logo

జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి.

Published : 20 Apr 2024 02:35 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నామపత్రాలు చొప్పున దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరూ నామపత్రాలు దాఖలు చేయలేదన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున దగ్గుబాటి పురందేశ్వరి నామపత్రాలను సమర్పించగా అనపర్తిలో తెదేపా తరఫున నల్లమిల్లి మహాలక్ష్మి, రాజానగరంలో వైకాపా తరఫున జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌, గంధం రాజశ్రీ, రాజమహేంద్రవరం గ్రామీణలో తెదేపా తరపున గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కొవ్వూరులో తెదేపా తరపున ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున అరిగెల అరుణకుమారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున బొంతా శ్యామ్‌రవిప్రకాష్‌, నిడదవోలులో జనసేన తరఫున కందుల లక్ష్మీదుర్గేష్‌ప్రసాద్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ(ఎ.ఐ.ఎఫ్‌.బి.) తరపున కస్తూరి సత్యప్రసాద్‌, గోపాలపురంలో వైకాపా తరపున తానేటి వనిత, జొన్నకూటి బాబాజీరావు నామపత్రాలు దాఖలు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.  


కోడ్‌కు దొరకకుండా కొత్త ఎత్తులు

 ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థి నామినేషన్‌ ఘట్టం తీరు

ప్రత్తిపాడు: ఎన్నికల నిబంధనలను ఎన్నున్నా.. పక్కదారులు, ప్రత్యామ్నాయాలు ఎన్నో‘కళలు’గా ప్రత్యక్షమవుతుంటాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో శుక్రవారం జరిగిన వైకాపా అభ్యర్థి వరుపుల సుబ్బారావు నామినేషన్‌ ఘట్టం ఇందుకొక ఉదాహరణగా నిలుస్తుంది. ఒక వంక ‘సిద్ధం’ సభకు జన సమీకరణ.. మరో వైపు నామినేషన్‌ వెరసి పెద్ద ఎత్తున హంగామానే చోటు చేసుకుంది. తరలించిన జనానికి హైవే సమీపంలో ఏర్పాటైన ఓ పుట్టిన రోజు వేడుకలో భాగం చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరు ఎవరో ఎవరికెరుక. అదలావుంచి.. మందికి ‘మందే’ ముందు.. అది సహజంగానే చిందులేయించింది. వైకాపా అభ్యర్థి వరుపుల నామినేషన్‌ వేసేందుకు తన కుమారుడు సూరిబాబు, ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌, శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబులను వెంట పెట్టుకుని ఒక సెట్టు నామినేషన్‌ పత్రాలను  దాఖలు చేశారు. నామినేషన్లు స్వీకరణ కేంద్రానికి సమీపంలోని రహదారిపైనే వైకాపా శ్రేణుల కోలాహలం అది నామినేషన్‌దా..? సిద్ధం జనసమీకరణదా..? లేకుంటే అదంతా ఓ ప్రయివేటు పుట్టినరోజు..? వేడుకదా అనేది ఎన్నికల వ్యయ పరిశీలకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నేగా..!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు