logo

శతాధిక వృద్ధుడి మృతి

ముమ్మిడివరానికి చెందిన శతాధిక వృద్ధుడు తణుకు సుబ్రహ్మణ్యం(102) మంగళవారం మృతి చెందారు. 1920లో జన్మించిన ఆయన ముమ్మిడివరంలో సుధీర్ఘకాలం పాటు టైలరింగ్‌ వృత్తి నిర్వహించారు.

Published : 10 Aug 2022 06:13 IST

సుబ్రహ్మణ్యం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముమ్మిడివరానికి చెందిన శతాధిక వృద్ధుడు తణుకు సుబ్రహ్మణ్యం(102) మంగళవారం మృతి చెందారు. 1920లో జన్మించిన ఆయన ముమ్మిడివరంలో సుధీర్ఘకాలం పాటు టైలరింగ్‌ వృత్తి నిర్వహించారు. సుబ్రహ్మణ్యంకు అయిదుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు సంతానం కాగా, 14 మంది మనుమలు, మునిమనుమలు ఉన్నారు.


కారు ఢీకొని మహిళ..

ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరంలో జాతీయ రహదారి-216పై ఓ డ్రైవింగ్‌ స్కూలు కారు ఢీకొని మహిళ మృతిచెందారు. అమలాపురం గ్రామీణం కామనగరువుకు చెందిన జి.వెంకటరత్నం భార్య అమ్మాజీ(55)తో కలిసి ద్విచక్ర వాహనంపై ఓ పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా అనాతవరం వద్ద డ్రైవింగ్‌ స్కూలుకు చెందిన కారు వెనుక నుంచి వారి వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో రోడ్డుపై పడిపోయిన అమ్మాజీ మీదుగా కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆమె కొడుకు, కూతురు ఉద్యోగాల నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.


గోదావరిలో దూకి యువకుడి గల్లంతు

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: ఐ.పోలవరం మండలం మురమళ్లలోని రాఘవేంద్ర వారధిపైనుంచి వృద్ధగౌతమి గోదావరిలోకి దూకి ఓ యువకుడు మంగళవారం గల్లంతయ్యాడు. తన ద్విచక్ర వాహనాన్ని వారధిపై వదిలి గోదావరిలో దూకినట్లుగా స్థానికులు గుర్తించారు. వాహనంలో ఉన్న బ్యాంకు పుస్తకం ఆధారంగా బండారులంక గ్రామంలోని దంగేటివారిపాలేనికి చెందిన దంగేటి శ్రీతేజగా పోలీసులు భావిస్తున్నారు. 26 ఏళ్ల వయసున్న శ్రీతేజ పల్లవారిపాలెంలోని తన సోదరుడు మురళీకృష్ణతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎలక్ట్రికల్‌ వైండింగ్‌ చేసుకుని జీవనం సాగించే శ్రీతేజకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఆత్మహత్యకు యత్నించడానికి కారణాలు తెలియరాలేదు. అతనికోసం పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని