logo

ప్రజల గొంతెండి.. ప్రభుత్వం మిన్నకుండి

గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ముందే నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. నీటి ఎద్దడిని గుర్తించి పరిష్కరించే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేపట్టడం లేదు.

Updated : 10 Mar 2024 05:14 IST

వేసవి ముందే తాగునీటి గండం
ట్యాంకర్ల సరఫరాకు ముందుకురాని గుత్తేదారులు

శిరసనంబేడులో మంచినీటికి అవస్థలు

చిత్తూరు జడ్పీ, గూడూరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ముందే నీటి పథకాలు మొరాయిస్తున్నాయి. నీటి ఎద్దడిని గుర్తించి పరిష్కరించే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేపట్టడం లేదు. వేసవిలో గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ సన్నద్ధత కార్యక్రమం క్రాస్‌ చేపడుతోంది. ఈ సమయంలో దెబ్బతిన్న చేతి బోర్లు బాగు చేయడం.. చేతి పంపులకు గ్రీజ్‌ పెట్టడం.. ఫ్లషింగ్‌ చేయడం వంటివి చేస్తుంటారు. వైకాపా వచ్చాక వీటిని పట్టించుకోలేదు. యథా ప్రభుత్వం తథా అధికారుల్లా నడుచుకుంటున్నారు. ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో సమగ్ర రక్షిత నీటి పథకాలు 26 ఉన్నాయి. పంచాయతీలు నిర్వహించే పథకాలు, మండల పరిషత్‌ నిర్వహించే పథకాలతోపాటు డైరెక్టర్‌ బోర్‌వెల్స్‌, చేతి పంపులు ఎక్కువగా ఉన్నాయి. సీపీడబ్ల్యూఎస్‌ పథకాల నిర్వహణకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగిస్తారు. ఈ పథకాలు అరకొరగా నిర్వహిస్తుండగా ఇతర పథకాలు జాడే కనిపించడం లేదు. పంచాయతీలు నిర్వహించే చాలా పథకాలకు నిధుల సమస్య వెంటాడుతోంది. దీంతో సర్పంచులు నీటి సమస్యలు వదిలేస్తున్నారు.


రూ.2,800 కోట్ల వాటర్‌గ్రిడ్‌కు ఎగనామం..

చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లోని గ్రామాలకు రూ.2,800 కోట్ల వాటర్‌ గ్రిడ్‌ పనులను వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. తెదేపా హయాంలో మంజూరు కాగా.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన జల్‌జీవన్‌ మిషన్‌, బ్యాంకు రుణాల ద్వారా హైబ్రిడ్‌ యాన్యూటీ మోడ్‌లో తాగునీరు అందించడానికి మంజూరు కాగా వాటి జాడే లేకుండా చేసింది. శుద్ధినీటిని అందించే ఈ బృహత్తర పథకానికి తూట్లు పొడిచింది.

గూడూరు మండలంలో సమగ్ర రక్షిత నీటి పథకాలు రెండు చోట్ల ఉన్నాయి. పంచాయతీ నిర్వహించే పథకాలు 96 కాగా మండల పరిషత్‌ పరిధిలో 35 వరకు ఉన్నాయి. డైరెక్టు పథకాలు 37 ఉన్నాయి. ఇవి కాకుండా 1265 తాగునీటి చేతి బోర్లు కాగా ఇవన్నీ చాలా చోట్ల దెబ్బతిన్నా బాగు చేసే పరిస్థితి లేదు. నీటి ఎద్దడి గుర్తించిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే పరిస్థితులు కాగా వీటికి బిల్లులు రాక పక్కన పెట్టేశారు.

పాకాల మండలంలో 273 ఆవాసాలున్నాయి. ఇక్కడ ఒక సమగ్ర రక్షిత నీటి పథకం, 244 పంచాయతీల నిర్వహణ పథకాలు కాగా 27 ఎంపీడబ్ల్యూఎస్‌ పథకాలు, 202 డైరెక్టర్‌ నీటి పథకాలున్నాయి. 1054 చేతి బోర్లు ఉన్నా వాటిని బాగు చేసే పరిస్థితి లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని