చంపేస్తామన్నా భయపడలేదు!

పగలంతా ఆ చిన్నారి ఎదురుచూసేది రాత్రి ఎప్పుడవుతుందా అనే! ఎంచక్కా నాన్న పక్కగా చేరి, బోలెడు కథలు వినొచ్చు. ఆ కథలోని పాత్రలన్నీ కళ్ల ముందు కదులుతూ ఉంటే... ఎప్పుడు నిద్రలోకి జారేదో కూడా తెలియదు. వాటిపై ప్రేమతో మరిన్ని కథల్ని రాసిన ఆ అమ్మాయి తరవాత నిజాల్ని వెలికి తీయడం ప్రారంభించింది.

Updated : 30 Apr 2024 05:39 IST

పగలంతా ఆ చిన్నారి ఎదురుచూసేది రాత్రి ఎప్పుడవుతుందా అనే! ఎంచక్కా నాన్న పక్కగా చేరి, బోలెడు కథలు వినొచ్చు. ఆ కథలోని పాత్రలన్నీ కళ్ల ముందు కదులుతూ ఉంటే... ఎప్పుడు నిద్రలోకి జారేదో కూడా తెలియదు. వాటిపై ప్రేమతో మరిన్ని కథల్ని రాసిన ఆ అమ్మాయి తరవాత నిజాల్ని వెలికి తీయడం ప్రారంభించింది. అంతేనా... కొన్ని వేలమంది అమ్మాయిల విముక్తికీ, కఠిన చట్టాలకూ కారణమైంది. రుచిరా గుప్తా... ఎవరీమె?

ప్రఖ్యాత ‘ఎమ్మా’ పురస్కారాలను అందించే వేదికది. దానిపై నిల్చొన్నారు రుచిరా. తన డాక్యుమెంటరీ ‘ద సెల్లింగ్‌ ఆఫ్‌ ఇన్నోసెంట్స్‌’ అవుట్‌స్టాండింగ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కేటగిరీలో పురస్కారానికి ఎంపికైంది. చుట్టూ కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లు, ఫ్లాష్‌మనే కెమెరాలు, ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నా... ఆమె మనసంతా డాక్యుమెంటరీలోని అమాయక ముఖాలపైనే ఉంది. అందుకే వారికోసం ఏదైనా చేయాలనుకున్నారామె. కోల్‌కతాలోని మార్వాడీ కుటుంబం రుచిరాది. నాన్న చెప్పిన కథలకు ప్రభావితమై పదేళ్లు కూడా లేని వయసులో స్కూల్‌ మేగజీన్‌ కోసం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ పెన్సిల్‌’ రాశారు. అది తెచ్చిన ప్రశంసలతో జర్నలిస్ట్‌ అవ్వాలనుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే ‘టెలిగ్రాఫ్‌’లో చేరారు. 20 ఏళ్లు కూడా లేని రుచిరాని చూసి అంతా ‘కిడ్డీ’ అని పిలిచేవాళ్లట. ఒకప్పుడు అంతా చిన్నపిల్లగా లెక్కేసినా రుచిరా... తరవాత మహిళలు, నిమ్నవర్గాల గొంతుకగా మారి ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి, ఆశ్చర్యపరిచారు. బీబీసీ సహా ప్రముఖ వార్తాసంస్థలతో కలిసి పనిచేశారు.

జర్నలిజం వదిలి...

న్యూస్‌ కవరేజీ కోసం ఓసారి నేపాల్‌ పర్వత ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లారు రుచిరా. ఎక్కడా ఈడొచ్చిన అమ్మాయిల జాడేలేదు. అదేమని ప్రశ్నిస్తే... ‘వాళ్లంతా ముంబయిలో ఉన్నా’రన్న సమాధానం వచ్చింది. సందేహించిన ఆమె సమాచారం సేకరిస్తూ వెళ్తే అతిపెద్ద విమెన్‌ ట్రాఫికింగ్‌ గురించి తెలిసింది. దాన్నే ‘ద సెల్లింగ్‌ ఆఫ్‌ ఇన్నోసెంట్స్‌’ ద్వారా ప్రపంచం ముందు ఉంచారు రుచిరా. తరవాత జర్నలిజాన్ని వదిలి ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్‌గా చేరారు. సెక్స్‌ వర్కర్లుగా మారిన మహిళల జీవితాలపై అధ్యయనం చేసి, ముంబయి రెడ్‌లైట్‌ ఏరియాకు చేరుకున్నారు. తన డాక్యుమెంటరీ చూపి, వాళ్ల జీవితాల్లో మార్పు తేగలనన్నారు. అలా తనతో నడిచిన 22 మంది ఆడవాళ్లతో 2002లో ‘అప్‌నే ఆప్‌ విమెన్‌ వరల్డ్‌వైడ్‌’ ప్రారంభించారు రుచిరా.

తలరాతలు మార్చి...

పిల్లలకు స్కూలు సదుపాయం... ఆ మహిళలకు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ సబ్సిడీలు, తిండి, హెల్త్‌కేర్‌, ఉచితగృహాలు అందేలా చూడటమే కాదు, స్వయం సంఘాలుగా ఏర్పాటు చేసి, ఉపాధి కల్పించారు. అలా దాదాపు 25వేల మందిని ఆ మురికికూపం నుంచి బయటపడేశారు. అమ్మాయిలకు స్వీయరక్షణ తరగతులనూ ఏర్పాటు చేశారు. వారు కుదురుకున్నాక సేకరించిన సమాచారంతో దాదాపు 100 మంది హ్యూమన్‌ ట్రాఫికర్లు జైలుకి వెళ్లేలా చేశారు. ఈమె సేవలు భారత్‌తోపాటు నేపాల్‌, థాయ్‌లాండ్‌, ఇరాన్‌, యూఎస్‌ సహా ఎన్నో దేశాలకూ విస్తరించాయి. ఈక్రమంలో ఫ్రెంచ్‌ అత్యుత్తమ పురస్కారం, క్లింటన్‌ గ్లోబల్‌ సిటిజన్‌ అవార్డు సహా పురస్కారాలెన్నో అందుకున్నారు. అంతేకాదు, యూఎన్‌ ట్రాఫికింగ్‌ ఫండ్‌, ట్రాఫికింగ్‌ విక్టిమ్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌కు కారణమయ్యారు. సెక్స్‌ ట్రాఫికింగ్‌పై కోర్సులు రూపొందించి, న్యూయార్క్‌ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాల్లో బోధనలూ కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె దాటుకొచ్చిన అపాయాలూ ఎన్నో! ‘ఓరోజు ఇలాగే మురికికూపంలో చిక్కుకున్న అమ్మాయిలతో మాట్లాడుతున్నా. ఈ సంగతి తెలిసి ఒక వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి, ‘మర్యాదగా వెళ్లిపోకపోతే చస్తావ్‌’ అని బెదిరించాడు. ఒక్కగది. తలుపును అడ్డగిస్తూ అతను. తప్పించుకునే మార్గం లేదు. మెడకి గాయమై రక్తం కారుతున్నా... నేను భయపడలేదు. నా కళ్లల్లో ధైర్యాన్ని చూసిన ఆ ఆడవాళ్లు అతన్ని ఎదురించారు. వలంటీర్లు చనిపోయారు, పోలీసులతోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా నా పోరాటం ఆపలేదు’ అనే రుచిరా అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపడానికి తను చూసిన కథలతో ‘ఐ కిక్‌ అండ్‌ ఐ ఫ్లయ్‌’ అనే పుస్తకాన్ని రాశారు.

‘‘నువ్వీ వృత్తిలో కొనసాగకపోతే వేరే అమ్మాయిలకు ప్రమాద’మని చెప్పి ఫాతిమాని వేశ్యావృత్తిలోకి బలవంతంగా దింపాలనుకున్నారు. మిగతావారిలా తన తలరాత ఇంతే అని సరిపెట్టుకోవాలి అనుకోలేదా 15ఏళ్లమ్మాయి. చనిపోయినా పర్లేదనుకొని పారిపోయి మా దగ్గరికి వచ్చింది. చిగురుటాకులా వణుకుతోన్న ఆమెను మేం ఆదరించడమే కాదు, తిరిగి పంపకుండా ఉండటానికి చాలానే కష్టపడ్డాం. ఇప్పుడా అమ్మాయి బాగా చదువుకుంది. నాయకురాలిగా మారి, తనలాంటి వారి తరఫున పోరాడుతోంది. తన చెల్లినీ ఆ మార్గం నుంచి బయటపడేసింది. ఇలాంటి సంతృప్తినిచ్చే కథలెన్నో. నాకిప్పుడు 60 ఏళ్లు. అమ్మాయిలను ‘కొనడం- అమ్మడం ఉండకూడదు. ఆ లక్ష్యంతోనే తుదికంటా పోరాడతా’నంటారు రుచిరా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్