిడితో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన వైకాపా నాయకుడు ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితంగా ఉంటూ కబ్జాపర్వాన్ని కొనసాగించారు. పట్టణంలో ఓ వ్యక్తికి చెందిన 30 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

పరిహారాన్నీ వదల్లేదు

ఉరవకొండ నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు రెచ్చిపోతున్నారు. కూడేరు మండలంలోని ముఖ్య అనుచరుడు గుట్టలను కబ్జా చేసి 10 ఎకరాల వరకు కుటుంబ సభ్యుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నాడు. పంట నష్టపరిహారంలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు. నిత్యం మండలంలోని అధికారుల్ని బెదిరిస్తూ భూదందాలకు పాల్పడుతున్నారు. గ్యాస్‌పైపులైన్‌ పరిహారంలోనూ రూ.లక్షల్లో అవినీతికి పాల్పడ్డారు. మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న గుట్టల్లో జూద స్థావరాలు ఏర్పాటు చేసి కమీషన్లు దండుకుంటున్నారు.

ఆక్రమించి.. లేఅవుట్లు వేసి..

ధర్మవరం నియోజకవర్గం ప్రజాప్రతినిధి అండ చూసుకుని ముదిగుబ్బలోని ఆయన అనుచరుడు ప్రభుత్వ భూముల్ని చెరపట్టారు. సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. కొన్నింటిని లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అనంతపురం-కదిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల్ని కొట్టేసి అమ్ముకున్నారు. ఎదురుచెప్పిన ఓ రెవెన్యూ అధికారిని బదిలీ చేయించారు. గత ప్రభుత్వంలో స్టేడియం కోసం కేటాయించిన భూమిని సైతం ఆక్రమించి ప్లాట్లుగా మార్చారు. ముస్లింల శ్మశానవాటికకు కేటాయించిన భూమిని కాజేసి పాసుపుస్తకాలు చేయించుకున్నారు.


అంతటా వసూళ్లే..

కనగానపల్లి మండలంలో ప్రజాప్రతినిధి సొంత సామాజికవర్గానికి చెందిన నాయకుడి అవినీతి, అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ప్రజాప్రతినిధి సోదరుడి అండతో మామిళ్లపల్లి, ముక్తాపురం, దాదులూరు, కుర్లపల్లి ప్రాంతాల్లో రియల్టర్ల నుంచి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. పెండింగ్‌లో ఉన్న భూములను ఆన్‌లైన్‌ చేయాడానికి పంచాయితీ చేసి కమీషన్లు దండుకున్నాడు. కనగానపల్లి మండలంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకొని భూమిలోపల ఏర్పాటు చేసిన కేబుల్‌ పనులకు సంబంధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో అనంతపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలో రూ.కోటి వెచ్చించి ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఓ కాలనీలో ఐదు సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి ఆన్‌లైన్‌ చేసుకున్నాడు.


ఇళ్లు.. బిల్లులు బొక్కేశారు

రాప్తాడులో ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉండే అనుచరులు జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల పట్టాలను అమ్మేసుకున్నారు. ఒక్కొక్కరి పేరుతో మూడు, నాలుగు ఇళ్లు మంజూరు చేయించుకుని బిల్లులు బొక్కేశారు. ఇలా జగనన్న కాలనీల్లోనే రూ.5 కోట్ల వరకు కాజేశారు. ప్రసన్నాయపల్లిలో ఏకంగా అనంతపురం నగరపాలక భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఉపాధి హామీ పథకం నుంచి పండ్ల తోటల పెంపకం వరకు అన్నింటిలోనూ అవినీతికి పాల్పడి అడ్డంగా సంపాదించారు. రాప్తాడు మండల పరిషత్‌లో రెండోస్థానంలో ఉండే ఓ ప్రజాప్రతినిధి జగనన్న కాలనీల్లోని ఓపెన్‌ స్పేస్‌ స్థలాలను అమాయకులకు విక్రయించారు. ఒక్కో ప్లాటును రూ.2 లక్షల నుంచి రూ.3 వరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.3 కోట్లు వెనకేశారు.


నకిలీలు సృష్టించి..

ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు అనుచరులు ప్రైవేటు స్థలాలనూ  వదల్లేదు. నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి విలువైన భూములు కాజేస్తున్నారు. స్థానికంగా యజమానులు లేని స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారు. కొన్నింటికి డబుల్‌ రిజిస్రేషన్లు చేసి ప్రైవేటు ఆస్తులను అమ్ముతున్నారు. ప్రజాప్రతినిధికి వాటాలు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని