logo

‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్‌?

బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్‌ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అందరి ఎదుటే మందలించారు.

Updated : 20 Apr 2024 06:10 IST

 గురువులతో శౌచాలయాలు కడిగించి..

మందుబాబులకు కాపలా పెట్టి

ఐదేళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి దారుణం

  • బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్‌ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అందరి ఎదుటే మందలించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. సంజాయిషీ నోటీసులు ఇస్తారనే భయంతో ఆసుపత్రి పాలయ్యారు. ఒత్తిడితో మెదడులో రక్తం గడ్డకట్టి కోమాలోకి వెళ్లిపోయారు.
  •  బీఎన్‌కండ్రిగ మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదయం 8:30 గంటలకే పాఠశాలకు వెళ్లారు. సాంకేతిక కారణాల వల్ల యాప్‌లో హాజరు నమోదు కాలేదు. ఆరోజు ఆయనకు గైర్హాజరు వేశారు.

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, చిత్తూరు(విద్య), బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: గురువును గౌరవించు అనేది ఇతర రాష్ట్రాల్లోని మాట. ఉపాధ్యాయులను హింసించు అనేది మన జగనన్న తీరు. బతకలేని బడిపంతులు నౌకరి అనే నానుడి నుంచి జగనన్న బారిన పడకుండా బతికించండి అనే మాటలు వినబడుతున్నాయి వైకాపా పాలనలో. ఎంతో మంది మేధావులను అందించిన ఉపాధ్యాయులు.. జగన్‌ ప్రభుత్వంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి ఎదుగుదలకు తోడ్పడాల్సిన వారు... బోధనేతర పనుల్లో నిమగ్నమయ్యేలా మార్చారు.

యాప్‌ల సమస్య పరిష్కరించాలని తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ఐకాస ఆధ్వర్యంలో నిరసన(పాతచిత్రం)

వృత్తికే అవమానం..

మద్యపానం హానికరం అంటూ విద్యార్థులకు నీతి బోధనలు చేసిన టీచర్లే.. కరోనాలో ప్రభుత్వ మద్యం దుకాణాల ఎదుట కాపలా ఉంచారు జగనన్న. సరస్వతి కటాక్షం గలవారు మద్యానికి కాపలాదారుగా ఉండేలా, ఆదేశాలిచ్చిన సీఎంకు గురుభక్తి అంటే ఏ పాటి గౌరవం ఉందో ఇందులోనే స్పష్టమవుతోంది. మందుబాబులకు రక్షణగా విద్యావంతులను కాపలా ఉంచిన ఏకైక ప్రభుత్వం వైకాపానే అంటే అతిశయోక్తి కాదు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లాలో చేసే హడావుడి అంతాఇంతా కాదు. విద్యార్థుల ఎదుటే ఉపాధ్యాయులను అవమానించేలా మాట్లాడటం. చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు, గంగవరం, పలమనేరులో ఉపాధ్యాయులకు అకారణంగా మెమోలు ఇచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ఉన్నత చదువులు.. మరుగుదొడ్లు శుభ్రపరచడానికా..!

ఉన్నత చదువులు చదివి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారితో మరుగుదొడ్ల ఫొటోలు తీయించడం జగన్‌ పాలనకు పరాకాష్ఠ. ప్రతిరోజు క్రమం తప్పకుండా మరుగుదొడ్లు శుభ్రం చేపించటం ఆ ఫొటో యాప్‌లో పోస్టు చేయడం విధిగా చేయాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్కావెంజర్లు రాని సందర్భంలో ఉపాధ్యాయులే మరుగుదొడ్లు శుభ్రం చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. లేదంటే షోకాజ్‌ నోటీసులు అందుకోవల్సిందే. ఇక నాడు-నేడు పనుల పర్యవేక్షణ పనులు ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దాంతో పాటు అధికారులు చెప్పే ఆదేశాలు పాటించాలి. ఇవన్నీ చేసిన ఉపాధ్యాయుడు ఇక పాఠం చెప్పేది ఎప్పుడూ..? ఆ విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శి అయ్యేదెప్పుడు?


మార్కెట్‌ వద్ద పనిచేశాం

కొవిడ్‌ సమయంలో మార్కెట్‌ వద్ద రద్దీ విపరీతంగా ఉండడంతో అక్కడ నియంత్రించే పని చేపట్టాం. కొవిడ్‌ కోరల నుంచి తాము రక్షించుకుంటూ ప్రజలను కాపాడటంలో ఎంతో కృషి చేశాం. అయితే పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సిన వారినే ఇలా మార్కెట్‌, చాపల మార్కెట్‌ వద్ద డ్యూటీ వేయడం చాలా బాధ కలిగించింది. ప్రభుత్వం చెప్పిన పని చేయాల్సిన ఉద్యోగి బాధ్యతగా పనిచేశాం. వివిధ రకాల పనులకు ఆ విధంగా ఉపాధ్యాయులను నియమించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి.
-యాగమయ్య, పీడీ


పాఠాలు చెప్పేది ఎప్పుడు మరి?

గత ప్రభుత్వం హయాంలో పాఠశాలకు ఒకటి చొప్పున ట్యాబ్‌, బయోమెట్రిక్‌ ఉండేవి. సులువుగా సకాలంలో హాజరు వేసుకొని బోధన జరిగేది. సాంకేతిక సమస్యలుంటే ఇతర సిబ్బంది దాన్ని పరిష్కరించేవారు. జగన్‌ ప్రభుత్వంలో మాత్రం పూర్తి విరుద్ధంగా మారింది. ఉపాధ్యాయుడు సరిగ్గా ఉదయం తొమ్మిది గంటలకు యాప్‌లో, అది కూడా పాఠశాల ఆవరణలో హాజరు వేయాలి. సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా.. గైర్హాజరు కింద పరిగణలోకి తీసుకుంటారు. ఆ తరువాత తరగతి గదిలోని విద్యార్థుల హాజరు పట్టిక యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి. మధ్యాహ్న భోజన వివరాలు, వండిన తరువాత ఆ వంటల చిత్రాలు అందులో పొందుపర్చాల్సిందే. ఇవన్నీ ఉపాధ్యాయుల పనే. ఇలా యాప్‌లో సమాచారాన్ని చేరవేయడంలోనే రోజు ముగుస్తుంది.


షోకాజ్‌ నోటీసులిచ్చారు..

యాప్‌లు పనిచేయకపోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో సమారు ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆ భయానికి చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
- సోమశేఖర నాయుడు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు(చిత్తూరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని