వివేకా హత్యలో సునీల్‌

మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్‌ యాదవ్‌ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.

Updated : 30 Apr 2024 06:53 IST

తగిన ఆధారాలున్నాయి
హత్యకు అవినాష్‌ అండదండలు
బెయిల్‌ ఇస్తే పారిపోతారు.. సీబీఐ వాదన
తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్‌ యాదవ్‌ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. హత్య జరిగిన సమయంలో సునీల్‌.. వివేకా ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా తేలిందని పేర్కొంది. వివేకా హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌ తల్వార్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది గూగుల్‌ టేక్‌ ఔట్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, హత్య సంఘటనలో సునీల్‌ యాదవ్‌ పాల్గొన్నారనడానికి అదొక్కటే ఆధారం కాదన్నారు. 

‘‘వివేకా ఇంటి వద్ద వాచ్‌మెన్‌ రంగన్న, అప్రూవర్‌ దస్తగిరిలు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకారం సునీల్‌ యాదవ్‌ పాత్ర ఉంది. వివేకా హత్య అనంతరం పారిపోతుండగా గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌ యాదవ్‌లను గుర్తించినట్లు రంగన్న వాంగ్మూలం ఇచ్చారు. దీనికితోడు సీసీ టీవీ ఫుటేజీ, హత్యకు ముందు, తరువాత నిందితుల మధ్య ఫోన్‌ సంభాషణలకు కాల్‌ డేటా రికార్డు ఉన్నాయి. హత్యకు ముందురోజు సునీల్‌ యాదవ్‌, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డిలు గంగిరెడ్డి ఇంటివద్ద కలిశారు. వివేకా హత్య నిమిత్తం గొడ్డలి కొనాలంటూ దస్తగిరికి సునీల్‌యాదవ్‌ చెప్పారు. పులివెందులలో కొంటే తెలిసిపోతుందని, కదిరికి వెళ్లి తీసుకురమ్మని పురమాయించారు. ఇదే విషయాన్ని దస్తగిరి వెల్లడించారు. గొడ్డలి విక్రయించిన వ్యక్తిని సీబీఐ విచారించగా దస్తగిరి చెప్పిన సమాచారానికి అనుగుణంగానే ఉంది.

వివేకా హత్యకు కుట్ర, దాన్ని అమలు చేయడం, సాక్ష్యాల ధ్వంసంలో సునీల్‌యాదవ్‌ పాత్ర ఉంది. హత్య అనంతరం సాక్ష్యాల ధ్వంసం గురించి ఆందోళన అవసరం లేదని.. అవన్నీ శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి చూసుకుంటారని గంగిరెడ్డి చెప్పారు. అంటే సాక్ష్యాలను ధ్వంసం చేయాలని వీరు ముందుగానే ప్రణాళిక రూపొందించారన్నమాట. వివేకా హత్యకు గంగిరెడ్డి నుంచి సునీల్‌ యాదవ్‌ రూ. కోటి తీసుకున్నారు. అందులో దస్తగిరికి రూ.75 లక్షలు ఇచ్చి రూ. 25 లక్షలు తరువాత ఇస్తానని చెప్పారు. దస్తగిరికి ఇచ్చిన సొమ్మును మున్నా వద్ద దాచి ఉంచగా రూ. 46 లక్షలు రికవరీ చేశారు. పరిస్థితుల ప్రకారం ఉన్న ఆధారాలను పరిశీలించినా సునీల్‌యాదవ్‌ పాత్ర ఉన్నట్లు తేలుతుంది.

వివేకాను దారుణంగా హత్య చేసి, తరువాత డ్రైవర్‌ దీనికి కారణమంటూ ఆయనతో బలవంతంగా లేఖ రాయించారు. హత్యపై వివేకా కుమార్తె, భార్య రాకముందే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు బలవంతులు. సాక్షులను ప్రభావితం చేయగలరు. సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డిలు ముందు స్టేట్‌మెంట్‌ ఇచ్చి తరువాత మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. సునీల్‌యాదవ్‌ను గోవాలో అరెస్ట్‌ చేశాం. ప్రస్తుతం బెయిల్‌ ఇస్తే పారిపోయే అవకాశం ఉంది. శివశంకర్‌రెడ్డి కుట్రలో పాల్గొంటే, నిందితుడు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. అందువల్ల శివశంకర్‌రెడ్డి బెయిలుతో పోలిక లేదు. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలి’’ అని కోరారు.

సునీల్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సునీల్‌ సీబీఐ కస్టడీలో 25 రోజులపాటు ఉన్నారని, తరువాత కుటుంబంతో గోవా వెళ్లారన్నారు. సీబీఐ కస్టడీలో ఉన్నపుడు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. సునీల్‌ యాదవ్‌ రూ.25 లక్షలు తీసుకుంటున్నట్లు సీబీఐ చెబుతోందని ఆ మొత్తాన్ని, గొడ్డలిని రికవరీ చేయలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని