logo

కర్రలు, రాళ్లతో వెంటాడి..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్‌ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది.

Published : 02 May 2024 05:24 IST

 వైకాపా శ్రేణుల విధ్వంసాన్ని చేష్టలుడిగి చూసిన పోలీసులు
మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామంలో దాడి ఘటన వీడియో వెలుగులోకి

యర్రాతివారిపల్లెలో వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో పరుగులు తీస్తున్న బీసీవైపీ కార్యకర్తలు  

ఈనాడు, చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్‌ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. అందులో తొలుత యర్రాతివారిపల్లెకు బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్‌, ఆయన అనుచరులు రాగా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కొందరు గ్రామస్థులు రాళ్లు, కర్రలతో వెంటబడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా పెద్దగా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. అనుమతులు తీసుకుని గ్రామానికి వస్తామని రామచంద్ర యాదవ్‌ చెప్పి వెనక్కి వెళ్తుండగా బీసీవైపీ కార్యకర్తలు, వాహనాలపై రాళ్ల దాడి చేశారు. కొంతసేపటి తర్వాత గొడ్లవారిపల్లె వద్ద మరికొందరు వైకాపా కార్యకర్తలు అడ్డువచ్చి ప్రచార రథాలు, కార్లు వెళ్లకుండా అడ్డంగా పడుకున్నారు. అక్కడ కూడా రాళ్ల వర్షం కురిపించి వెంబడించారు. సదుం స్టేషన్‌ ఆవరణలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి లోపలున్న వ్యక్తులను చెప్పుతో కొట్టేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో దాడి చేస్తున్న వీడియో స్పష్టంగా ఉన్నా పది మందిపైనే కేసులు నమోదు చేయడాన్ని బీసీవైపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. అదే రామచంద్రయాదవ్‌ వర్గీయులు ఎక్కువమందిపై ఎలా కేసులు పెట్టారని ప్రశ్నిస్తున్నారు.

యర్రాతివారిపల్లెలో రాళ్లతో దాడి చేస్తున్న వైకాపా కార్యకర్త 

కోర్టుకు ఇరువర్గాలు

సదుం మండలం యర్రాతివారిపల్లెలో జరిగిన ఘర్షణల ఘటనలో పోలీసులు బీసీవైపీ, వైకాపా  కార్యకర్తలను అరెస్టు చేసి చిత్తూరు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఏఎస్పీ ఆరిఫుల్లా, పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం సదుం స్టేషన్‌కు వచ్చి కేసు పురోగతి తెలుసుకున్నారు. రామచంద్ర యాదవ్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాకు బుధవారం అమరావతిలో ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి వర్గీయులు దాడి చేస్తే బీసీవై పార్టీ అధినేతపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

  • ఘటన జరిగిన రోజే రామచంద్రయాదవ్‌ వర్గీయులను పోలీసులు అరెస్టు చూపకుండా.. బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మేరకు కాగితాలపై సంతకం చేయాలని అడగ్గా.. వారు నిరాకరించారు. ముందురోజే అరెస్టు చేసి.. ఆలస్యంగా చూపడాన్ని వారు ప్రశ్నించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వారిని కోర్టుకు హాజరుపరిచారు. ఈ క్రమంలో వారిని భౌతికంగా హించారనే అనుమానాలున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని