logo

హామీల వలలో మున్సి‘పల్టీలు’

ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు.

Published : 02 May 2024 05:04 IST

ఉప ఎన్నికల సమయంలో నిధుల విడుదల పేరిట నాటకాలు
ఉత్తర్వులిచ్చినా రూ.85.24 కోట్లు విడుదల చేయని జగన్‌ సర్కారు

మొత్తం పనులు : 100
వీటి విలువ : రూ.85.28 కోట్లు

ఈనాడు-తిరుపతి; న్యూస్‌టుడే, సూళ్లూరుపేట: ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు. ఎన్నికల్లో అవసరం తీరాక ఆయన గజినీగా మారిపోతారు. ఇచ్చిన మాట, జారీ చేసిన ఉత్తర్వులను సైతం మర్చిపోతారు. ఎందుకంటే మాట ఇచ్చి మడప తిప్పడం ఆయన నైజం కాబట్టి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కల్లబొల్లి కబుర్లు చెప్పి మున్సిపాల్టీల్లో ప్రజలను నిలువునా ముంచారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో దీని పరిధిలోని పట్టణ ప్రాంత ప్రజలపై ఎనలేని ప్రేమ కురిపించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు 2021 ఫిబ్రవరి 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ఆర్థిక సంవత్సరాల పరిధిలో (2021-22, 2022-23) వీటిని సమానంగా చేపట్టాలని అందులో స్పష్టం చేశారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరం పూర్తయినా ఇప్పటి పనులు పూర్తికాకపోవడం పక్కనపెడితే కనీసం ప్రారంభం కూడా కాలేదు. ఇదీ జగన్‌ ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులకు ఉన్న విలువన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పురపాలిక పెత్తనం..  పర్యవేక్షణ మండలం

జగన్‌ పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో విలీనం చేశారు. నాటి నుంచి అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. పురపాలక పెత్తనం వచ్చినప్పటికీ పర్యవేక్షణ మాత్రం ఇంకా మండల పరిషత్తు పరిధిలోనే ఉంటోంది.

రెండు మూడు పనులతో సరి

సూళ్లూరుపేట 22వ వార్డులో అంబేడ్కర్‌ భవన్‌ నుంచి చిన్నసత్రం ప్రాంతం వరకు సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు  కేటాయించారు. టెండర్లు పూర్తి చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఇక్కడ రెండు, మూడు పనులే చేశారు. నిధులొచ్చే పరిస్థితి లేదని గుత్తేదారులు పనులు చేయడం లేదు.

జగన్‌ సర్కారుపై నమ్మకం లేక

వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో కర్ణకమ్మవీధి, గాడివారివీధి, కచేరీ వీధుల్లో రూ.10 లక్షల వ్యయంతో డ్రెయిన్లు నిర్మించాల్సి ఉన్నా పనులు చేపట్టలేదు. మున్సిపాలిటీలో చాలా వరకు పనులు అసలు ప్రారంభమే కాలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకం లేకపోవడంతో గుత్తేదారులు ముందుకు రాలేదు.

ప్రారంభానికే  దిక్కులేదు

నాయుడుపేట మున్సిపాలిటీ గిండివారి తోటలో సిమెంటు రోడ్లతోపాటు డ్రెయిన్ల  నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటివరకు పనులు చేపట్టలేదు. మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన చాలా పనులు ఇలాగే ప్రారంభానికి నోచుకోలేదు.

బిల్లులు రాక.. కోర్టుకెళ్లి..

శ్రీకాళహస్తి కన్నాలకాలువ నుంచి మున్సిపాలిటీ పరిధి దాటిన తర్వాత వరకు రూ.1.59 కోట్లతో వర్షపునీటి కాలువ నిర్మాణం పూర్తి చేయాలి. మూడేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. రెండు పనులు ప్రారంభించినా గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

గూడూరు మున్సిపాలిటీ

గూడూరు మున్సిపాలిటీలో బనిగిసాహెబ్‌పేట, ధూర్జటినగర్‌, సంయుక్తనగర్‌, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాల్లో సీసీ రహదారుల నిర్మాణం కోసం రూ.11.75 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఎక్కడా పనులు చేపట్టలేదు.

టెండర్లు పిలవ లేదు..

మున్సిపాలిటీల్లో ప్రస్తుతం వస్తున్న ఆదాయం ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయి. పన్నులు పెంచుకుంటూ వెళ్తున్నా నిధులు మిగలని దుస్థితికి చేరాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప ఈ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో స్థానిక సంస్థలు సైతం కేవలం కొద్ది పనులకు మినహా మిగిలిన వాటికి ఎక్కడా టెండర్లు పిలవలేదు.

గుత్తేదారుల  ఆవేదన..

పనులు చేపట్టిన గుత్తేదారులకు ప్రభుత్వం పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. అధికారులు చేతులు ఎత్తేయడంతో మిగిలిన పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని