logo

విలువే లేనప్పుడు.. పదవులెందుకు?

స్వపక్షమే.. విపక్షమై గళమెత్తింది.. సమస్యలపై ముక్తకంఠంతో నిలదీసింది.. కాకినాడ జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జడ్పీ సర్వసభ్య సాధారణ సమావేశం దీనికి వేదికైంది

Published : 19 Jan 2023 06:51 IST

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, కాకినాడ నగరం

జడ్పీటీసీ సభ్యులకు సర్ది చెబుతున్న ఛైర్మన్‌ వేణుగోపాలరావు, వేదికపై ఎంపీ వంగా గీత, కలెక్టర్లు హిమాన్షుశుక్లా, కృతికా శుక్లా, జేసీ తేజ్‌ భరత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌

స్వపక్షమే.. విపక్షమై గళమెత్తింది.. సమస్యలపై ముక్తకంఠంతో నిలదీసింది.. కాకినాడ జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జడ్పీ సర్వసభ్య సాధారణ సమావేశం దీనికి వేదికైంది. ఛాంబర్‌కి రండి మాట్లాడదాం.. సమావేశంలో ఎందుకని జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు సర్దిచెప్పినా ఎవరూ తగ్గలేదు. చెప్పాలనుకున్నది చెప్పేశారు. జడ్పీటీసీ సభ్యులకు కనీస గౌరవం లేదనీ, సమావేశాలకు ఆహ్వానాలు అందడం లేదనీ, తమకు తెలియకుండానే అంతా జరిగిపోతోందని ఆక్రోశించడంతో సమావేశం రసాభాసగా మారింది. కీలకమైన ఈ బడ్జెట్‌ సమావేశానికి అధికార పక్ష ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్‌, ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్సీ చిక్కాల మినహా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడం గమనార్హం.

పనుల విషయమూ చెప్పట్లేదు..

ఉమ్మడి జిల్లాలో మాకు తెలియకుండానే పనులు జరుగుతున్నాయి. గౌరవం లేనప్పుడు మేమెందుకు జడ్పీటీసీలుగా ఉండాలి? మీకేమైనా కొందరిపై శ్రద్ధ ఉంటే.. పెద్దోళ్లు చెబితే ఇచ్చుకోండి. పక్క జిల్లాల్లో రూ.లక్షల పనులు కేటాయిస్తున్నారు. పదవి చేపట్టి ఏళ్లు గడుస్తున్నా మాకేమిచ్చారో చెప్పండి.. జడ్పీ నిధులతో పనులు మా ద్వారా జరగకపోయినా కనీసం జరుగుతున్నట్లు అయినా మా దృష్టికి తెండి.
కె.శ్రీనివాసరావు, రావులపాలెం, జడ్పీటీసీ సభ్యుడి ఆవేదన


జగనన్న కమిటీకీ విలువివ్వరా..?

జగనన్నే నాకు హెచ్‌ఎం ఎఫ్‌డబ్ల్యూ కమిటీ సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. కమిటీ మెంబర్‌గా నేను వెళ్లి పీహెచ్‌సీల అభివృద్ధికి నిధుల సౌలభ్యం, సబ్‌ సెంటర్‌కి కేటాయించే నిధుల వెచ్చింపును ప్రశ్నిస్తే.. మీరు సభ్యులే కాదు.. మాకు వచ్చిన ఉత్తర్వుల్లో మీ పేరే లేదంటున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో జడ్పీటీసీ సభ్యులకు విలువ లేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో సభ్యులుగా చేర్చమని జడ్పీ నుంచి లేఖలు వెళ్లినా పట్టించుకోవడం లేదు.
జి.రమాదేవి, కొత్తపేట జడ్పీటీసీ


సభ్యురాలి ఆక్రోశం
నెలలు గడుస్తున్నా పట్టించుకోరేం?
కోనసీమలో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ పూర్తిగా పాడయ్యాయి. ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పక్కర్లేదు.. మంజూరైన రోడ్డు పనులూ పూర్తిచేయకపోతే ఎలా..? మాకు రోడ్డు కావాలి.. గుత్తేదారును బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టండి.. లేదా పని రద్దు చేయండి.. తాత్కాలికంగా గోతులైనా
పూడ్పించుకుంటాం.. ప్రతి సమావేశంలోనూ గుత్తేదారుతో మాట్లాడతామని చెబుతున్నారు.. నెలలు గడుస్తున్నా ఫలితం లేదు.
-రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అసహనం..


గైర్హాజరుపై గరం గరం...

కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, జడ్పీ సమావేశాలకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది హాజరవుతున్నా..ఆయుర్వేద, యునాని ఇతర వైద్యశాలల అధికారులు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. భవిష్యత్తు సమావేశాలకు హాజరయ్యేలా లేఖలు పంపాలని సూచించారు. ఎమ్మెల్సీ చిక్కాల మాట్లాడుతూ, జడ్పీ సమావేశాలకు తూర్పుగోదావరి కలెక్టర్‌ ఎందుకు రావడంలేదు? ఆమె ఎప్పుడూ రారు.. ఆమె ఎవరో సభ్యులకు తెలియదని వ్యాఖ్యానించారు.


ఎన్టీఆర్‌ మహానేత...

మహానేత, నటుడు ఎన్టీఆర్‌కు జడ్పీ సమావేశంలో నివాళి అర్పించాలని ఎమ్మెల్సీ చిక్కాల సూచించారు. దీనిపై స్పందించిన జడ్పీ ఛైర్మన్‌ వస్తూ.. వస్తూ పూల దండ తెస్తే ఆ పని చేసే వాళ్లమని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దీనిపై చిక్కాల ప్రతిస్పందిస్తుండగా.. మళ్లీ జోక్యం చేసుకుని జడ్పీలో ఎన్టీఆర్‌ చిత్రపటం పెట్టాం కదా అని సర్దిచెప్పారు. సమావేశంలో కలెక్టర్లు కృతికా శుక్లా, హిమాన్షుశుక్లా, తూ.గో. జేసీ తేజ్‌భరత్‌, కాకినాడ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, జడ్పీ సీఈవో సత్యనారాయణ ఉన్నారు.


ఆదాయం ఎవరికి వెళ్తోంది?

మామిడికుదురు మండలం కరవాక.. అల్లవరం మండలం ఓడలరేవు మధ్య రేవుకు వేలం జరగకపోయినా అత్యవసర నేపథ్యంలో అనధికార ప్రయాణాలు సాగుతున్నాయి. గతంలో ఈ రేవు వేలం జడ్పీ నిర్వహించేది.. ఇప్పుడా ఆదాయం ఎవరికి వెళ్తున్నట్లని మామిడికుదురు జడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు ప్రశ్నించారు. మామిడికుదురు మండలంలో ఇసుక, బొండు ఇసుక అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ అధికారులను ఆంజనేయులు నిలదీశారు. ్య ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, శంఖవరం జడ్పీటీసీలు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలకు సభ్యులుగా చేర్చాలని డిమాండ్‌ చేశారు.


రహదారులు పట్టవా?

ఎమ్మెల్సీ చిక్కాల మాట్లాడుతూ కాజులూరు మండలం గొల్లపాలెం- కుయ్యేరు రోడ్డు ఏడాదిగా తవ్వి వదిలేశారన్నారు. గొర్రిపూడి- జి.వేమవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు.. తిప్పరాజుపాలెం- కాజులూరు- శీలలంక- తాళ్లరేవు రహదారి దారుణంగా ఉందన్నారు. మధ్యాహ్న భోజనం నాసిగా ఉందనీ.. ఉపాధ్యాయులపై యాప్‌ల భారంతో పర్యవేక్షణ లేక విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతోందన్నారు.


అంచనా బడ్జెట్‌ రూ.1,379 కోట్లు

జడ్పీ సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లు.. వివిధ విభాగాలకు విడుదలయ్యే నిధులతో కలిపి 2023-24కు రూ.1,379 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.  2022-23 సవరణ.. 2023-24 అంచనా బడ్జెట్‌లను ఏకగ్రీవôగా ఆమోదించారు. జడ్పీ సీఈవో సత్యనారాయణ ఆదాయ- వ్యయాల ఆధారంగా పూర్వ, ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలు, సవరణలు వివరించారు. 2022-23లో సవరణ బడ్జెట్‌ కింద ఆదాయం రూ.1,229.43 కోట్లు, వ్యయం రూ.1,228.78 కోట్లుగా పేర్కొన్నారు. 2023-24లో అన్ని పద్దులు కలిపి ఆదాయాన్ని రూ.1,379 కోట్లుగా, వ్యయాన్ని రూ.1,378.30 కోట్లుగా అంచనా* 2023-24లో ఆదాయ వనరుల నుంచి రూ.26.65 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఖర్చులుపోను మిగులు బడ్జెట్‌గా రూ.70 లక్షలు చూపారు.


 

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని