logo

ఉదయం నుంచి ఉత్కంఠ

వెెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు మంగళవారం వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామంలో ఉదయం నుంచే ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఏవిధంగా ఉంటుందన్న అంశంపై వారం రోజులుగా ఇక్కడ చర్చ నడుస్తోంది.

Published : 17 Apr 2024 06:28 IST

వెంకటాయపాలెంలో ఆంక్షలు

వెంకటాయపాలెంలో బాధితుల నివాసాల వద్ద పోలీసుల బందోబస్తు

ద్రాక్షారామ, రామచంద్రపురం, న్యూస్‌టుడే:  వెెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు మంగళవారం వచ్చిన నేపథ్యంలో ఆ గ్రామంలో ఉదయం నుంచే ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఏవిధంగా ఉంటుందన్న అంశంపై వారం రోజులుగా ఇక్కడ చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ నెల 12న తీర్పు ఇస్తామని తొలుత ప్రకటించినా.. తర్వాత 16వ తేదీకి వాయిదాపడిన విషయం తెలిసిందే.  రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో సీఐ దొరరాజు, స్థానిక పోలీసులు, సీఆర్పీ బలగాలు ద్రాక్షారామ, వెంకటాయపాలెం, బోస్‌ కూడలి, యానాం సెంటర్లలో బందోబస్తు నిర్వహించారు. గ్రామంలోని బాధితుల ఇళ్ల వద్ద కూడా పహారా కాశారు. శిరోముండనం ఘటనలో బాధితులు అయిదుగురిలో పువ్వల వెంకటరమణ మృతి చెందగా మిగిలిన నలుగురిలో దడాల వెంకటరత్నం కాకినాడలో కానిస్టేబుల్‌గా, కోటి చినరాజు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. చల్లపూడి పట్టాభి విశాఖలో కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. కనికెళ్ల గణపతి మాత్రమే వెంకటాయపాలెంలో అందుబాటులో ఉన్నారు.

అంగర: పడమర కండ్రికలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న దళిత సంఘాల నాయకులు

నివాళి అర్పించేందుకు ఆంక్షలు: ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో ప్రదర్శనలు, సభల నిర్వహణపై ఆంక్షలు ఉండడం.. తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహాలకు దండ వేయడానికీ అంగీకరించలేదు. తీర్పు వచ్చిన వెంటనే ద్రాక్షారామ యానాం కూడలిలో గల విగ్రహానికి నివాళి అర్పించడానికి వేగాయమ్మపేటకు చెందిన చెట్లర్‌ కర్ణ అనే వ్యక్తి పూలమాలతో రాగా అడ్డగించారు. స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వివిధ సంఘాల నేతలు క్షీరాభిషేకాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని