logo

అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి

ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్‌ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.

Published : 08 May 2024 05:41 IST

వైకాపా నేతలకు మేలు చేకూర్చేలా
సివిల్‌ తగాదాల్లో తలదూరుస్తున్న వైనం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్‌ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారి సైతం వైకాపా నాయకులకు వంత పాడుతున్నారు. వారికి మేలు చేకూర్చేలా సివిల్‌ తగాదాల్లో తలదూరుస్తున్నారు.

వారి మెప్పు పొందేందుకు విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై స్థానికంగా విమర్శలు  వెల్లువెత్తాయి. రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గత నెల 25న నామినేషన్‌ దాఖలు చేసేందుకు ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో సదరు అధికారి బందోబస్తు నిర్వహించారు. శాంతినగర్‌లో వారపు సంతలో రైతులు, వ్యాపారులు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుండగా వారందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. రైతులు ప్రతిఘటించడంతో సీఐ వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రైతులు, వ్యాపారులు డివిజన్‌ స్థాయి పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన కల్పించుకుని రైతులకు సర్దిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని ఓ వైకాపా నాయకుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దీనిపై ‘ఈనాడు’లో కథనం వెలువడింది. అధికారులు కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని సదరు నాయకుడికి నోటీసులు ఇచ్చారు. అతడి నుంచి రూ.17లక్షలు రికవరీ చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చారు. గడువు మీరిపోవడంతో మున్సిపల్‌ అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేయాలని సదరు పోలీసు అధికారిని కోరగా.. ‘‘మీరు చెప్పినట్లు నేను కేసు ఎలా పెడతాను, నాలుగేళ్లలో ఎవరెవరు శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించారో వివరాలు ఇవ్వండి’ అని మున్సిపల్‌ అధికారులను అడుగుతూ పరోక్షంగా వైకాపా నాయకుడిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పట్టణంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న స్థలాన్ని ఓ వివాహితకు గతంలో కేటాయించడంతో హౌసింగ్‌ శాఖ ఆమెకు ఇల్లు మంజూరు చేసింది. అందులో ఇల్లు నిర్మిస్తుండగా పట్టణ ప్రజాప్రతినిధి సమీప బంధువు ఈ స్థలం తనదేనని అడ్డు తగిలి పోలీసులను ఆశ్రయించాడు. బాధితురాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ స్థలం ఆమెదేనని స్పష్టం చేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ అధికారుల ఉత్తర్వులు ఇవ్వాలని సదరు పోలీసు అధికారి బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించి, పరోక్షంగా వైకాపా నాయకుడికి మద్దతు తెలిపారు. మంగళవారం కోతిగుట్టలో ఓ వైకాపా నాయకుడు వంకను ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకుని ప్రొక్లెయిన్‌ను పోలీసులకు అప్పజెప్పారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదనే కారణం చూపి ప్రొక్లెయిన్‌ను గంట వ్యవధిలోనే వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని