logo

ప్రగల్భాలే.. పైసా విదల్చలే..

అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్‌ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి.

Published : 30 Apr 2024 06:11 IST

అర్ధాంతరంగా ఆగిన ఏలేరు ఆధునికీకరణ

గెద్దనాపల్లిలో నిర్మించిన రెగ్యులేటరు

కిర్లంపూడి, న్యూస్‌టుడే: అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్‌ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి. ఎన్నికల ముందు పాదయాత్రలోను, ముఖ్యమంత్రి అయిన తరువాత ఏలేరు ఆయకట్టు పరిధిలోని ప్రాంతాల్లో ఆధునికీకరణపై జగన్‌ చేసిన ప్రకటనలు ప్రగల్భాలుగానే మిగిలాయి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి నిధులను కూడా విదల్చలేదు. రూ.137 కోట్లతో చేపట్టిన తొలి దశ పనులలో సుమారు యాబై శాతం వరకు పూర్తయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులలో ఏలేరు పేరు లేకుండా చేశారు. దీంతో గతంలో చేసిన పనులకు ఈ ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను వదిలేసి వెళ్లారు. దీంతో ఏలేరు వరదలకు ఆధారిత ఆయకట్టు 67 వేల ఎకరాల్లో రైతులు కోట్లలో పంట నష్టాలను చవిచూశారు. పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులకు బీమా సొమ్ము రాలేదు.

రూ.137 కోట్లతో చేపట్టిన పనుల పరిస్థితి ఇది...

ఏలేరు ఆధునికీకరణలో తొలిదశ పనులను రూ.137 కోట్లతో చేపట్టారు. ఈపనుల్లో కాలువల విస్తరణకు 360 ఎకరాల భూసేకరణ అవసరమైంది. గత ప్రభుత్వంలో 130 ఎకరాలు భూసేకరణచేసి రైతులకు డబ్బులు చెల్లించారు. ఇంకా 230 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా వాటికి రూ.72 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కాలువల విస్తరణ పనులు నిలిచిపోయాయి. అప్పటికే రూ.60 కోట్లతో సాగునీటి నిర్మాణాలు, కాలువల విస్తరణ కోసం భూసేకరణకు రూ.30కోట్లు, ఇతర అవసరాలకు మరో రూ.పది కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణాల పనులు 80 శాతం వరకు పూర్తి కాగా కాలువల విస్తరణ పనులు కేవలం పది శాతం మాత్రమే పూర్తయ్యాయి.

రెండో దశ ఊసేలేదు

ఏలేరు వరదల వల్ల తరచూ ముంపునకు గురయ్యే గొల్లప్రోలు ప్రాంతంలో సీఎం హోదాలో వచ్చిన జగన్‌ ఏలేరు ఆధునికీకరణ రెండో దశ పనులతో కలిసి రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు 2022లో గొప్పగా ప్రకటించారు. ఇది జరిగి రెండేళ్లు అయినా ఒక్కరూపాయి కూడా మంజూరు చేయలేదు. సుద్దగడ్డ వాగు, ఏలేరు వరదలు వల్ల కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని ఊర్లు, ఏరులు ఒక్కటై జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈసమస్యకు పరిష్కారంలో భాగంగా మొదటి, రెండో దశ పనులకు రూ.474 కోట్ల అవసరమని అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు.  రెండో దశ పనులకు, కాలువల విస్తరణకు 265 ఎకరాలు భూసేకరణ చేయాల్సిఉంది. దీనికి రూ. 121 కోట్లు అవసరం.


ఏటా వరదలతో రూ.కోట్లు రైతులు పణంగా పెడుతున్నారు

ఏలేరు ప్రాజెక్టు 24 టిఎంసీల నీటిని నిల్వచేయగల సామర్థ్యం ఉంది. ఆపైన ఏ స్థాయిలో నీరు వచ్చిన వరద నీరుగా కిందికి వదలాల్సిందే. ప్రాజెక్టుకు వరదకాలువ అంటూ ప్రత్యేకంగా ఏదీలేదు. పైగా ఆధారిత ఆయకట్టులో 72 కాలువలు ఓపెన్‌ హెడ్‌ ఛానల్స్‌గానే ఉన్నాయి. దీనివల్ల వరదనీరు నేరుగా పంటలను ముంచెత్తుంది. 2019 ఆగస్ట్టులో ఏలేరు భారీవరదలు కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆసమయంలో జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 42 వేల ఎకరాల్లో వరి, మరో 25 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆసమయంలో రైతులు సుమారుగా రూ.వందకోట్ల విలువైన పంటలను పణంగా పెట్టారు. తరువాత 2020, 2021, 2022 సంవత్సరాల్లోను ఏలేరు వరదలు కారణంగా రైతులు పంటలను కోల్పోయారు. ఈనాలుగేళ్ళలలో సుమారుగా రూ.300 కోట్లు విలువచేసే పంటలు దెబ్బతిన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని