logo

ముంచేస్తున్నా.. ముందు చూపేది?

రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి.

Updated : 04 Sep 2023 06:05 IST

వరద నీటి ముంపులో కొత్త కాకినాడ కూడలి

రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. కాకినాడలోనూ 2021లో ఇదే దుస్థితి పలుచోట్ల చోటు చేసుకుంది. గట్టిగా గంటపాటు వర్షం పడితే రెండు నగరాల్లోనూ పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకుని గంటల తరబడి జనం అవస్థలు పడుతున్నారు. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వరద భయంతో నగరాలు వణికిపోతున్నాయి. ఏటా ముంపు వెంటాడుతున్నా.. పాలకులు, అధికారులు దీని నివారణకు శాశ్వత చర్యల దిశగా దృష్టిసారించడం లేదనే ఆవేదన జనం నోట వినిపిస్తోంది.

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌ నగరంలో శాశ్వత ముంపు నివారణకు చర్యలు చేపట్టడం లేదు.  20 నుంచి 30 మి.మీ వర్షపాతం నమోదైతే చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. 17 ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లలో పూడిక పూర్తిస్థాయిలో తొలగించక చిన్నపాటి వర్షానికే ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. నగరంలో రోజూ 41.64 మిలియన్‌ లీటర్ల వృథా నీరు డ్రెయిన్లలోకి వెళుతోంది. భవిష్యత్తులో ఇది 52.35 మిలియన్‌ లీటర్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృథా నీరు సముద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ముంపు చోటుచేసుకుంటోంది.

ఇలాచేస్తే..

కాకినాడ

  • నగరంలోని అన్ని డ్రైయిన్‌ అవుట్‌లెట్స్‌ ఉప్పుటేరు కాలువలో కలుస్తున్నాయి. దీని వెంబడి కచేరిపేట, పాతబస్టాండు, ప్రేజరుపేట, వెంకటేశ్వరకాలనీ మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ముంపు తప్పించేందుకు ఉప్పుటేరుకు రక్షణ నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలి.
  • 14 కి.మీ.మేర విస్తరించిన రైల్వే డ్రైయిన్‌ కల్వర్టులు వెడల్పు చేయాలి.
  • మెయిన్‌ రోడ్డులో నాలుగు కల్వర్టులను 2002లో పునర్‌ నిర్మించారు. ఇంకా 12 కల్వర్టులు వెడల్పు చేయాలి.
  • రమణయ్యపేట నుంచి ఉప్పుటేరు వరకు ఉన్న పీడబ్ల్యూడీ కాలువను మనుగడలోకి తేవాలి. ఆక్రమణలు తొలగించాలి.
  • చీడీలపొర కాలువ ఆక్రమణలు తొలగించాలి.
  • మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డులో డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నీరు పారడంలేదు. అలంకరణ కోసం ప్లాట్‌ఫారాలు కట్టారు. వీటిలో పూడిక తొలగించాలి.
  • జగన్నాథపురం బాలయోగి విగ్రహం నుంచి మహాలక్ష్మీ నగర్‌ మీదుగా మేజర్‌ డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టాలి.

ప్రతిపాదన అటకెక్కి..

భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు 15 ఏళ్ల కిందట సర్వే చేశారు. సముద్ర మట్టానికి నగరం దిగువన ఉండటంతో సాధ్యపడదని తేల్చారు. పంపింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించినా వ్యయాన్ని  భరించలేమని దాన్ని పక్కన పెట్టారు.

కాలువ నిర్మాణాలు పూర్తికాక...

  • ముంపు నివారణకు అమృత్‌ ఫేజ్‌-2 నిధులతో తలపెట్టిన కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ల క్రితం మొత్తం 20.36 కి.మీ మేర నిర్మించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టగా ఇప్పటి వరకూ 11.84 కి.మీ మేర మాత్రమే కాలువలు పూర్తయ్యాయి.
  • రైల్వే స్టేషన్‌ నుంచి సాయిబాబా ఆలయం వరకూ నిర్మించాల్సిన 4.2 కి.మీ కాలువ, 532 మీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగారు.
  • కాతేరు నుంచి నల్లా ఛానల్‌ అనుసంధానంగా 2.3 కి.మీ నిర్మించాల్సిన కాలువ నిర్మాణ పనులు ఆసలు ఆరంభించలేదు.
  • కోటగుమ్మం నుంచి ఆవ ఛానల్‌ వరకూ   1.7 కి.మీ కాలువ ఇప్పటి వరకూ 250 మీటర్లు మాత్రమే పనులు జరిగాయి.

ఈ ప్రాంతాల్లో సమస్య

రాజమహేంద్రవరం

  • ఛానల్‌కు ఆనుకొని ఉన్న ఆర్యాపురం, తుమ్మలావ, రామచంద్రరావుపేట, ఆదెమ్మదిబ్బ, జయరామ్‌, నటరాజ్‌ థియేటర్‌, గోకవరం బస్టాండ్‌ వెనుక వీధులన్నీ నీట మునిగిపోతున్నాయి. నల్లా ఛానల్‌ వద్ద ఎన్‌ఆర్‌సీపీ ప్లాంటు ఉన్నప్పటికీ నీటిని పంపింగ్‌ చేయడంలో ఆలస్యమవుతుండడమే ఇందుకు కారణం. వర్షాకాలంలో నీటి ఒత్తిడిని తట్టుకునేలా ఆర్యాపురం వద్ద చెరువు ఏర్పాటు చేయగా.. నిర్వహణ లేకపోవడం సమస్యగా మారింది.
  • కంబాలచెరువు ఆధునికీకరణకు గత ఏడాది రూ.5 కోట్లతో తలపెట్టిన పనులు పూర్తికావాల్సి ఉంది.
  • కోటిపల్లి బస్టాండ్‌, ఆల్కట్‌ గార్డెన్స్‌, రైల్వేస్టేషన్‌ మీదుగా అమృత్‌ నిధులు రూ.7 కోట్లతో ప్రధాన కాలువ నిర్మించాలని ప్రతిపాదించినా స్థలం కోసం రైల్వే శాఖకు సుమారు రూ.10 కోట్లు వరకూ చెల్లించాల్సి రావడంతో ఆగిపోయింది.
  • నేతాజీనగర్‌, రామకృష్ణానగర్‌, చైతన్యనగర్‌, ఆవ ప్రాంతంలో ముంపు నివారణకు రూ.4 కోట్లతో  పంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదన టెండర్ల దశలోనే నిలిచిపోయింది.

భూగర్భ డ్రైనేజీ అవసరం

ముంపు సమస్య నివారణకు భూగర్భ కాలువ వ్యవస్థ ఏర్పాటు అవసరం. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గతంలోనే దీన్ని సూచించింది. పటిష్ఠమైన కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.ఎస్‌టీపీ ఏర్పాటు చేసి మురుగు నీటిని శుద్ధిచేసి భూగర్భ కాలువల ద్వారా ధవళేశ్వరం తర్వాత నదిలో కలపాలని గతంలోనే ప్రతిపాదించారు. ఇప్పటి వరకూ పాలకులు దీనిపై దృష్టి సారించడం లేదు.

పతంజలి శాస్త్రి, జాతీయ పర్యావరణ శాస్త్రవేత్త


దశలవారీగా చేస్తున్నాం...

నగరంలో ముంపు నివారణలో భాగంగా కాలువల ఆధునికీకరణకు రూ.200 కోట్లు వరకూ ఖర్చవుతుందని అంచనా వేశాం. దశల వారీ పనులు చేస్తున్నాం. ఆల్కట్‌ గార్డెన్స్‌, పేపరుమిల్లు రోడ్డు, కోరుకొండ రోడ్డు, మెయిన్‌ రోడ్డు మీదుగా కాలువ విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కంబాలచెరువు పార్కు పనులు చివరి దశలో ఉన్నాయి. తుమ్మలావ ప్రాంతాల్లో కాలువ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.

దినేష్‌కుమార్‌,కమిషనర్‌, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌


ఏటా ఆందోళనే

ఏటా ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వరద భయంతో వణికిపోతున్నాం. ఉప్పుటేరుకు సమీపంలో మా నివాసాలున్నాయి. 2021లో వచ్చిన వరదలకు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. పిల్లలకు పాలు తెచ్చుకోడానికి పడవలపై వెళ్లాల్సి వచ్చింది. తిండికి తీవ్ర ఇబ్బంది పడ్డాం. ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలి.

ఓలేటి ధనలక్ష్మి, ప్రేజరుపేట


అన్ని చర్యలు చేపడుతున్నాం..

ముంపు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 44 కి.మీ మేర మేజర్‌ డ్రెయిన్లలో పూడిక తొలగించాం.  48వ డివిజన్‌లో రూ.10 లక్షలతో పూడికతీత పనులు పూర్తి చేశాం. మిగతా నిధులకు కలెక్టర్‌కు నివేదించాం. ఉప్పుటేరు కాలువకు రక్షణ గోడ అంశం పెండింగ్‌లో ఉంది. స్మార్ట్‌సిటీలో ప్రతిపాదనలు చేశాం. ముంపుబారిన పడుతున్న 17 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాం.

పి.సత్యకుమారి, పర్యవేక్షక ఇంజనీరు, కాకినాడ కార్పొరేషన్‌


రాజమహేంద్రవరంలో ప్రధాన రహదారి సమీపంలో ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని